SIR డ్రైవ్: మధ్యప్రదేశ్‌లో ఇద్దరు BLOలు మృతి..
x

SIR డ్రైవ్: మధ్యప్రదేశ్‌లో ఇద్దరు BLOలు మృతి..

పనిభారం, ఒత్తిడి కారణంగానే చనిపోయారంటున్న మృతుల కుటుంబసభ్యులు..


Click the Play button to hear this message in audio format

మధ్యప్రదేశ్‌(Madhya Pradesh)లో బూత్ లెవల్ ఆఫీసర్లు(BLO)గా విధులు నిర్వహిస్తున్న ఇద్దరు ఉపాధ్యాయులు చనిపోయారు. అయితే వీరిద్దరూ అధిక పనిభారంతోనే చనిపోయారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికల కమిషన్ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని (S.I.R) నిర్వహిస్తోంది. ఇంటింటికి తిరిగి ఓటర్ల వివరాలను తెలుసుకుని నమోదు చేసే పనిని ఉపాధ్యాయులతో చేయిస్తోంది ఎలక్షన్ కమిషన్.


రైసెన్ జిల్లాలో..

సత్లాపూర్ ప్రాంతానికి చెందిన రామకాంత్ పాండే అనే ఉపాధ్యాయుడు రైసెన్ జిల్లాలోని మండిదీప్‌లో S.I.R విధులు నిర్వహిస్తున్నాడు. శుక్రవారం రాత్రి అనారోగ్యంతో మరణించారు. పాండే మరణానికి కారణం ఏమిటని అడిగినప్పుడు, పోస్ట్‌మార్టం రిపోర్టు కోసం ఎదురుచూస్తున్నామని భోజ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం సబ్-డివిజనల్ అధికారి (ఎస్‌డీవో), ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారి చంద్రశేఖర్ శ్రీవాస్తవ తెలిపారు.


‘ఒత్తిడి కారణంగానే..’

కాగా అధిక పనిభారం కారణంగా ఒత్తిడితో అనార్యోగానికి గురై తన భర్త చనిపోయాడని పాండే భార్య రేఖ, కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

‘‘రోజూ రాత్రిపూట కూడా పని చేసేవారు. గడువులోగా పని ముగించాలని ఫోన్లు వచ్చేవి. గురువారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో ఆన్‌లైన్ మీటింగ్‌లో హాజరయ్యారు. అనంతరం బాత్రూమ్‌కి వెళ్లి వస్తూ ఇంట్లో కుప్పకూలిపోయారు. వెంటనే భోపాల్‌లోని నోబుల్ ఆసుపత్రికి తీసుకెళ్లాం. అక్కడి నుంచి ఎయిమ్స్‌కు తరలించాం. అక్కడ వైద్యులు అప్పటికే మృతి చెందారని చెప్పారు.’’ అని పాండే భార్య రేఖ వివరించారు. గడువులోగా పని పూర్తి చేయకపోతే సస్పెండ్ చేస్తారన్న భయంతో గత నాలుగు రోజులుగా రాత్రిపూట నిద్రపోకుండా పనిచేశారని ఆమె చెప్పారు.


దామోహ్ జిల్లాలో..

దామోహ్ జిల్లా రాంజ్రా గ్రామంలో బిఎల్‌వోగా పనిచేస్తున్న గోండ్ అనే ఉపాధ్యాయుడు గురువారం సాయంత్రం విధుల్లో ఉండగా అనారోగ్యానికి గురయ్యాడని డీఈవో ఎస్‌కె నేమా తెలిపారు. ‘‘అతన్ని (గోండ్) దామోహ్‌లోని జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో జబల్‌పూర్ జిల్లాకు రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మరణించారు" అని డీఈవో చెప్పారు.

‘‘గోండ్‌కు రాంజ్రా, కుడా కుడాన్ గ్రామాల్లో డ్యూటీ వేశారు. 1319 మంది ఓటర్ల వివరాలను తెలుసుకోవాల్సి ఉండగా.. 13 శాతం పని మాత్రమే పూర్తిచేశాడు. దాంతో ఆయన ఆందోళన, ఒత్తిడికి గురయ్యాడు.’’ అని గోండ్ స్నేహితులు తెలిపారు.

ఇటీవలే దామోహ్ జిల్లాలోని జబేరా అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని తెండుఖేడలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బిఎల్‌వో శ్యామ్ సుందర్ శర్మ మరణించారు. ఎస్ఐఆర్ కారణంగా శ్యామ్ సుందర్ శర్మ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని, గడువులోపు పని పూర్తిచేయకపోతే సస్పెండ్ చేస్తామని బెదిరించారని మృతుడి కుటుంబసభ్యులు ఆరోపించారు.

Read More
Next Story