దోపిడీ నిర్మూలనకే వక్ఫ్ చట్టం..
x

దోపిడీ నిర్మూలనకే వక్ఫ్ చట్టం..

హర్యానాలో కాంగ్రెస్‌పై ధ్వజమెత్తిన ప్రధాని మోదీ


Click the Play button to hear this message in audio format

దోపిడీ నుంచి పేదలను రక్షించడమే వక్ఫ్ చట్టం(Waqf Bill) లక్ష్యమని ప్రధాని మోదీ (PM Modi) పేర్కొన్నారు. కొత్త చట్టం ప్రకారం..ఆదివాసీల ఆస్తిపై వక్ఫ్ బోర్డుకు నియంత్రణ ఉండదని చెప్పారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా హిసార్‌లో ఏర్పాటు చేసిన సభలో ఆయన కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కొత్త చట్టం వక్ఫ్ ఆధీనంలోని భూ మాఫియాకు చెక్‌పెట్టి, పేదలకు ప్రయోజనం చేకూరుస్తుందని చెప్పారు. ఇకపై పేద, పస్మాండ ముస్లింలు దక్కాల్సిన హక్కులు పొందుతారని, అదే నిజమైన సామాజిక న్యాయం అని పేర్కొన్నారు. ముస్లింలపై ప్రేమ ఉంటే ఏఐసీసీ అధ్యక్ష స్థానం కేటాయించగలరా ? అని సవాల్ విసిరారు.

హర్యానా(Haryana)లోని వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేశారు. మహారాజా అగ్రసేన్ విమానాశ్రయం నుంచి అయోధ్యకు వాణిజ్య విమాన సర్వీసును జెండా ఊపి ప్రారంభించిక..విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన సభలో మోదీ ప్రసంగించారు. కాంగ్రెస్‌ను తూర్పారబట్టారు.

‘గ్రామాల్లో నీళ్లు వచ్చేవి కాదు’

‘‘కాంగ్రెస్ పార్టీ ఏళ్ల తరబడి పాలన సాగిస్తున్న సమయంలో.. ఆ పార్టీ నాయకుల స్విమ్మింగ్ పూల్స్‌లోకి నీళ్లు వచ్చేవి కానీ గ్రామాల్లో కుళాయిలకు నీళ్లు పారేవి కాదు.

స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు గడిచినా.. గ్రామాల్లోని 16 శాతం ఇళ్లకు మాత్రమే కుళాయి నీరు అందుతోంది. దీనివల్ల ఎక్కువగా ప్రభావితమైంది ఎవరు? ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు. వారి పట్ల నిజమైన ప్రేమానురాగాలు ఉంటే వాళ్ల ఇళ్లకు నీళ్లు అందేలా చూడాలి’’ అని ధ్వజమెత్తారు.

‘ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి’

‘‘సామాజిక న్యాయం గురించి కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా మాట్లాడుతుంది. కాని అంబేద్కర్‌, చౌదరి చరణ్ సింగ్‌లకు భారతరత్న ఇవ్వలేదన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మతానికి ప్రభుత్వ టెండర్లలో రిజర్వేషన్లు ఇచ్చి ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీల హక్కులను లాక్కుంటుంది. రాజ్యాంగంలో మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వడం నిషేధమని అంబేద్కర్ చెప్పారు’’ అని కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు.

‘ఆయనను దూరంగా ఉంచటానికి కుట్ర చేశారు..’

"అంబేద్కర్ విషయంలో కాంగ్రెస్ వాళ్లు ఏం చేశారో మనం మర్చిపోకూడదు. ఆయన బతికి ఉన్నప్పుడు ఆ పార్టీ ఆయనను అవమానించింది, ఎన్నికల్లో ఆయన రెండుసార్లు ఓడిపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్లగొట్టాలని చూసింది. వ్యవస్థ నుంచి దూరంగా ఉంచడానికి కుట్ర చేశారు. అంబేద్కర్ లేనప్పుడు ఆయన జ్ఞాపకాలను తుడిచివేయడానికి కూడా కాంగ్రెస్ ప్రయత్నించింది. ఈ రోజు మనందరికి, దేశానికి ముఖ్యంగా దళితులకు, బలహీన, అణగారిన వర్గాలకు ముఖ్యమైన రోజు. ఇది వారికి రెండో దీపావళి. 11 ఏళ్ల సుధీర్ఘ రాజకీయ ప్రయాణంలో అంబేద్కర్ జీవితం మాకు స్ఫూర్తిదాయకం’’ అని పేర్కొన్నారు.

‘మాతోనే పేదల సంక్షేమం’

కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ఒక వైపు కనెక్టివిటీకి ప్రాధాన్యం ఇస్తూనే మరోవైపు అంబేద్కర్ ఆశించిన సామాజిక న్యాయం, పేదల సంక్షేమానికి పాటుపడుతోందన్నారు.

రూ.410 కోట్లతో కొత్త టెర్మినల్..

మహారాజా అగ్రసేన్ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ నిర్మాణానికి రూ.410 కోట్లు కేటాయించారు. ఈ ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

వివిధ ప్రాంతాలకు విమాన సర్వీసులు..

హిసార్ నుంచి అయోధ్యకు వారానికి రెండుసార్లు, జమ్మూ, అహ్మదాబాద్, జైపూర్ చండీగఢ్‌కు వారంలో మూడు విమానాలు నడపడం వల్ల హర్యానాకు కనెక్టివిటీ పెరుగుతుందని భావిస్తున్నారు. హిసార్ నుంచి ఇతర నగరాలకు విమాన సర్వీసులు త్వరలో ప్రారంభమవుతాయని మోదీ చెప్పారు.

హర్యానావాసుల ఆకాంక్ష నెరవేర్చాం..

'హవాయి చప్పల్' ధరించిన వ్యక్తి విమానంలో ఎగురుతాడని నేను మీకు మాట ఇచ్చా, అది నిజం కావడం ఇప్పుడు చూస్తున్నాం. గత పదేళ్లలో కోట్లాది మంది భారతీయులు మొదటిసారిగా విమానంలో ప్రయాణించారు. గతంలో మంచి రైల్వే స్టేషన్లు కూడా లేని ప్రదేశాలలో మేం విమానాశ్రయాలను నిర్మించాం" అని చెప్పారు. 2014కి ముందు దేశంలో 74 విమానాశ్రయాలు ఉండేవని, కానీ ఇప్పుడు 150 కి పైగా విమానాశ్రయాలు ఉన్నాయని గత కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

హడావుడిగా సవరణలు..

"ఎన్నికల్లో ఓట్లు పొందేందుకు కాంగ్రెస్ 2013 చివరిలో వక్ఫ్ చట్టంలో హడావుడిగా సవరణలు చేసింది. వారు రాజ్యాంగానికి మించి ఈ చట్టాన్ని చేశారు. ఇది బాబాసాహెబ్‌కు జరిగిన అతిపెద్ద అవమానం." ముస్లింల ప్రయోజనాల కోసమే అలా చేశామని చెప్పారు కూడా. ముస్లింలను ఓటు బ్యాంకుగా వాడుకునే వారికి నేను సవాల్ చేస్తున్నా.. మీకు నిజంగా ముస్లింల పట్ల అభిమానం ఉంటే ముస్లింను ఏఐసీసీ అధ్యక్షుడిగా నియమించండి. మరి వారు అలా ఎందుకు చేయరు?" అని నిలదీశారు.

కాంగ్రెస్(Congress) అధికారంలో ఉన్నప్పుడు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఓబీసీలను రెండో తరగతి పౌరులుగా మార్చి ఓటు బ్యాంకుగా వాడుకుందని కాంగ్రెస్ పార్టీపై ధ్వజమెత్తారు.

Read More
Next Story