
రైల్వేలపై దాడులకు కుట్ర పన్నిన ఉగ్రవాదులు
అదుపులోకి తీసుకున్న యూపీ ఏటీఎస్, నిందితుల్లో హిందువులు
భారతీయ రైల్వేలపై దాడులు సహ దేశంలోకి కీలక ప్రాంతాలలో పేలుళ్లకు ప్రణాళికలు రచిస్తున్న నలుగురు ఉగ్రవాదులను శుక్రవారం అరెస్ట్ చేసినట్లు ఉత్తర ప్రదేశ్ ఉగ్రవాద నిరోధక దళం(ఏటీఎస్) అధికారులు తెలిపారు. వీరికి పాకిస్తాన్ హ్యండ్లర్ నుంచి ఆదేశాలు అందుతున్నట్లు నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారం మేరకు అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు.
వీరు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా పాకిస్తాన్‌కు చెందిన హ్యాండ్లర్లతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నారు. దేశంలో భయాన్ని వ్యాప్తి చేయడం, ఆర్థిక నష్టాన్ని కలిగించడం లక్ష్యంగా దేశ వ్యతిరేక కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ ఉగ్రవాద ముఠా ప్రధాన కార్యకర్త, మీరట్ జిల్లా నివాసి అయిన సాకిబ్ అలియాస్ "డెవిల్" (25) గా పోలీసులు గుర్తించారు. టెలిగ్రామ్, సిగ్నల్, ఇన్‌స్టాగ్రామ్ వంటి ఎన్‌క్రిప్టెడ్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా హ్యాండ్లర్లతో సంప్రదింపులు జరుపుతున్నాడని, అతనికి తీవ్రవాద గ్రూపులతో సంబంధాలు ఉన్నాయని వెల్లడైంది. అతని ఫోన్ కాంటాక్ట్ లిస్ట్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో సహా విదేశీ ఫోన్ నంబర్లు లభించాయని దర్యాప్తు వర్గాలు తెలిపాయి.
ఈ బృందంలోని సభ్యులకు దేశంలోని ముఖ్యమైన సంస్థలు , రాజకీయ ప్రముఖులపై రెక్కీ నిర్వహించడం, సున్నితమైన సమాచారాన్ని వారి హ్యాండ్లర్లతో పంచుకోవడం వంటి బాధ్యతలు అప్పగించారు. వారు భారీ నష్టాన్ని కలిగించి, భయాందోళనలను సృష్టించేందుకు రైల్వే సిగ్నల్ బాక్సులు, వాహనాలు, గ్యాస్ సిలిండర్లను తీసుకువెళ్లే ట్రక్కులపై కూడా దాడులకు ప్రణాళిక రచిస్తున్నారని ప్రాథమిక విచారణలో తేలింది.
ఒక పత్రికా ప్రకటన ప్రకారం, నిందితులు కొన్ని ప్రదేశాలలో చిన్నపాటి దహనకాండ ఘటనలకు పాల్పడి, క్యూఆర్ కోడ్‌ల ద్వారా బదిలీ చేసిన డబ్బుకు బదులుగా ఈ చర్యలకు సంబంధించిన వీడియోలను తమ హ్యాండ్లర్లకు పంపినట్లు ఏటీఎస్ దర్యాప్తులో వెల్లడైంది.
మతపరమైన కారణాలతో వాహనాలు, ప్రభుత్వ ఆస్తులను లక్ష్యంగా చేసుకునేలా నిందితులను రెచ్చగొట్టడానికి, అలాగే ప్రజాశాంతికి భంగం కలిగించే విస్తృత కుట్రను అమలు చేయడానికి హ్యాండ్లర్లు సోషల్ మీడియాలో రెచ్చగొట్టే గుర్తింపు చిహ్నాలను, కథనాలను ఉపయోగించారని ఏటీఎస్ తెలిపింది.
నిందితులు తమ సహచరులతో కలిసి ఘజియాబాద్, అలీగఢ్, లక్నో వంటి నగరాల్లో రెక్కీ నిర్వహించి, లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉన్న ప్రదేశాల వీడియోలను, గూగుల్ లొకేషన్ వివరాలను తమ హ్యాండ్లర్లతో పంచుకున్నారని సమాచారం.
ఏప్రిల్ 2న, లక్నో రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థలు, ఇతర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని దహనకాండ లేదా పేలుడుకు పాల్పడాలని ఈ బృందం ప్రణాళిక వేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే, ఈ ప్రణాళిక అమలుకాకముందే ఏటీఎస్ బృందం నిందితులను అడ్డగించి అరెస్టు చేసింది.
సాకిబ్‌తో పాటు, గౌతమ్ బుద్ధ నగర్ నివాసులైన వికాస్ గెహ్లావత్ అలియాస్ రౌనక్ (27), లోకేష్ అలియాస్ పాప్లా పండిట్ అలియాస్ బాబు అలియాస్ సంజు (19), మీరట్‌కు చెందిన అర్బాబ్ (20)లను అరెస్టు చేశారు. లక్నోలోని ఏటీఎస్ పోలీస్ స్టేషన్‌లో వీరిపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (యూఏపీఏ)లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, నిందితులను కోర్టులో హాజరుపరిచారు.
విదేశీ ఆదేశాల మేరకు విధ్వంసకర, ఉగ్రవాద చర్యలను ప్రేరేపించడం ద్వారా దేశ సార్వభౌమత్వం, ఐక్యత సమగ్రతకు హాని కలిగించే ఉద్దేశ్యంతో ఈ బృందం పనిచేస్తోందని ప్రాథమిక విచారణలో తేలిందని అధికారులు తెలిపారు.
Next Story

