ఓట్ల జాతర ముగిసింది.. టోల్ టాక్స్ ధరల మోత మోగింది!
x

ఓట్ల జాతర ముగిసింది.. టోల్ టాక్స్ ధరల మోత మోగింది!

పోలింగ్ ముగిసి 24 గంటలు కాకముందే టోల్ గేట్ల వద్ద చార్జీలను పెంచుతూ బోర్డులు వెలిశాయి. జూన్ 2వ తేదీ అర్థరాత్రి నుంచే ఇవి అమల్లోకి రానున్నాయి.


ఓట్లు అటు వేయడం ముగిసిందో లేదో ఇటు టోల్ టాక్స్ ధరల మోత మోగింది. దేశవ్యాప్తంగా టోల్ టాక్స్ ల చార్జీలను పెంచుతూ కేంద్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జూన్ 3వ తేదీ అర్థరాత్రి నుంచి ధరల పెంపు అమల్లోకి రానుంది. ఎన్‌హెచ్‌ఏఐ టోల్‌ప్లాజాల వద్ద టోల్‌ చార్జీల ధరలు పెంచుతూ బోర్డులు వెలిశాయి.

ఏటా ఏప్రిల్‌ 1న టోల్‌ చార్జీల ధరలు పెంచుతుండగా.. ఈసారి లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పెంపును వాయిదా వేయాలని ఎన్నికల సంఘం (ఈసీఐ) ఆదేశించింది. చివరి విడత పోలింగ్‌ జూన్‌ 1న ముగియడంతో టోల్‌ ధరల పెంపునకు అనుమతి ఇస్తూ ఎన్‌హెచ్‌ఏఐ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రుసుముల పెంపు సగటున 5 శాతం వరకు ఉంటుంది. పెంచిన ధరలు 2025 మార్చి 31 వరకు అమలులో ఉంటాయి.

సాధారణంగా ప్రతి ఏటా ఏప్రిల్ 1న టోల్ ఛార్జీలు పెరుగుతాయి. అయితే ఈ ఏడాది (2024) లోక్‌సభ ఎన్నికల కారణంగా ఛార్జీల సవరణను తాత్కాలికంగా వాయిదా వేశారు. ఇండియన్ హైవేస్ లోని టోల్ గేట్ల వద్ద ధరలను పెంచకుండా ఏప్రిల్ లో వాయిదా వేశారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి రావడంతో ధరల పెంపు సాధ్యం కాలేదు.

దేశంలో దాదాపు 1,100 టోల్ ప్లాజాల వద్ద టోల్ రేట్లు పెరగనున్నాయి. హైవే ఆపరేటర్లు ఇప్పటికే స్థానిక వార్తాపత్రికల ద్వారా ఈ విషయాన్ని తెలిపారు. ఛార్జీలు సగటున 4 నుంచి 5 శాతం వరకు పెరిగాయి. "ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చే వినియోగదారు రుసుము (టోల్) రేట్ల సవరణ ఎన్నికల కమిషన్ నుంచి అనుమతి తీసుకున్న తర్వాత అమల్లోకి తీసుకువచ్చినట్టు" నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్ హెచ్ఏఐ) సీనియర్ అధికారి చెప్పారు.

2023 ఆర్ధిక సంవత్సరానికి దేశంలోని టోల్ గేట్ల వద్ద వినియోగదారుల నుంచి 5 లక్షల 40వేల కోట్ల రూపాయలకు పైగా టోల్ చార్జీలు వసూలు అయ్యాయి. 2019లో ఈ ఆదాయం 2 లక్షల 52 వేల కోట్లుగా ఉంది.

జాతీయ రహదారుల విస్తరణకు ఈ ధరల పెంపు దోహదపడుతుందని నరేంద్ర మోదీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) ప్రభుత్వం పేర్కొంది. ధరల పెంపును ప్రతిపక్షాలు విమర్శించాయి. 2014లో ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంధన ధరలు, టోల్‌ చార్జీలు ఎలా పెరిగాయో విపక్షాలు తరచూ ఎత్తి చూపుతున్నాయి.

18వ లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 19న ప్రారంభం అయ్యాయి. ఏప్రిల్ 26, మే 7, మే 13, మే 20, మే 25, జూన్ 1వ తేదీల్లో ఎన్నికలు జరిగాయి. జూన్ 4న కౌంటింగ్ జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ (బి.జె.పి) నాయకత్వంలోని ఎన్డీఏ, కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి ఈ ఎన్నికల్లో హోరాహోరిగా తలపడ్డాయి.

విజయవాడ హైవేపై..

హైదరాబాద్‌-విజయవాడ (65) జాతీయ రహదారిపై జీఎంఆర్‌ ఆధ్వర్యంలో తెలంగాణలోని చౌటుప్పల్‌ మండలం పంతంగి, కేతేపల్లి మండలం కొర్లపహాడ్, ఏపీలో చిల్లకల్లు వద్ద టోల్‌ప్లాజాలు ఉన్నాయి. కార్లు, జీపులు, వ్యాన్‌లకు ఒక వైపు ప్రయాణానికి రూ.5, ఇరువైపులా కలిపి రూ.10, తక్కువ బరువుండే వాణిజ్య వాహనాలు ఒక వైపు ప్రయాణానికి రూ.10, రెండువైపులకు కలిపి రూ.20, బస్సులు, ట్రక్కులకు ఒక వైపు ప్రయాణానికి రూ.25, రానూపోనూ కలిపి రూ.35, భారీ రవాణా వాహనాలకు ఒక వైపు ప్రయాణానికి రూ.35, ఇరువైపులా కలిపి రూ.50 వరకు పెంచారు. స్థానికుల నెలవారీ పాస్‌ రూ.330 నుంచి రూ. 340కి పెంచారు.

Read More
Next Story