సీఎం జగన్‌కు తలనొప్పిగా మారిన విశాఖ
x
విశాఖపట్నం

సీఎం జగన్‌కు తలనొప్పిగా మారిన విశాఖ

గెలిచిన నియోకవర్గాల్లో తన ఆదిపత్యాన్ని దక్కించుకోవాలని వైఎస్సార్‌సీపీ ప్రయత్నిస్తుంటే అంతర్గత పోరు ఆ పార్టీని ముందుకు పోకుండా చేస్తున్నది. ఎలాగంటే


విశాఖ నగరంలోని వైఎస్సార్‌సీపీలో ఏమి జరుగుతోంది. కుంపట్లు, కుమ్ములాటలు ఎందుకు వస్తున్నాయి. ప్రస్తుతం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లుగా ఉన్న వారిపై ఎందుకు తిరుగుబాటు వస్తోంది. అంతర్గతంగా ఒకరిపై ఒకరు పోరు నడపడానికి కారణాలు ఏమిటి? జరుగుతున్న పరిణామాలు వైఎస్సార్‌సీపీని విశాఖలో గట్టెక్కిస్తాయా? కిందకు పడేస్తాయా? సీఎం జగన్‌ విశాఖలో పార్టీని ఎలా గట్టెక్కిస్తారు?

భీమిలీతో కలిపి ఆరు నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో గాజువాక, భీమిలీలో మాత్రమే వైఎస్సార్‌సీపీ గెలుపొందింది. నగరంలోని తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణ నియోజకవర్గాల్లో టీడీపీ గెలిచింది. ఇప్పుడు ఈ నాలుగు నియోకవర్గాతో పాటు గెలిచిన నియోకవర్గాల్లో తన ఆదిపత్యాన్ని దక్కించుకోవాలని వైఎస్సార్‌సీపీ ప్రయత్నిస్తుంటే అంతర్గత పోరు ఆ పార్టీని ముందుకు పోకుండా చేస్తున్నది.
వాసుపల్లిపై తీవ్ర వ్యతిరేకత
విశాఖపట్నం సౌత్‌ నియోకవర్గంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌ వైఎస్సార్‌సీపీలో చేరారు. ఆ నియోజకవర్గంలోని తొమ్మిది మంది కార్పొరేటర్లు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఇక్కడి నుంచి గణేష్‌కు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ నాయకుడు సుధాకర్‌ పావులు కదుపుతున్నారు. ఎలాగైనా గణేష్‌కు టిక్కెట్‌ దక్కకుండా చేయాలని పట్టుదలతో ఉన్నారు. తనకు టిక్కెట్‌ కావాలని సుధాకర్‌ ఇప్పటికే అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారు. సుధాకర్‌ గతంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా వైఎస్సార్‌సీపీ మద్దతుతో విశాఖ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. పార్టీలోని ముఖ్యులతో మాట్లాడి గణేష్‌ను వ్యతిరేకించాలని రెచ్చగొట్టే కార్యక్రమాన్ని చేపట్టారు.
సామాజికవర్గం మార్పుపై దృష్టి
గాజువాక నియోజకవర్గం పలువురి దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌ ఇక్కడ పోటీ చేసి ఓటమి చెందారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన తిప్పల నాగిరెడ్డి పవన్‌పై గెలుపొందారు. అక్కడ చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో నాగిరెడ్డి కుమారుడు తిప్పల దేవన్‌రెడ్డిని నియోజకవర్గ ఇన్‌చార్జిగా వైఎస్సార్‌సీపీ ఇప్పటి వర కు ఉపయోగించుకుంది. ఏమి జరిగిందో కాని దేవన్‌రెడ్డిని కాదని వరికూటి రామచంద్రరావుకు ఇన్‌చార్జ్‌ ఇస్తూ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక్కడ రెడ్డికి కాకుండా యాదవ సామాజిక వర్గానికి టిక్కెట్‌ ఇస్తే బాగుంటుందని వైఎస్సార్‌సీపీ భావిస్తోంది. దీంతో నాగిరెడ్డి వర్గం పార్టీని దుమ్మెత్తి పోస్తోంది. బయటకు కనిపించకపోయినా నాగిరెడ్డి వర్గం నుంచి వైఎస్సార్‌సీపీ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. రామచంద్రరావు కార్పొరేటర్‌. ఆయన ఏర్పాటు చేస్తున్న మీటింగ్‌లకు ఎమ్మెల్యే వర్గం వారు హాజరు కావడం లేదు.
మార్పు కోరుకుంటున్న ముత్తంశెట్టి
భీమిలీ ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాస్‌ (అవంతి శ్రీనివాస్‌) నియోజకవర్గ మార్పును కోరుకుంటున్నారు. ఈ పాటికే ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. అయితే వారి నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. గతంలో శ్రీనివాస్‌ అనకాపల్లి ఎంపీగా చేశారు. ఇప్పుడు పెందుర్తి నుంచి పోటీ చేస్తే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇక్కడ కూడా శ్రీనివాస్‌పై వ్యతిరేకత ఎక్కువగా ఉండటం వల్ల ఆయన నియోజకవర్గ మార్పును కోరుకుంటున్నారని సమాచారం.
తూర్పు టిక్కెట్‌ ఎవరికో..
విశాఖతూర్పు నియోజకవర్గం టిక్కెట్‌ ఎవరికి వస్తుందోనని వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాయి. గత ఎన్నికల్లో తూర్పు నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా విజయనిర్మల పోటీ చేసి ఓటమి చెందారు. ఆమె సక్రమంగా ఇన్‌చార్జ్‌ బాధ్యతలు నిర్వహించడం లేదని విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు ఇన్‌చార్జ్‌ బాధ్యతలు అప్పగించారు. ఆయనకు పోలీసుల నుంచి కొంతకాలం క్రితం చాలా సమస్యలు ఎదురయ్యాయి. ఈ సమస్యలు పరిష్కరించుకోవడంతో పాటు నియోజకవర్గ బాధ్యతలు చూడటం కష్టంగా మారింది. దీంతో నియోజకవర్గంలో క్యాడర్‌ దిక్కుతోచని స్థితికి చేరింది. ఇక్కడ బలమైన సామాజిక వర్గాన్ని రంగంలోకి దించాలనే ఆలోచనలో వైఎస్సార్‌సీపీ ఉంది.
దిక్కులేని విశాఖ వెస్ట్‌ నియోజకవర్గం
వైఎస్సార్‌సీపీకి విశాఖ వెస్ట్‌ నియోజకవర్గంలో దిక్కులేకుండా పోయింది. అక్కడ గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందిన మల్ల విజయప్రసాద్‌ వెల్‌ఫేర్‌ స్కామ్‌లో జైలుకు వెళ్లారు. వైఎస్సార్‌సీపీ నుంచి విశాఖ డెయిరీ చైర్మన్‌ అడారి ఆనందకుమార్, కార్పొరేటర్‌ పీవీ రమేష్, పార్టీ నాయకుడు దొడ్డి కిరణ్‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. వీరిపై కూడా అవినీతి ఆరోపణలు రావడంతో ఈ చర్యలు తీసుకున్నారు. దీంతో ఇప్పుడు ఇక్కడ వైఎస్సార్‌సీపీకి దిక్కులేకుండా పోయిందని చెప్పవచ్చు.
ఉత్తర నియోజకవర్గంలోనూ ఆరని మంటలు
విశాఖ ఉత్తర నియోజవర్గంలోని వైఎస్సార్‌సీపీలో మంటలు ఆరలేదు. ఇక్కడ వైఎస్సార్‌సీపీ గత ఎన్నికల్లో ఓటమిపాలైన దగ్గర నుంచి పేరుకు ఓడిన అభ్యర్థి ఇన్‌చార్జ్‌గా ఉన్నారే తప్ప పార్టీని బలోపేతం చేయడంలో విఫలమయ్యారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన గంటా శ్రీనివాసరావు గెలుపొందిన విషయం తెలిసిందే. వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కెకె రాజు ఓటమి పాలయ్యారు. నియోజకవర్గంలో రాజు ఎక్కువగా రుబాబులు చేస్తున్నారనే ఆరోపణలు వున్నాయి. అందువల్ల ఆయనకు టిక్కెట్‌ ఇస్తే మొదటికే మోసం వస్తుందనే ఆలోచనలో వైఎస్సార్‌సీపీ ఉన్నట్లు సమాచారం. మాజీ ఎమ్మెల్యే విజయకుమార్, ఏపీ మెరైన్‌బోర్డు చైర్మన్‌ సాయల వెంకటరెడ్డిలు టిక్కెట్‌ను ఆశిస్తున్న వారిలో ఉన్నారు. వీరిరువురిలో ఒకరికి టిక్కెట్‌ దక్కుతుందా? వేరే ఎవరినైనా రంగంలోకి తీసుకొస్తారా? వేచి చడాల్సిందే.


Read More
Next Story