ముస్లింలు తప్ప మిగతా శరణార్థులకు పౌరసత్వం ఇచ్చే చట్టం వచ్చింది!
x
CAA Graphic

ముస్లింలు తప్ప మిగతా శరణార్థులకు పౌరసత్వం ఇచ్చే చట్టం వచ్చింది!

సీఏఏని అమలు చేస్తామని 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ హామీ ఇచ్చింది. దీంతో 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందే బీజేపీ తన వాగ్దానాన్ని అమలు పరిచినట్టయింది.


కేంద్ర ప్రభుత్వం తన మాట నెగ్గించుకుంది. పౌరసత్వ సవరణ చట్టం-2019ని తక్షణమే అమల్లోకి తీసుకువచ్చింది. ఈమేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. లోక్‌సభ ఎన్నికల ముందే సీఏఏని అమల్లోకి తీసుకొస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పదేపదే చెబుతూ వచ్చిన మాట కార్యరూపం దాల్చింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీనామా వ్యవహారం దేశమంతటా మంటలు రేకెత్తించిన తరుణంలో ఈ చట్టాన్ని తీసుకువచ్చింది.

2019 డిసెంబర్‌లో ప్రతిపక్షాల తీవ్ర నిరసనల మధ్య సీఏఏ చట్టం 2019 పార్లమెంటు ఆమోదించింది. దీనికి రాష్ట్రపతి కూడా ఆమోదముద్ర వేశారు. పూర్తి నిబంధనలపై స్పష్టత రాకపోవడంతో చాలా కాలంగా ఈ చట్టం అమల్లోకి రాలేదు. ఈ పార్లమెంటు ఎన్నికలు అయిపోయిన తర్వాత అమల్లోకి తెస్తారేమోనని భావించినా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాత్రం తక్షణమే అమల్లోకి తెచ్చారు. సీఏఏ చట్టం అమల్లోకి తెస్తూ సోమవారం సాయంత్రం నోటిఫికేషన్‌ జారీ అయింది.

ఈ చట్టం అమల్లోకి వస్తే ఏమవుతుందీ

పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌ల నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థుల వద్ద తగిన పత్రాలు లేకపోయినా వారికి సత్వరం పౌరసత్వాన్ని ఇచ్చేందుకు ఈ నిబంధనల్ని కేంద్రం రూపొందించింది. 2014 డిసెంబరు 31 కంటే ముందు ఈ మూడు దేశాల నుంచి ఇండియాకి వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలకు ఇవి వర్తిస్తాయి. ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లోనే ముగుస్తుంది. బిల్లు ఆమోదం పొందిన నాలుగేళ్ల తర్వాత చట్టరూపం దాల్చింది. ఈ చట్టం అమల్లోకి రావడంతో మతం ఆధారంగా మొదటిసారి భారత పౌరసత్వ దక్కనుంది.

దేశవ్యాప్త ఉద్యమంలో వంద మందికి పైగా మృతి..

2019లో సీఏఏకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు ఎగసిపడ్డాయి. దాదాపు 100 మంది చనిపోయారు. చాలా మంది గాయపడ్డారు. ప్రతిపక్ష రాజకీయ పార్టీల నాయకులు తీవ్రంగా స్పందించారు. బీజేపీయేతర పాలిత రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. ఈ చట్టాన్ని అమలు చేయబోమంటూ పలు రాష్ట్రాలు శాసన సభలో తీర్మానం కూడా చేశాయి. మొత్తంగా తీవ్ర ప్రతిఘటన పరిస్థితుల మధ్య ఈ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందింది. సీఏఏని అమలు చేస్తామని 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ హామీ ఇచ్చింది. దీంతో 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందే బీజేపీ తన వాగ్దానాన్ని అమలు పరిచినట్టయింది. పార్లమెంటులో బిల్లు ఆమోదాన్ని వ్యతిరేకిస్తూ జరిగిన ఆందోళనలు, పోలీసు చర్యల్లో వందమందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 2020 నుంచి పార్లమెంటరీ కమిటీ నిబంధనలు రూపొందిస్తోందనే కారణంగా హోం శాఖ ఎప్పటికప్పుడు నిబంధనల నోటిఫై చేయడాన్ని పొడిగిస్తూ వస్తోంది. ఇప్పుడు అమల్లోకి తెచ్చింది.

Read More
Next Story