యూపీ నిబంధన ..ఇప్పుడు మధ్యప్రదేశ్‌లోనూ
x
యూపీ ముజఫర్‌నగర్‌లో దుకాణదారుడి పేరుతో ఉన్న బోర్డును దాటి వెళ్తున్న కన్వారియాలు

యూపీ నిబంధన ..ఇప్పుడు మధ్యప్రదేశ్‌లోనూ

మధ్యప్రదేశ్ తన పొరుగు రాష్ట్రం ఉత్తర్ ప్రదేశ్‌ను ఆదర్శంగా తీసుకున్నట్లుంది. అక్కడ కన్వర్ యాత్రికులకు, ఇక్కడ ఉజ్జయిని భక్తుల కోసం తీసుకొచ్చిన ఆ నిబంధన ఏమిటంటే..


మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మునిసిపల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉజ్జయినిలో దుకాణాల ముందు యజమాని పేరు , సెల్ నంబర్లను కనపరుస్తూ బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించింది.

ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో ముస్లిం దుకాణదారులను లక్ష్యంగా చేసుకుని కన్వర్ యాత్ర మార్గంలో తినుబండారాలను అమ్మే వారు.. తమ దుకాణాల ముందు యజమాని పేరు కనిపించేలా బోర్డులు ఏర్పాటు చేసుకోవాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఇదే విధానం ఇప్పుడు మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోనూ అమలు చేస్తున్నారు.

పారదర్శకత కోసమే..

ఉజ్జయిని మేయర్ తత్వాల్ ఈ ఉత్తర్వులపై వివరణ ఇచ్చారు. ముస్లింలను లక్ష్యంగా చేసుకుని ఈ నిబంధన పెట్టలేదని చెప్పారు. భద్రత, పారదర్శకత కోసం మాత్రమే ఆ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. నిబంధన ఉల్లంఘించిన వారికి మొదటి సారి రూ.2వేలు, రెండవసారి అదే తప్పు పునరావృతం అయితే రూ. 5 వేలు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని వివరించారు.

కౌన్సిల్ ఆమోదం..

దుకాణదారు పేరును షాపుల ముందు బోర్డుపై కనపర్చాలన్న ప్రతిపాదనను సెప్టెంబర్ 26, 2002న ఉజ్జయిని మేయర్-ఇన్-కౌన్సిల్ ఆమోదించింది. ఆ తర్వాత అభ్యంతరాలు, సవరణల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి పంపాం. నేమ్‌ప్లేట్‌లు ఒకే పరిమాణంలో, రంగులో ఉండాలని మొదట నిర్దేశించాం. అందుకే నిబంధన అమలులో జాప్యం జరిగింది. ఇప్పుడు ఆ నిబంధనలను సడలించాం. దుకాణదారుల పేర్లు, మొబైల్ నంబర్‌లను ప్రదర్శిస్తే సరిపోతుంది. అని తత్వాల్ చెప్పారు.

అది భక్తుల హక్కు..

"ఉజ్జయిని పవిత్ర నగరం. ప్రజలు విశ్వాసంతో ఇక్కడికి వస్తారు. వారు ఎవరి నుంచి సేవలు పొందుతున్నారో తెలుసుకునే హక్కు భక్తులకు ఉంటుంది. కస్టమర్లు అసంతృప్తికి గురైనా, మోసానికి గురైనా నేమ్ ప్లేట్ ద్వారా దుకాణదారుడి వివరాలను తెలుసుకోవడం సులువవుతుంది" అని మేయర్ చెప్పారు.

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ స్వస్థలం ఉజ్జయిని. పవిత్ర మహాకాల్ ఆలయానికి ప్రసిద్ధి. ప్రపంచవ్యాప్తంగా భక్తులను ఆకర్షిస్తోంది.

Read More
Next Story