
ఉపరాష్ట్రపతి ఎన్నిక: ఓటు హక్కు వినియోగించుకున్న ప్రధాని మోదీ
సీపీ రాధాకృష్ణన్, బీ సుదర్శన్ రెడ్డి మధ్య ప్రత్యక్ష పోటీ.. మూడు పార్టీలు ఓటింగ్‌కు దూరంగా..
కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నిక ఇవాళ (సెప్టెంబర్ 9) జరుగుతుంది. ఎన్డీఏ అభ్యర్థిగా మహారాష్ట్ర (Maharashtra) గవర్నర్‌గా ఉన్న సీపీ రాధాకృష్ణన్(CP Radhakrishnan), ఉమ్మడి ప్రతిపక్ష అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి (B Sudershan Reddy) పోటీలో నిలిచిన విషయం తెలిసిందే.
రాజ్యసభ స్పీకర్ జగదీప్ ధన్‌ఖడ్ ఆకస్మిక రాజీనామాతో ఈ ఎన్నిక జరుగుతోంది. ప్రధాని మోదీ (PM Modi) మొదటగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. కేంద్రమంత్రులు కిరణ్ రిజిజు, అర్జున్ రామ్ మేఘ్వాల్, జితేంద్ర సింగ్, ఎల్ మురుగన్‌తో కలిసి పార్లమెంటు భవనంలోని రూం నంబర్ 101లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వరకు వెళ్లారు. ఓటింగ్ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. ఓట్ల లెక్కింపు సాయంత్రం 6 గంటలకు మొదలవుతుంది. ఫలితం సాయంత్రం తరువాత వెలువడుతుంది.
రహస్య బ్యాలెట్..
రహస్య బ్యాలెట్ విధానం కింద జరిగే ఉపాధ్యక్ష ఎన్నికల్లో పార్లమెంటు సభ్యులు పార్టీ విప్‌లకు ఓటు వేయడానికి కట్టుబడి ఉండరు. తొలి దశలో ఓటు వేసిన వారిలో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, మేఘవాల్, ప్రహ్లాద్ జోషి, రాజ్యసభ డిప్యూటీ చైర్‌పర్సన్ హరివంశ్, మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఎస్పీ నాయకుడు రామ్ గోపాల్ యాదవ్, కాంగ్రెస్ నాయకులు జైరాం రమేష్, నాసర్ హుస్సేన్ ఉన్నారు.
92 ఏళ్ల గౌడ వీల్‌చైర్‌లో పోలింగ్ కేంద్రానికి వచ్చారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చేయి చేయి కలిపి పోలింగ్ కేంద్రం వరకు నడుచుకుంటూ రావడం కనిపించింది.
కాగా మూడు పార్టీలు బిజూ జనతాదళ్, భారత రాష్ట్ర సమితి, శిరోమణి అకాలీదళ్ ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి.