
‘కరూర్ తొక్కిసలాటకు సంస్థాగత లోపాలు కారణం’
‘‘పోలీసులు సరైన భద్రత కల్పించలేదనడం అవాస్తవం’’ - అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్
తమిళనాడు(Tamil Nadu) కరూర్(Karur)లో తమిళగ వెట్రీ కజగం (TVK) చీఫ్ విజయ్ ప్రచార సభలో చోటుచేసుకున్న తొక్కిసలాట(Stampede)పై భిన్న కథనాలు వస్తున్నాయి. పోలీసులు సరైన భద్రత కల్పించలేదని, విద్యుత్ సరఫరాలో అంతరాయమే తొక్కిసలాటకు కారణమని ప్రచారం జరుగుతోంది. ఈ ఘటన వెనక కుట్ర దాగి ఉందని మరికొంతమంది వాదన. వీటన్నిటిని తమిళనాడు అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) ఎస్ డేవిడ్సన్ దేవాశిర్వతం తోసిపుచ్చారు. కరూర్ కలెక్టర్ కార్యాలయంలో విలేఖరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. తొక్కిసలాటకు సంస్థాగత లోపాలే కారణమన్నారు. పోలీసుల వైఫల్యమే కారణమన్న వాదనను ఆయన కొట్టిపడేశారు. ఎవరిపైనా కూడా ముందస్తుగా ఆరోపణలు చేయడం మంచిదికాదన్నారు. దర్యాప్తులో అన్ని విషయాలు తెలుస్తాయి అని పేర్కొన్నారు.
‘‘పూర్తి బందోబస్తు కల్పించాం..’’
"విజయ్ ప్రచార సభకు అవసరానికి మించి భద్రత కల్పించాం. ప్రతి 20 మందికి ఒక అధికారి చొప్పున కేటాయించాం. విజయ్ మధ్యాహ్నమే వస్తారనుకున్న 12 గంటలకే వేదిక వద్దకు జనం రావడం మొదలైంది. కాని ఆయన సాయంత్రం ఆరున్నర గంటల ప్రాంతంలో వచ్చారు. ఎక్కువ సేపు నిలుచుని ఉంటే నీరసం వస్తుంది. మధ్యాహ్నం నుంచి ఎండలో వేచి ఉన్న జనాలకు భోజన వసతి కాని, మంచినీళ్ల వసతి కాని నిర్వాహకులు ఏర్పాటు చేయలేదు. భారీగా వచ్చిన జనం దృష్ట్యా.. వేదికకు దూరంగా విజయ్ కాన్వాయ్‌ను ఆపాలని పోలీసులు సలహా ఇచ్చారు. కానీ టీవీకే నిర్వాహకులు వారి సూచనను పట్టించుకోలేదు. చివరకు విజయ్ వాహనాన్ని అతికష్టం మీద జనసమూహం గుండా పోనివ్వాల్సి వచ్చింది. " అని ADGP వివరించారు.
‘నో పవర్‌కట్..’
విద్యుత్ సరఫరాలో అంతరాయం కారణంగా తొక్కిసలాట జరిగిందన్న కొంతమంది టీవీకే నాయకులు వాదనను తమిళనాడు జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ (TANGEDCO) అధికారి కె. రాజలక్ష్మి తోసిపుచ్చారు. "విజయ్ ప్రచారం పూర్తయ్యే వరకు విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగలేదు." అని చెప్పారు. సోషల్ మీడియాలో జరుగుతోన్నది అసత్యప్రచారమని పేర్కొన్నారు. ‘‘విజయ్‌ను చూసేందుకు కొంతమంది చెట్లెక్కారు. చెట్లను ఆనుకుని కరెంటు వైర్లున్నాయి. వాటి వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంది. పోలీసుల చొరవతో వారిని కిందకు దింపాం. ఆ సమయంలో కొన్ని నిముషాల పాటు విద్యుత్ సరఫరా నిలిపేసి మళ్లీ పునరుద్ధరించాం’’ అని చెప్పారు.