
‘పహల్గామ్‌లో పర్యాటకుల భద్రత గాలికొదిలేశారు’
ప్రధాని మోదీకి సూటి ప్రశ్న..
కశ్మీర్ లోయలోని శ్రీనగర్ సమీపంలో సోమవారం (జూలై 28) హతమైన ముగ్గురు ఉగ్రవాదులను గుర్తించడానికి జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) 3వేల గంటలకు పైగా 1,055 మందిని ప్రశ్నించిందని హోంమంత్రి అమిత్ షా మంగళవారం తెలిపారు. పహల్గామ్‌లో ఉగ్ర దాడి, ఆపరేషన్ సిందూర్‌పై రెండో రౌండ్ చర్చల సందర్భంగా ఆయన ఈ విషయం తెలిపారు.
ఉగ్రవాదులకు ఆహారం, ఆశ్రయం ఇచ్చిన ఇద్దరు స్థానికులను పట్టుకున్నారని, వారి ద్వారా ముగ్గురు టెర్రరిస్టులను గుర్తించామని షా చెప్పారు. ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న రైఫిల్స్.. ఏప్రిల్ 22న 26 మందిని బలిగొన్న పహల్గామ్ దాడిలో ఉపయోగించిన రైఫిల్స్ ఒకటేనని తేలిపోయిందని, చనిపోయిన ముగ్గురు ఉగ్రవాదులు పాకిస్తానీ జాతీయులు అని పేర్కొన్నారు.
ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) గురించి లోక్‌సభలో చర్చ ప్రారంభించిన రోజునే ఉగ్రవాదులను చంపడం యాదృచ్చికంగా జరిగిందా? అని ప్రతిపక్ష ఎంపీలు ప్రశ్నించారు. పర్యాటకుల భద్రతను గాలికొదిలేశారని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. "వారి బాధ్యత ప్రధానిది, హోంమంత్రి, రక్షణ మంత్రి, NSA కాదా?" అని వ్యాఖ్యానించారు. ప్రియాంక మోదీని తీవ్రంగా విమర్శిస్తూ.."మీ హృదయంలో ఈ దేశ ప్రజల గురించి ఏమీ లేదు. మీరు ప్రచారం కోసం ఆరాటపడుతున్నారు, " అని అన్నారు.
అఖిలపక్ష ప్రతినిధుల బృందాలను వివిధ దేశాలకు పంపినందుకు డీఎంకే(DMK) ఎంపీ కనిమొళి(Kanimozhi) కరుణానిధి బీజేపీకి కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఈ ప్రతినిధుల బృందాలను పంపాల్సిన అవసరం రాకపోతే తాను మరింత సంతోషంగా ఉండేదాన్నని అన్నారు. "మీరు పాలనలో విఫలం కావడం వల్లే మేం ప్రతినిధులుగా వెళ్లాల్సి వచ్చింది" అని పేర్కొ్న్నారు.
నిఘా వైఫల్యాన్ని ప్రభుత్వం అంగీకరించిందని, ఆ వైఫల్యానికి ఎవరు బాధ్యులో, ఆ వ్యక్తులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో వెల్లడించలేదని ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి దాని రాజకీయ, ఆర్థిక, సామాజిక విధానాలకు SIR (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) అవసరమని ఆయన వ్యంగ్యంగా మాట్లాడారు.
నిరసనలతో హోరెత్తిన పార్లమెంట్?
పార్లమెంట్ సోమవారం నిరసనలతో హోరెత్తింది. బీహార్‌లో SIRకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు తమ వాణి వినిపించాయి. పహల్గామ్(Pahalgam) దాడి తర్వాత అఖిలపక్ష సమావేశానికి హాజరు కాకపోవడంతో ఎగువ సభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే(Kharge) ప్రధానిపై విమర్శలు గుప్పించారు. కాల్పుల విరమణకు అంగీకరించిన పరిస్థితులు? దానిని ఎందుకు అంగీకరించారు? కాల్పుల విరమణలో అమెరికా జోక్యం చేసుకుందా ?అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనేకసార్లు చెప్పినట్లుగా కాల్పుల విరమణలో పాత్ర పోషించారా? ఈ ప్రశ్నలకు మోదీ సమాధానాలు చెప్పాలని కోరారు.