అమృతసర్‌లో ల్యాండ్ అయిన భారతీయ అక్రమ వలసదారుల అమెరికా విమానం
x

అమృతసర్‌లో ల్యాండ్ అయిన భారతీయ అక్రమ వలసదారుల అమెరికా విమానం

30 మంది పంజాబ్‌కు చెందిన వారు కాగా, హర్యానా, గుజరాత్‌ రాష్ట్రాలకు చెందిన వారు 33 మంది, మహారాష్ట్ర, యూపీల నుంచి ముగ్గురు చొప్పున, చండీగఢ్ నుంచి ఇద్దరు ఉన్నారు.


Click the Play button to hear this message in audio format

భారతీయ అక్రమ వలసదారులతో బయలుదేరిన అమెరికా సైనిక విమానం ఈ రోజు (5వ తేదీ) మధ్యాహ్నం పంజాబ్ అమృతసర్‌లోని శ్రీ గురు రందాస్ జీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. విమానంలో మొత్తం 104 మంది ఇండియన్స్‌ ఉన్నారు. వీరిలో 30 మంది పంజాబ్‌కు చెందిన వారు కాగా, హర్యానా, గుజరాత్‌ రాష్ట్రాలకు చెందిన వారు 33 మంది, మహారాష్ట్ర, యూపీల నుంచి ముగ్గురు చొప్పున, చండీగఢ్ నుంచి ఇద్దరు ఉన్నారు. అంతకుముందు 205 మంది భారతీయులతో విమానం బయలుదేరుతుందని వార్తలొచ్చాయి.

టెక్సాస్ సమీపంలోని ఒక వైమానిక స్థావరం నుంచి మంగళవారం బయలుదేరిన US ఎయిర్‌ఫోర్స్ C-17 విమానం బుధవారం మధ్యాహ్నం 1:55కి ల్యాండ్ అయింది. ఇటు విమానాశ్రయం బయట భారీగా పోలీసులను మోహరించారు. బారికేడ్లను ఏర్పాటు చేశారు. అక్రమ వలసదారులను(Illegal Indian immigrants) విచారించి ఇళ్లకు పంపనున్నారు. ఎవరికైనా క్రిమినల్ రికార్డు ఉందా? అన్న విషయాన్ని కూడా పరిశీలించనున్నారు.

బోరున విలపించిన వృద్ధురాలు..

తన కొడుకు, కోడలు, మనవడు అక్రమంగా అమెరికా వెళ్లారని గుజరాత్‌లోని గాంధీనగర్‌‌కు చెందిన ఒక వృద్ధురాలు పేర్కొన్నారు. "నాకు ఏమీ తెలియదు. నా కొడుకు, కోడలు, మనవడు తప్ప నాకు ఎవరూ లేరు... వాళ్లు ఫోన్‌లో కూడా మాట్లాడలేదు... వాళ్లు తిరిగి వస్తారని మాత్రం చెప్పారు. అంతకుమించి నాకేమీ తెలియదు," అంటూ ఆమె భోరున విలపించింది.

అక్రమ మార్గాల ద్వారా ("డంకీ రూట్స్") లేదా లక్షల రూపాయలు ఖర్చుచేసి అమెరికాకు వెళ్లిన పంజాబీ వలసదారులు ఇప్పుడు అక్కడి ప్రభుత్వం చేతిలో చిక్కి బహిష్కరణను ఎదుర్కొంటున్నారు.

కాంగ్రెస్ దిగ్భ్రాంతి..

భారతీయులను చేతులు కట్టేసి తీసుకెళ్లిన దృశ్యాలు దిగ్భ్రాంతికరమని కాంగ్రెస్ పార్టీ బుధవారం ప్రకటించింది. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ మాట్లాడుతూ.. "అమెరికా నుంచి సుమారు వంద మందికిపైగా భారతీయులు బహిష్కరణకు గురయ్యారన్న వార్తలు వస్తున్నాయి. అయితే ఏటా వందలాది భారతీయులను అమెరికా వెనక్కు పంపుతోంది. గత జో బైడెన్ ప్రభుత్వం కూడా 1,100 మందిని పంపించిందని గమనించాలి" అని వ్యాఖ్యానించారు.


Read More
Next Story