‘యూపీ హైకోర్టు తీర్పు బీజేపీకి చెంపపెట్టు’
"యూపీలో 69వేల ఉపాధ్యాయ నియామకాలు బీజేపీ రిజర్వేషన్ వ్యతిరేక మనస్తత్వానికి నిదర్శనం.’’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
లోక్ సభా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ శనివారం అలహాబాద్ హైకోర్టు తీర్పును సమర్థించారు. యూపీలో 69వేల మంది టీచర్ల నియామకానికి సంబంధించి కొత్త జాబితా తయారుచేయాలని న్యాయమూర్తి తీర్పు చెప్పడంపై హర్షం వ్యక్తం చేశారు.
ఉత్తరప్రదేశ్‌లో 69 వేల ప్రాథమిక ఉపాధ్యాయుల నియామకానికి సంబంధించి డిసెంబర్ 2018 నోటిఫికేషన్ ఇచ్చారు. 2019లో 4,10,000 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. 2020లో ఫలితాలు వెలువడ్డాయి. 1,47,000 మంది అభ్యర్థులు పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణులైన వారిలో 1,10,000 మంది రిజర్వ్‌డ్ వర్గాలకు చెందినవారు. మెరిట్ ఆధారంగా ఉత్తరప్రదేశ్‌లో 69వేల మంది ఉపాధ్యాయుల నియామకం జరిగింది. అయితే రిజర్వ్‌డ్ కేటగిరీలకు చెందిన దాదాపు 19,000 మంది అభ్యర్థులకు న్యాయం జరగలేదని కొంతమంది అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. విచారించిన అలహాబాద్ హైకోర్టు పాత జాబితాను రద్దు చేసి రిజర్వేషన్ల ప్రకారం కొత్త లిస్టును మూడు నెలల్లోపు తయారుచేయాలని తీర్పుచెప్పింది.
"ఉత్తర ప్రదేశ్‌లో 69వేల ఉపాధ్యాయ నియామకాలు బీజేపీ రిజర్వేషన్ వ్యతిరేక మనస్తత్వానికి నిదర్శనం.’’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. కోర్టు తీర్పుతో బాధిత అభ్యర్థులకు న్యాయం జరుగుతుందన్నారు.
ఓబీసీ కేటగిరీకి 27% బదులు 3.86%, ఎస్సీ కేటగిరీకి 21% బదులు 16.6% మాత్రమే రిజర్వేషన్లు లభించాయని బాధిత విద్యార్థులు గతంలో రాహుల్ గాంధీ కలిసి తమ బాధను చెప్పుకున్నారు.