‘ఈడీ’పైన దాడికి పాల్పడిన టీఎంసీ కార్యకర్తలు
x

‘ఈడీ’పైన దాడికి పాల్పడిన టీఎంసీ కార్యకర్తలు

పశ్చిమ బెంగాల్ కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ పై అల్లరిమూకలు దాడులకు దిగాయి. పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి.


కేంద్ర దర్యాప్తు సంస్థ, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరెట్( ఈడీ) పై బెంగాల్ లో టీఎంసీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. రాష్ట్రం లో జరిగిన కోట్లాది రూపాయల రేషన్ స్కామ్ లో ఇప్పటికే మంత్రి జ్యోతిప్రియో మల్లిక్ ను అరెస్ట్ చేసిన ఈడీ, శుక్రవారం 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహణకు రంగంలోకి దిగింది. అయితే ఉత్తర 24 పరగణ జిల్లాలోని సందేశ్ కాళీ ప్రాంతంలో సోదాలకు వెళ్లినప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుంది. టీఎంసీ కార్యకర్తల దాడుల్లో ఇద్దరు ఈడీ అధికారులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించారు.

రేషన్ స్కామ్ లో ప్రధాన నిందితుడిగా ఉన్న మంత్రి జ్యోతిప్రియో మాలిక్ కు సందేశ్ కాళీ ప్రాంతానికి చెందిన షేక్ షాజహన్ ప్రధాన అనుచరుడు. ఆయన ఇంటికి ఈ రోజు ఉదయం ఈడీ అధికారులు సోదాల కోసం వెళ్లారు. అధికారులు అక్కడికి వెళ్లగానే మొదట టీఎంసీ నాయకులు వారిని ఘోరావ్ చేశారు. అనంతరం వారి వాహనాలపై దాడులకు పాల్పడ్డారు. అధికారులు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు పరుగులు తీయాల్సి వచ్చింది.

చేతికందిన వాహనాలు, ఆటోరిక్షాలలో సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నామని ఓ అధికారి పీటీఐకి చెప్పారు. దెబ్బతిన్న వాహనాలను అక్కడి వదిలివచ్చామని సంబంధిత అధికారి విలేకరులకు వివరించారు. ‘ఇంతకు ముందు ఎప్పుడూ ఇలా జరగలేదు. మాకు రక్షణగా వచ్చిన బలగాలపై సైతం దాడులు జరిగాయి. వారి వాహనాలు సైతం దెబ్బతిన్నాయి’ అని మరో అధికారి చెప్పారు.

ఈడీ సోదాలు కవర్ చేయడానికి వెళ్లిన మీడియా సిబ్బందిపై సైతం దాడి జరిగింది. వారి వాహనాలను సైతం టీఎంసీ మద్దతుదారులు ధ్వంసం చేశారు. ‘కొంతమంది మీడియా ప్రతినిధులను సైతం ఆస్పత్రికి తరలించాం’ అని బసిర్ హట్ జిల్లాకు చెందిన ఓ పోలీసు అధికారి వెల్లడించారు.

షేక్ షాజహన్ ఇంటికి సోదాలు కోసం అధికారులు రావడానికంటే ముందే ఆయన ఇంటి గేటు తాళం వేసుకున్నారు. దర్యాప్తు అధికారులు ఎన్ని సార్లు ఫోన్ తీసిన ఆయన నుంచి సమాధానం రాలేదు. చివరగా తాళాన్ని పగల గొట్టి ఇంటిలోకి వెళ్లడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది.

కాగా ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని చట్టప్రకారం చర్య తీసుకుంటామని ఐపీఎస్ అధికారి చెప్పారు. ‘ మేము ఇంకా ఎవరిని అదుపులోకి తీసుకోలేదు. ఈడీ నుంచి కానీ, పారామిలిటరీ దళం నుంచి కానీ ఎలాంటి ఫిర్యాదు రాలేదు, వారి నుంచి అధికారికంగా కంప్లైట్ వస్తే తప్పకుండా చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం’అని ఐపీఎస్ అధికారీ పీటీఐ వార్త సంస్థకు చెప్పారు.

షాజహన్ ఓ స్మగ్లర్ అని, హత్యానేరం ఆరోపణలు సైతం ఉన్నాయని బీజేపీ నాయకుడు రాహూల్ సిన్హా ఆరోపించారు. అయితే అతనిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని విమర్శించారు. వెంటనే ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చశారు. కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ పై ఇప్పుడు జరిగిన దాడి అప్పటికప్పుడే జరిగింది కాదని, ఓ ప్రణాళిక ప్రకారం ముందుగా కుట్ర చేసి తరువాత అమలు జరిపారని ఆయన ఆరోపించారు.

Read More
Next Story