Majid Survey| యూపీలో మత కలహాలు, కాల్పులు, సంభాల్ లో ముగ్గురు మృతి
ఉత్తరప్రదేశ్ సంభాల్ జిల్లా కేంద్రంలో రెండు వర్గాలకు చెందిన వారు పరస్పరం ఘర్షణకు తలపడడంతో పెద్దఎత్తున ఉద్రిక్తత చోటు చేసుకుంది.
ఉత్తరప్రదేశ్ లోని సంభాల్ జిల్లా కేంద్రంలో రెండు వర్గాలకు చెందిన వారు పరస్పరం ఘర్షణకు తలపడడంతో పెద్దఎత్తున ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు చనిపోయినట్టు ప్రస్తుత సమాచారం. పోలీసులు పెద్దఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. అన్ని రకాల ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.
కోర్టు ఉత్తర్వుల మేరకు ఓ మసీదును సర్వే చేస్తుండగా నవంబర్ 24 ఆదివారం ఉదయం చెలరేగిన అల్లర్లలో ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. పట్టణంలో మొగల్ కాలానికి చెందిన జామా మసీదు ఉన్నచోట గతంలో హరిహర మందిరం ఉండేదన్న ఫిర్యాదుతో దాఖలైన పిటిషను మేరకు స్థానిక కోర్టు సర్వేకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో గత మంగళవారం నుంచి సంభల్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
నవంబర్ 24 ఆదివారం పెద్ద గుంపుగా వచ్చిన కొందరు వ్యక్తులు సర్వేను ప్రతిఘటిస్తూ మసీదు ముందు నినాదాలతో ఆందోళనకు దిగారు. పోలీసుల పైకి రాళ్లు రువ్వి, వాహనాలకు నిప్పు పెట్టే ప్రయత్నం చేశారు. దీంతో బాష్పవాయువు, ప్లాస్టిక్ బుల్లెట్లు ప్రయోగించిన పోలీసులు లాఠీలు ఝళిపించి గుంపును చెదరగొట్టేందుకు ప్రయత్నించారు.
‘‘కొంతమంది దుండగులు ఇళ్ల నుంచి కాల్పులు జరిపారు. సర్కిల్ అధికారితోపాటు దాదాపు 20 మంది పోలీసులు పెల్లెట్లు తగిలి గాయపడ్డారు. నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నాం’’ అని ఓ పోలీసు అధికారి తెలిపారు. సంభల్ తహసీలు పరిధిలో 24 గంటలపాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. 12వ తరగతి వరకు అన్ని విద్యాలయాలకు సోమవారం సెలవు ప్రకటించారు. ఇద్దరు మహిళలు సహా 21 మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
ప్రతిపక్ష పార్టీల ఆరోపణ ఇదీ..
సంభల్ లో అల్లర్లకు బీజేపీ కారణమని యూపీ ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి. 'విద్వేష రాజకీయాలను' పెంపొందించడానికే బీజేపీ సర్వే బృందాలను అక్కడకు పంపిందని ఆరోపించాయి. దీన్ని బీజేపీ కూడా తిప్పికొట్టింది. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఇండియా కూటమి అశాంతిని సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని బిజెపి ఆరోపించింది. న్యాయపరమైన ఆదేశాలతో ఏకీభవించని వారు న్యాయపోరాటం చేయాలని పేర్కొంది.
"చట్టాన్ని ఉల్లంఘించే హక్కు ఎవరికీ లేదు. కోర్టు ఉత్తర్వులు జారీ చేస్తే, అది అమలు చేయాల్సిందే. ఆర్డర్‌ను సవరించాలని కోరుకునే వారికి న్యాయ ప్రక్రియ అందుబాటులో ఉంటుంది" అని పార్టీ అధికార ప్రతినిధి నలిన్ కోహ్లి అన్నారు.
మరో బిజెపి అధికార ప్రతినిధి అజయ్ అలోక్ 'ఘమాండియా కూటమి' (అహంకారంతో నిండిన కూటమి) అని ఇండియా కూటమిని నిందించారు. ఎక్కడైనా హింసాకాండ జరిగినపుడల్లా బీజేపీ ఈ పదాన్ని ఉయోగిస్తున్నారు.
సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ బిజెపిపై విరుచుకుపడ్డారు. 'ఎన్నికల్లో జరిగిన లోపాల నుంచి దృష్టి మరల్చడానికి' ఈ పనికి పాల్పడిందని అన్నారు.
ఎన్నికల చర్చలను భగ్నం చేసేందుకు ఉద్దేశపూర్వకంగానే ఉదయం సర్వే బృందాన్ని పంపారని, ఎన్నికల అంశాలపై ఎలాంటి చర్చ జరగకుండా గందరగోళం సృష్టించడమే ఉద్దేశ్యమని ఆయన లక్నోలో విలేకరుల సమావేశంలో అన్నారు.
యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం హయాంలో రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని యూపీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ రాయ్ అన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రే స్వయంగా ‘ బాటేంగే తో కటేంగే ’ లాంటి ప్రకటనలు ఇచ్చినప్పుడు, రాష్ట్రంలో శాంతి వాతావరణం ఎలా నెలకొంటుంది, ఇది పూర్తిగా ప్రణాళికాబద్ధమైన సంఘటన అని రాయ్ ఒక ప్రకటనలో తెలిపారు.
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా-మార్క్సిస్ట్ -ఉత్తరప్రదేశ్ శాఖ సంభాల్ హింసను ప్రణాళికాబద్ధమైన కుట్రగా పేర్కొంది. వివాదంలో ఉన్న మసీదు సర్వే వెనుక తొందరపాటు ఏమిటని దాని కార్యదర్శి హీరాలాల్ యాదవ్ ప్రశ్నించారు. గుడి, మసీదు పేరుతో రాష్ట్రంలో బీజేపీ అశాంతిని రెచ్చగొడుతోందని, శాంతిభద్రతలను కాపాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
సిపిఐ-మార్క్సిస్ట్-లెనినిస్ట్ కూడా బిజెపిపై విరుచుకుపడింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ, ఇటీవలి విజయాలతో ఉబ్బితబ్బిబ్బవుతున్న బిజెపి, సమాజంలో వివిధ వర్గాల మధ్య కలహాలకు ఆజ్యం పోస్తోందని, రాష్ట్రాన్ని మతతత్వ మంటల్లోకి నెట్టాలని చూస్తోందని ఆరోపించారు.
జామా మసీదు స్థలంలో హరిహర దేవాలయం ఉందని దావా వేసిన పిటిషన్‌పై స్థానిక కోర్టు ఆదేశాల మేరకు సర్వే మొదలుపెట్టారు. గత మంగళవారం కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. దీంతో సంభాల్‌లో ఉద్రిక్తత నెలకొంది.
Next Story