రాష్ట్రపతితో పశ్చిమ బెంగాల్ గవర్నర్ భేటీ, ఎందుకు ?
పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ సోమవారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు.
పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ సోమవారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. కోల్‌కతా ఘటనపై ఆయన మంగళవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు సీనియర్ నేతలతో భేటీ అయ్యే అవకాశం ఉందని సమాచారం.
కోల్‌కతా ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌లో మహిళా వైద్యురాలిపై అత్యాచారం-హత్య జరిగిన నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లో పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దేశవ్యాప్తంగా ఆరోగ్య సేవలు స్తంభించాయి. ఈ నేపథ్యంలో గవర్నర్ గురువారం ఆసుపత్రిని సందర్శించారు. ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్లతో మాట్లాడారు. న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
సమాజంలో మార్పు రావాలి..
సోమవారం కోల్‌కతాలోని రాజ్‌భవన్‌లో జరిగిన రాఖీ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. పలువురు మహిళా వైద్యులు, ఇతరులు ఆయనకు రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా బోస్ మాట్లాడుతూ.. “పశ్చిమ బెంగాల్‌లో ప్రజాస్వామ్యం క్షీణిస్తోంది. మహిళలకు రక్షణ కొరవడింది. మహిళలపై దాడులకు అరికట్టేందుకు తీసుకునే చర్యలకు నా మద్దతు ఉంటుంది. గవర్నర్‌గా ప్రజలకు సేవ చేయడం నా బాధ్యత. లక్ష్యం చాలా దూరంలో ఉందని నాకు తెలుసు. కానీ గమ్యాన్ని ఖచ్చితంగా చేరుకుంటామన్న నమ్మకం ఉంది. " అని బోస్ అన్నారు.