పశ్చిమ బెంగాల్‌లో కొనసాగుతోన్న జుడాల ఆందోళన
కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య ఘటనలో బాధితురాలు, ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని జూనియర్ డాక్టర్లు చేస్తోన్న సమ్మె ఆదివారానికి పదో రోజుకు చేరుకుంది.
కోల్‌కతా RG కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్ అత్యాచారం హత్య ఘటనలో బాధితురాలు, ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని పశ్చిమ బెంగాల్‌లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లోని జూనియర్ డాక్టర్లు చేస్తోన్న సమ్మె ఆదివారానికి పదో రోజుకు చేరుకుంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్య సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ సేవలు స్తంభించగా.. సీనియర్ వైద్యులు మాత్రం అత్యవసర సేవలకు హాజరవుతున్నారు.
'నిరసన కొనసాగిస్తాం’
"రోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను మేం అర్థం చేసుకోగలం. అయితే డ్యూటీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య జరిగినప్పుడు నిరసన తెలపడం మా బాధ్యత. మా సోదరికి న్యాయం జరిగే వరకు మా నిరసన తెలుపుతాం. ప్రభుత్వం మాకు పూర్తి భద్రత కల్పించేవరకు ఆందోళన కొనసాగుతుంది’’ అని ఒక డాక్టర్ చెప్పారు.
కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ..
కోల్‌కతా RG కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో మహిళా పోస్ట్‌గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్‌ను అత్యాచారం చేసి ఆపై హత్య చేశారు. ఈ ఘటన ఆగస్టు 9న జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ఒక పౌర వలంటీర్‌ను మరుసటి రోజు పోలీసులు అరెస్టు చేశారు. కాగా నిందితుడిని వీలైనంత త్వరగా శిక్షించాలని, బాధితురాలి పోస్ట్‌మార్టం నివేదికను బహిర్గతం చేయాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. కోర్టు ఆదేశాల మేరకు ఈ ఘటనపై ఇప్పటికే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి దర్యాప్తు మొదలుపెట్టింది.