కోచింగ్ సెంటర్‌లో విషాదం.. ముగ్గురు సివిల్స్ విద్యార్థుల మృతి
x

కోచింగ్ సెంటర్‌లో విషాదం.. ముగ్గురు సివిల్స్ విద్యార్థుల మృతి

దేశరాజధానిలో విషాదం చోటుచేసుకుంది. సివిల్స్ కోచింగ్ సెంటర్‌లోకి వరద నీరు ప్రవేశించడంతో ముగ్గురు విద్యార్థులు చనిపోయారు.


దేశరాజధానిలో విషాదం చోటుచేసుకుంది. సివిల్స్ కోచింగ్ సెంటర్‌లోకి వరద నీరు ప్రవేశించడంతో ముగ్గురు విద్యార్థులు చనిపోయారు.భారీ వర్షాల కారణంగా మురుగు కాలువలు పగిలిపోవడంతో వర్షం నీరంతా ఢిల్లీలోని ఓల్డ్ రాజేంద్ర నగర్‌లోని సివిల్స్ కోచింగ్ సెంటర్‌లోకి ప్రవేశించింది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. వారిని తానియా సోని (25), శ్రేయా యాదవ్ (25), నెవిన్ డాల్విన్ (28)గా గుర్తించారు.

ఘటన ఎలా జరిగింది?

రావ్ ఐఏఎస్ స్టడీ సెంటర్‌ వద్దకు భారీగా వరద నీరు చేరిందని ఢిల్లీ అగ్నిమాపక విభాగానికి ఫోన్ వచ్చింది. వెంటనే ఎన్డీఆర్‌ఎఫ్, స్థానిక పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మొదట ఒక విద్యార్థి మృతదేహాన్ని వెలికి తీశారు. కొన్ని గంటల తర్వాత మరో ఇద్దరు విద్యార్థుల మృతదేహాలు లభించాయి. కోచింగ్ సెంటర్‌లోకి వరద నీరు చేరే సమయానికి దాదాపు 30 మంది విద్యార్థులు లోపల ఉన్నారని పోలీసులు తెలిపారు. వారిలో కొంతమందిని మందిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. కొంతమంది విద్యార్థులు తప్పించుకోగలిగారు. బేస్‌మెంట్‌లో ఏడు అడుగుల మేర నీరు నిండినట్లు అధికారులు తెలిపారు.

వెల్లువెత్తిన నిరసనలు..

ముగ్గురు విద్యార్థులు మృత్యువాతపడడంతో విద్యార్థులు నిరసనలు వెల్లువెత్తాయి. ఘటన స్థలంలో మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసిడి)కి వ్యతిరేకంగా విద్యార్థుల నినాదాలు చేశారు. వర్షం కురిసిన 10 నిమిషాలకే కోచింగ్ సెంటర్‌లోకి నీరు చేరిందని పేర్కొన్నారు. గతంలో పరిస్థితిని ఎంసిడి అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఏ చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘ఆప్’ బాధ్యత వహించాలి.

కాగా ఈ ఘటనకు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వ నిర్లక్ష్యం, అసమర్థత కారణంగా ముగ్గురు విద్యార్థులు మృతి చెందారని ఆ పార్టీ నాయకులు ఆరోపించారు. మురుగు కాలువలను శుభ్రం చేయాలని స్థానికులు విజ్ఞప్తి చేసినా స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోలేదని ఆరోపించారు. డ్రైన్‌లను శుభ్రం చేయడంలో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎందుకు విఫలమైందో చెప్పాలని ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవా డిమాండ్ చేశారు.

కేజ్రీవాల్ పాలనలో స్థానిక సమస్యలను గాలికొదిలేశారని బిజెపి ఎంపి బన్సూరి స్వరాజ్ ఆరోపించారు. "ఈ పిల్లలు తమ భవిష్యత్తును నిర్మించుకోవడానికి ఇక్కడకు వచ్చారు. కానీ అరవింద్ కేజ్రీవాల్, ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్ స్థానికుల సమస్యలను పట్టించుకోవడం లేదు. డ్రైనేజీ కాలువలను శుభ్రం చేయాలని ప్రజలు దుర్గేష్ పాఠక్‌ను వారం రోజులుగా కోరుతున్నారు. జరిగిన ఘటనకు అరవింద్ కేజ్రీవాల్ , దుర్గేష్ పాఠక్ బాధ్యత వహించాలి" అని డిమాండ్ చేశారు.

విచారించి చర్యలు తీసుకుంటాం: మేయర్

ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ఒబెరాయ్ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ (MCD) పరిధిలో బెస్‌మెంట్లలో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్న కోచింగ్ సెంటర్లు, ఇతర సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ సిబ్బందిని ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించారు. ఘటనపై విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

“ఈ ఘటనకు MCD, కోచింగ్ సెంటర్ నిర్వాహకులు ఇద్దరూ బాధ్యత వహించాలి. గత రాత్రి నుంచి నిరసన తెలుపుతున్నా .. ఇప్పటి వరకు ఉన్నతాధికారులు మాతో మాట్లాడలేదు. మృతుల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండవచ్చని మేము భావిస్తున్నాం”అని యువరాజ్ అనే విద్యార్థి మీడియాతో చెప్పాడు.

పోలీసుల అదుపులో స్టడీ సర్కిల్‌ యజమాని, కోఆర్డినేటర్‌..

మరోవైపు స్టడీ సర్కిల్‌ యజమాని, కోఆర్డినేటర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Read More
Next Story