ఉన్నావ్ అత్యాచారం కేసు: నిందితుడు కుల్‌దీప్ సింగ్ సంగర్‌కు బెయిల్‌ ..
x

ఉన్నావ్ అత్యాచారం కేసు: నిందితుడు కుల్‌దీప్ సింగ్ సంగర్‌కు బెయిల్‌ ..

సుప్రీంకోర్టులో కేసును వాదించేందుకు సాయం చేయాలని కాంగ్రెస్ నేతలు రాహుల్, సోనియాను కలిసిన బాధితురాలు..


Click the Play button to hear this message in audio format

ఉత్తరప్రదేశ్(Utter Pradesh) రాష్ట్రం ఉన్నావ్(Unnao) జిల్లాలో జరిగిన అత్యాచార ఘటనలో మాజీ BJP ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్‌కు జీవిత ఖైదు పడిన విషయం తెలిసిందే. అయితే ట్రయల్ కోర్టు విధించిన జీవిత ఖైదు శిక్షను హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేస్తూ ఢిల్లీ హైకోర్టు(Delhi High Court) ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఈ కేసు గురించి మరోసారి చర్చ మొదలైంది. ఎనిమిదేళ్ల క్రితం మైనర్ బాలికపై లైంగిక దాడి, ఆపై జరిగిన పరిణామాలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసిన విషయం విదితమే.

కోర్టు తీర్పుపై బాధితురాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తనకు, తన కుటుంబానికి భద్రతపై భయం ఉందని ఆమె వెల్లడించింది. న్యాయం కోసం చివరి వరకు పోరాటం కొనసాగిస్తామని, అవసరమైతే సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని బాధితురాలి తరఫు వర్గాలు తెలిపాయి.


అసలు ఏం జరిగింది?

2017 జూన్‌లో ఉన్నావ్‌కు చెందిన బాలికపై అప్పటి BJP ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ (Kuldeep Singh Sengar) అత్యాచారం(Rape) చేశాడనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. బాధితురాలు పోలీస్ స్టేషన్‌ల చుట్టూ తిరిగినా కేసు నమోదు కాలేదు. రాజకీయ పలుకుబడే ఇందుకు కారణమన్న ఆరోపణలు గుప్పుమన్నాయి.

2018 ఏప్రిల్ 8న లక్నోలోని సీఎం నివాసం ముందు బాధితురాలు ఆత్మహత్యాయత్నం చేయడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటన జాతీయస్థాయిలో చర్చకు దారితీసింది. అదే సమయంలో బాధితురాలి తండ్రి పోలీస్ కస్టడీలో మృతి చెందాడు. తొలుత సహజ మరణంగా పోలీసులు ప్రకటించారు. పోస్ట్‌మార్టం నివేదిక బయటకు వచ్చాక తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు.

పోలీసుల తీరుపై ప్రజాగ్రహం వెల్లువెత్తడంతో కేసును CBIకి అప్పగించారు. 2018 ఏప్రిల్‌లో కుల్దీప్ సింగ్ సెంగార్‌ను అరెస్టు చేశారు. అత్యాచారం, హత్య, సాక్ష్యాలు లేకుండా చేయడం, సాక్షులను బెదిరించారని ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు.

2019 జూలైలో మరో సంచలన ఘటన జరిగింది. బాధితురాలు రాయ్‌బరేలీ కోర్టుకు వెళ్తుండగా ఆమె కారు ప్రమాదానికి గురైంది. ట్రక్కు కావాలనే ఢీకొట్టినట్టు దర్యాప్తులో తేలింది. ఈ ఘటనలో బాధితురాలి ఇద్దరు బంధువులు మృతి చెందారు. బాధితురాలు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందింది. ఈ ఘటనను హత్యాయత్నంగా నమోదు చేశారు.

భద్రతా లోపాలపై ఆందోళన వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు కేసును ఢిల్లీకి బదిలీ చేసింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ సాగింది. 2020 మార్చి 2న ఢిల్లీ కోర్టు తీర్పు వెలువరించింది. అత్యాచార కేసులో కుల్దీప్ సింగ్ సెంగార్‌కు జీవిత ఖైదు విధించింది. అనంతరం బాధితురాలి తండ్రి హత్య కేసులో అదనపు శిక్షలు ఖరారు చేసింది. కోర్టు ఆదేశాలతో బాధితురాలికి రూ.25 లక్షల పరిహారం అందించారు. కుటుంబానికి భద్రత కల్పించారు. బాధితురాలి గుర్తింపు గోప్యంగా ఉంచారు.


సుప్రీంను ఆశ్రయించనున్న సీబీఐ..

బెయిల్ మంజూరుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో వీలైనంత త్వరలో పిటీషన్ దాఖలు చేయాలని నిర్ణయించినట్లు సీబీఐ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. అయితే బాధితురాలి తండ్రి కస్టడీలో మరణించిన కేసులో సెంగార్‌కు పదేళ్ల జైలు శిక్ష పడింది. దాంతో ఆయన ఇంకా జైలులోనే ఉంటారు.


రాహుల్, సోనియాను కలిసిన బాధితురాలు..

బాధితురాలు, ఆమె తల్లి రాహుల్ గాంధీ, అలాగే సోనియా గాంధీని డిసెంబర్ 24న ఢిల్లీలో కలిశారు. సుప్రీంకోర్టు(Supreme court)లో సెంగర్‌పై కేసును వాదించడానికి సీనియర్ న్యాయవాదిని నియమించేందుకు సాయం చేయాలని కోరారు. అలాగే చేస్తానని రాహుల్ వారికి హామీ ఇచ్చారు.

రేపిస్టుకు బెయిల్ మంజూరు చేయడంపై రాహుల్ గాంధీ తన అంసతృప్తిని ఎక్స్‌ వేదికగా వ్యక్తం చేశారు. "రేపిస్టులకు బెయిల్ ఇవ్వడం, బాధితులను నేరస్థులలా చూడటం - ఇది ఎలాంటి న్యాయం? ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలను వినిపించడం ప్రతి పౌరుడి హక్కు. దానిని అణచివేయాలని చూడడం నేరం’’ అని పోస్టులో రాసుకొచ్చారు.

తాజా హైకోర్టు ఉత్తర్వులతో ఈ కేసు మళ్లీ జాతీయ స్థాయిలో చర్చకు దారి తీసింది. ఇప్పుడు సుప్రీం కోర్టు దిశానిర్దేశం ఏ విధంగా ఉండబోతుందన్నది కీలకంగా మారింది.

Read More
Next Story