
వందేమాతరం గీతంపై రాజ్యసభలో మాటల యుద్ధం..
జేపీ నడ్డాకు ఘాటుగా కౌంటర్ ఇచ్చిన మల్లికార్జున ఖర్గే..
జాతీయగీతం 'వందేమాతరం(Vande mataram)' పై చర్చ గురువారం (డిసెంబర్ 11) పార్లమెంటును కుదిపేసింది. సభలో ఇద్దరు అగ్ర నాయకులు కత్తులు దూసుకున్నారు.
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జాతీయ గీతానికి తగిన గౌరవం లభించలేదని దానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని కేంద్ర మంత్రి, రాజ్యసభ నాయకుడు జె.పి. నడ్డా(JP Nadda) అన్నారు. ఇందుకు రాజ్యసభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే(Mallikarjuna Kharge) ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు చర్చ 'వందేమాతరం' గురించా లేక నెహ్రూ గురించా? అని ప్రశ్నించారు.
బ్రిటిష్ కాలంలో బంకించంద్ర చటర్జీ రాసిన వందేమాతర గీతం దేశ ప్రజలను ఏకం చేసిందని, అయితే పాటలోని కొన్ని చరణాల గురించి అభ్యంతరాలను ఉటంకిస్తూ 1937లో నెహ్రూ రాసిన లేఖను నడ్డా సభలో ప్రస్తావించారు. దీనికి ఖర్గే కౌంటర్ ఇచ్చారు. 1937లో నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నారా? అని ఖర్గే అడిగారు. దీనికి నడ్డా మాట్లాడుతూ.. నెహ్రూ అప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడని.. ముస్లిం సామాజిక వర్గాల ఒత్తిడితో పాటలోని కొన్ని చరణాలను మార్చారని ఆరోపించారు.
బీజేపీ నాయకులు చరిత్రను వక్రీకరిస్తున్నారని ప్రతిపక్ష నేతలు ఆరోపించారు. నెహ్రూను కించపరచడమే లక్ష్యంగా పెట్టుకున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత రమేష్ పేర్కొన్నారు.

