‘కుట్రలు తిప్పికొడతాం..ఉగ్రమూకల అంతం చూస్తాం’
x

‘కుట్రలు తిప్పికొడతాం..ఉగ్రమూకల అంతం చూస్తాం’

‘‘గతంలో వారి వికృత ప్రయత్నాలు విఫలమయ్యాయి. అయినా .. చరిత్ర నుంచి వాళ్లు ఎలాంటి గుణపాఠాలు నేర్చుకోలేదు.’’ అని పాకిస్థాన్ ను ప్రధాని మోదీ ఘాటుగా విమర్శించారు.


దేశం కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడిన సైనికుల త్యాగాన్ని వెలకట్టలేమని, వారికి యావత్‌ భారతదేశం ఎప్పటికీ రుణపడి ఉంటుందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. కార్గిల్‌ 25వ విజయ దివస్‌ను పురస్కరించుకుని శుక్రవారం ఆయన లద్దాఖ్‌ ద్రాస్‌లోని యుద్ధ స్మారకాన్ని సందర్శించి అమర వీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మోదీ పాకిస్థాన్‌పై విరుచుకుపడ్డారు. ఉగ్రవాదాన్ని తుదముట్టిస్తామని గట్టిగా హెచ్చరించారు.

చరిత్ర నుంచి వాళ్లేమీ నేర్చుకోలేదు..

‘‘గతంలో పాకిస్థాన్‌ వికృత ప్రయత్నాలు విఫలమయ్యాయి. అయినా .. చరిత్ర నుంచి వాళ్లు ఎలాంటి గుణపాఠాలు నేర్చుకోలేదు. ఉగ్రవాదం, ప్రాక్సీవార్‌తో కవ్వింపు చర్యలను కొనసాగిస్తూనే ఉన్నారు. దుర్మార్గపు కుట్రలు ఎన్నటికీ ఫలించవు. మా దళాలు ఉగ్రవాదులకు, శత్రువులకు తగిన బుద్ధి చెబుతాయి’’ అని ఘాటుగా హెచ్చరించారు.

‘‘లద్దాఖ్‌, జమ్మూకశ్మీర్‌ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. కొద్ది రోజుల్లో ఆర్టికల్‌ 370ని రద్దు చేసి ఐదేళ్లు పూర్తవుతాయి. రాష్ట్ర ప్రజలు సరికొత్త భవిష్యత్తు కోసం ఎదురుచూస్తున్నారు. కాశ్మీర్‌లో శాంతి నెలకొంటోంది’’ అని మోదీ తెలిపారు.

కార్గిల్ డే..

మే 5, 1999 సంవత్సరం మన దేశ భూభాగంలోకి పాకిస్తాన్ ప్రవేశించింది. మే నుంచి జులై వరకు కార్గిల్ పర్వత శ్రేణులలో భారతదేశం, పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగింది. దాదాపు 84 రోజుల పాటు జరిగిన యుద్ధం సాగింది. సుమారు 500 మంది సైనికులు చనిపోయారు. చివరకు జులై 26, 1999న భారతదేశం విజయం సాధించింది. భారత సైనికుల త్యాగం, ధైర్యాన్ని స్మరించుకుంటూ ఏటా జూలై 26ను కార్గిల్ విజయ్ దివస్‌గా జరుపుకుంటున్నాం.

Read More
Next Story