
అమాంతంగా పెరిగిన బంగారం ధర..
దడ పుట్టిస్తున్న పసిడి, వెండి ధరలు
బంగారం(Gold), వెండి(Silver) ధరలు అమాంతంగా పెరిగిపోయింది. అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం (US-China tariff war) కారణంగా.. న్యూఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర ఆల్ టైమ్ రికార్డు పలికింది. గరిష్టంగా రూ.98,100లకు చేరుకుంది. ఆ తర్వాత కాస్త తగ్గింది. దేశ రాజధానిలో రూ.97,500, బెంగళూరు (రూ.97,820), హైదరాబాద్ (రూ.97,760), చెన్నై (రూ.97,750), కోల్‌కతా (రూ.97,645) వంటి ధర పలికింది.
వెండి ధరలు కూడా..
బుధవారం కిలో వెండి ధర రూ.1,900 పెరిగి రూ.99,400కి చేరుకుంది. మంగళవారం తెల్లని లోహం కిలో వెండి రూ.97,500 వద్ద ముగిసింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో జూన్ డెలివరీకి సంబంధించిన గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు రూ.1,984 లేదా 2.12 శాతం పెరిగి రికార్డు స్థాయిలో రూ.95,435కి చేరుకుంది.
"అమెరికా ప్రభుత్వం చైనాకు ఎగుమతి సుంకాలను భారీగా పెంచడంతో బంగారం రికార్డు స్థాయికి చేరుకుంది" అని కోటక్ సెక్యూరిటీస్‌లోని AVP-కమోడిటీ రీసెర్చ్ కైనత్ చైన్వాలా అన్నారు. చైనా నుంచి వచ్చే చాలా వస్తువులపై సుంకాలను ఆమెరికా 245 శాతానికి పెంచిందని చెప్పారు.
అమెరికా కేంద్ర బ్యాంకుపై కన్ను
అబాన్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చింతన్ మెహతా ప్రకారం.. యుఎస్ డాలర్ ఇండెక్స్ 100 మార్కు కంటే దిగువకు పడిపోవడంతో బంగారం ధరలు గరిష్టానికి తాకాయని పేర్కొ్న్నారు. వడ్డీ రేటు తగ్గింపు అంచనాలు పెరగడం వల్ల బంగారం ధర పెరగడానికి కారణమైందని చెప్పారు.