‘‘ఇక నాకు, నా కుటుంబానికి రక్షణేది?’’
x
కుల్దీప్ సింగ్ సెంగర్‌ విడుదలపై ఆందోళన వ్యక్తం చేస్తున్న మహిళ కార్యకర్తలు..

‘‘ఇక నాకు, నా కుటుంబానికి రక్షణేది?’’

హైకోర్టు తీర్పుపై అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానన్న ఉన్నావ్ అత్యాచారం బాధితురాలు..


Click the Play button to hear this message in audio format

ఉన్నావ్(Unnao) అత్యాచారం(Rape) కేసులో భారతీయ జనతా పార్టీ (BJP) మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్‌(Kuldeep singh sengar)కు జీవిత ఖైదును నిలిపివేస్తూ ఢిల్లీ హైకోర్టు (Delhi High court) ఇచ్చిన తీర్పు బాధితురాలిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ తీర్పు తర్వాత బాధితురాలు బహిరంగంగా మాట్లాడారు. ఈ కేసు తన జీవితాన్ని, కుటుంబాన్ని నాశనం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. "నా తండ్రిని పోలీసుల ముందే కొట్టి చంపారు. వాహనంతో ఢీ కొట్టి నన్ను చంపాలనుకున్నారు. అదృష్టవశాత్తూ బయటపడ్డా. నా శరీరంలో ఇంకా ఇనుప రాడ్లు ఉన్నాయి. ఇప్పుడు దోషిని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక మా కుటుంబానికి రక్షణ ఎక్కడుంటుంది? అని ప్రశ్నించారు.

బాధితురాలు ఢిల్లీలో ది ఫెడరల్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు. హైకోర్టు తీర్పును సవాలు చేస్తానని చెప్పారు. "నేను న్యాయవ్యవస్థను గౌరవిస్తా. సుప్రీంకోర్టును ఆశ్రయిస్తా. తనకు ఇప్పటికీ అత్యున్నత న్యాయస్థానం(Supreme court)పై నమ్మకం ఉంది’’ అని పేర్కొన్నారు.


సీబీఐ దర్యాప్తుపైనా సందేహాలు?

కేసు విచారణలో సీబీఐ పాత్రపై కూడా అనుమానం కలుగుతోందని బాధితురాలు పేర్కొన్నారు. తనను మైనర్‌గా కాకుండా మేజర్‌గా చిత్రీకరించడానికి ప్రయత్నాలు జరిగాయని, హైకోర్టులో విచారణ సమయంలో సెంగర్‌కు కూడా సహాయం చేశారని ఆరోపించారు. నిష్పాక్షికంగా వ్యవహరిస్తుందనుకున్న సంస్థ.. ప్రారంభం నుంచే రాజీపడినట్లు కనిపిస్తోందన్నారు.


'పోరాటం ముగియలేదు'

బాధితురాలి తరపు న్యాయవాది మహమూద్ ప్రాచా కూడా హైకోర్టు నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తీర్పు అనేక ప్రశ్నలను లేవనెత్తిందని అన్నారు. సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేసి, శిక్షను నిలిపివేయడాన్ని సవాలు చేస్తామన్నారు.

"ఒక చిన్నారిపై అత్యాచారం చేశారు. ఆమెను చంపేందుకు చూశారు. బాధితురాలి తండ్రిని పోలీసుల ముందే దారుణంగా కొట్టి చంపారు. కుల్దీప్ సింగ్ జైలు నుంచి బయటకు వస్తే.. భద్రతకు ఎవరు హామీ ఇస్తారు? ప్రధానమంత్రి మోదీ బాధ్యత తీసుకుంటారా?" అని మహమూద్ ప్రశ్నించారు. ‘‘డబుల్ బెంచ్ ఆదేశం మేరకు సెంగర్ విడుదల కావొచ్చు. కానీ బాధితురాలి తండ్రి హత్య కేసు ఇంకా పెండింగ్‌లో ఉన్నందున అతను జైలులోనే ఉంటాడు’’ అని చెప్పారు.


రాజకీయ ఒత్తిడితోనే?

‘‘సెంగర్‌ విడుదల వెనక రాజకీయ నేతల ఒత్తిళ్ల ఉన్నాయన్న అనుమానం కలుగుతోంది. 2027లో ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. సెంగర్ భార్యను అభ్యర్థిగా నిలబెట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. సెంగర్‌ను రక్షించడంలో బీజేపీ నాయకుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పాత్ర ఉంది.’’ అని బాధితురాలు పేర్కొన్నారు.


‘‘మరణశిక్ష విధించాలి’’

సెంగార్‌కు జీవిత ఖైదు కాదు. మరణశిక్ష విధించాలని బాధితురాలు నిర్మొహమాటంగా చెప్పింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జోక్యం చేసుకుని తనకు, తన కుటుంబానికి భద్రత కల్పించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. "నా కుటుంబాన్ని రక్షించాలని, మా ప్రాణాలను కాపాడాలని ముఖ్యమంత్రికి చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా" అని పేర్కొన్నారు.

బాధితురాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తాకు భావోద్వేగ విజ్ఞప్తి చేశారు. "రాష్ట్రపతి ఒక మహిళ. ఢిల్లీ ముఖ్యమంత్రి కూడా ఒక మహిళ. ఒక కూతురు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటుందో వారు అర్థం చేసుకోవాలి" అని ఆవేదన వ్యక్తం చేశారు.

బాధితురాలి తల్లి ఆవేదన..

ఈ కేసు గురించి మాట్లాడినప్పుడల్లా బాధితురాలి తల్లి ఇప్పటికీ దుఃఖంతో కన్నీరు పెడుతుంది. "సెంగర్‌ను ఉరితీయకపోవడంతో మేం భయం గుప్పిట్లో కాలం వెళ్లదీస్తున్నాం.’’ అని పేర్కొన్నారు. ఇండియా గేట్ వద్ద జరిగిన నిరసన సందర్భంగా ఢిల్లీ పోలీసులు తనతో, తన కుమార్తెతో దురుసుగా ప్రవర్తించారని, ప్రాణాలతో బయటపడిన వ్యక్తిని బలవంతంగా భద్రతా వాహనంలోకి ఎక్కించి తీసుకెళ్లారని కూడా బాధితురాలు తల్లి ఆరోపించింది.

Read More
Next Story