కేజ్రీవాల్‌ని తీహార్‌ జైలు నెంబర్‌ 5లో ఉంచుతారా? బెయిల్ రాదా?
x
Tihar Jails (File)

కేజ్రీవాల్‌ని తీహార్‌ జైలు నెంబర్‌ 5లో ఉంచుతారా? బెయిల్ రాదా?

జైల్లో బాస్, బాస్ కి సేవలందించాల్సింది మాత్రం ఆయన కింద పని చేసేవాళ్లు. విచిత్ర పరిస్థితి ఎదుర్కోబోతున్న ఢిల్లీ తీహార్ జైలు సిబ్బంది..


దేశంలోనే అతిపెద్ద తీహార్‌ జైలుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయా? తీహార్‌ జైలు అధికారులు ఎందకంత హాల్‌ చేస్తున్నారు? కేజ్రీవాల్‌కు బెయిల్‌ రాదని జైలు అధికారులకు ముందే తెలిసిపోయిందా? ప్రస్తుతం జరుగుతున్న ఏర్పాట్లు, తీసుకుంటున్న చర్యలు, సిద్ధం చేస్తున్న గది వంటివి చూస్తుంటే కేజ్రీవాల్‌కి బెయిల్‌ రాదనే నిర్ణయానికే అధికారులు వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో అరెస్ట్‌ అయిన ప్రముఖులందరూ తీహార్‌ జైల్లోనే ఉన్నారు. తాజాగా బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె, ఆ పార్టీ ఎమ్మెల్సీ కె.కవిత కూడా తీహార్‌ జైలుకే వెళ్లారు. మనీలాండరింగ్‌ కేసులో అరెస్ట్‌ అయిన వారికి బెయిల్‌ అంత త్వరగా రాదు. అలాగని త్వరగా కూడా వీళ్లపై కేంద్ర దర్యాప్తు సంస్థలు చార్జిషీట్లు వేయవు. ఫలితంగా సుదీర్ఘకాలం పాటు వీళ్లు జైల్లో ఉండాల్సిందే.


ఇప్పటి వరకు జరిగిన సంఘటనలను బట్టి చూస్తుంటే కేజ్రీవాల్‌కు బెయిల్‌ రాదనేది అర్థమవుతుంది. కేజ్రీవాల్‌ బెయిల్‌ పిటిషన్‌పై బుధవారం అంటే ఇవాళ ఢిల్లీ హైకోర్టులో విచారణ జరుగుతుంది. ఆ తీర్పు కంటే ముందే జైలు అధికారులు తీహార్‌ జైల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. కేజ్రీవాల్‌ మార్చి 28 వరకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కార్యాలయంలోని కస్టడీలో ఉంటారు. మార్చి 21న ఈడీ అరెస్టు చేసిన కేజ్రీవాల్‌ ప్రస్తుత కస్టడీ మార్చి 28తో ముగుస్తుంది. అరెస్టుపై ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను బుధవారం ఢిల్లీ హైకోర్టు విచారించనుంది. తన అరెస్టు, తదుపరి రిమాండ్‌ ‘చట్టవిరుద్ధం– అంటూ కేజ్రీవాల్‌ పిటిషన్‌ పెట్టారు. హైకోర్టులో ఈ పిటిషన్‌ను కొట్టేస్తే ఆయన సుప్రీంకోర్టులో అప్పీలుకు వెళతారు. అదీ విఫలమైతే తీహార్‌ జైలుకు తరలించే అవకాశం ఉంది.

ఎవరెవరు తీహార్‌ జైల్లో ఉన్నారంటే...
కేజ్రీవాల్‌ ముగ్గురు సహచరులు ఇప్పటికే తీహార్‌ జైల్లో ఉన్నారు. రాజ్యసభ ఎంపీ సంజయ్‌ సింగ్, ఢిల్లీ మాజీ మంత్రులు సత్యేందర్‌ జైన్, మనీష్‌ సిసోడియా – ప్రస్తుతం తీహార్‌లో నిర్బంధంలో ఉన్నారు. వీరందరూ ఇతర ఖైదీల మాదిరిగా కాకుండా విడివిడి గదుల్లో ఉన్నారు. జైలు లోపల సెల్‌లో ఇతర ఖైదీల మాదిరిగా కాకుండా ముగ్గురూ ఒంటరిగా ఉన్నారు. జైలు 1లో మనీష్‌సిసోడియా, జైలు 2లో సంజయ్‌ సింగ్, జైలు 7లో సత్యేందర్‌ జైన్‌ ఉన్నారు. ఎక్సైజ్‌ పాలసీలో అక్రమాలకు సంబంధించే సిసోడియా, సింగ్‌ కూడా జైలులో ఉన్నారు. 2022 మేలో ఈడీ అరెస్టు చేసిన జైన్‌– అతనికి సంబంధం ఉన్న నాలుగు కంపెనీల ద్వారా– డబ్బును లాండరింగ్‌ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
కొన్ని గదుల్ని ఖాళీ చేయించిన అధికారులు...
ఢిల్లీ తీహార్‌ జైలు పరిపాలన అంతా ఢిల్లీ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉంటుంది. దాని ఆలనా పాలనా చూడాల్సింది కూడా ఢిల్లీ ముఖ్యమంత్రి. ఆ ముఖ్యమంత్రే కేజ్రీవాల్‌. ఇప్పుడు ఆయనే అదే జైలులో ఉండబోతున్నారు. ఇందుకోసం కొన్ని గదుల్ని పరిశీలించారు. తీహార్‌ ప్రాంగణంలో మొత్తం 9 జైళ్లు ఉన్నాయి. వాటిలో 5 నెంబర్‌ జైలులో కేజ్రీవాల్‌ ను తరలిస్తారని సమాచారం.
‘‘జైలు నెంబర్‌ 5లో కొన్ని సెల్స్‌ను ఖాళీ చేశారు
. ఢిల్లీ సీఎం కోసం జైలు 5లోని ఈ స్థలాన్ని శానిటైజ్‌ చేసే అవకాశం ఉంది. ఇదే కాకుండా, జైలు అధికారులు జైలు 1, 3, 7ను కూడా పరిశీలిస్తున్నారు. క్రూరమైన నేర చరిత్ర కలిగిన ఖైదీలకు దూరంగా కేజ్రీవాల్‌ను ఉంచుతారు’’ అని తీహార్‌ జైలులో కార్యకలాపాల గురించి తెలిసిన అధికారి తెలిపారు. ఢిల్లీలోని జైళ్ల శాఖ ఢిల్లీ ప్రభుత్వ పరిపాలనా పరిధిలోకి వస్తుంది. జైలు అధికారులందరూ– జైళ్ల డైరెక్టర్‌ జనరల్‌ మినహా– మిగతావారందరూ ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగులు. ఆ అధికారి ఇండియన్‌ పోలీస్‌ సర్వీస్‌కు చెందిన అధికారి. పస్తుత జైళ్ల మంత్రి కైలాష్‌ గహ్లోట్‌.
ముఖ్యమంత్రిని నిజంగా తీహార్‌కు తీసుకువస్తే, ఇతర ఆప్‌ నేతల మాదిరిగానే ఆయనను ఒంటరిగా సెల్‌లో ఉంచే అవకాశం ఉంది.‘బెయిల్‌ పిటిషన్‌ రద్దయి ఆయన్ని జైలుకు తీసుకువస్తేసెల్‌ ఉన్న ప్రదేశం భిన్నంగా ఉంటుంది. ఇతర ఆప్‌ నేతలతో ఎటువంటి సంబంధం లేకుండానే ఉంచుతారు. కేంద్రం కేజ్రీవాల్‌కు జెడ్‌ ప్లస్‌ భద్రత కల్పించినందున ఎంపిక చేసిన జైలు గార్డుల పర్యవేక్షణలో కేజ్రీవాల్‌ను ఉంచుతారు. జైలు మాన్యువల్‌ని అనుసరించే – ఉన్నత స్థాయి ఖైదీలకు ఎటువంటి సేవలు అందిస్తారో– కేజ్రీవాల్‌కి కూడా అటువంటి సేవలే అందిస్తారు. అయితే ఈ జైలు అధికారులందరూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులే కావడంతో ఇది ఒక సవాలే. కత్తిమీద సామే.
జైలు మాన్యువల్‌ ప్రకారం, కేజ్రీవాల్‌ను తీహార్‌కు తీసుకువస్తే, ఆయన కుటుంబ సభ్యులు, ఆయన న్యాయవాదుల బృందం వారానికి రెండుసార్లు మాత్రమే కలవడానికి అనుమతి ఉంటుంది. ఐదు నిమిషాల పాటు ఫోన్‌ కాల్‌ మాట్లాడవచ్చు.
ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయని కేజ్రీవాల్‌ తన విధినిర్వహణను జైలు నుంచే కొనసాగిస్తానని చెప్పారు. ఈడీ కస్టడీలో ఉన్నప్పుడు జైలు నుంచే ఆదేశాలు ఇచ్చారు. ఇప్పుడు ఏమి చేస్తారనేది ఉత్కంఠగా మారింది. కోర్టు ఆదేశాల మేరకు గతంలో కొందరు జైలు నుంచే విధినిర్వహణ, వ్యాపార లావాదేవీలు కొనసాగించిన చరిత్ర ఉంది.


Read More
Next Story