అటల్ సేతు: ప్రయాణిస్తే జేబుకు చిల్లేనా..
x
అటల్ వంతెన

అటల్ సేతు: ప్రయాణిస్తే జేబుకు చిల్లేనా..

ముంబై- నవీ ముంబై మధ్య నిర్మించిన అటల్ సేతు ప్రారంభమయింది. దేశంలోనే పొడవైన సముద్ర వంతెనగా పేరు ఉంది. కానీ దీనిపైన ప్రయాణిస్తే నెలకు టోల్ ఎంత కట్టాలంటే రూ..


ముంబై.. దేశ ఆర్థిక, వాణిజ్య రాజధాని. రెండు కోట్ల జనాభాతో దేశంలోనే అత్యంత రద్దీ కలిగిన మహనగరంగా పేరుపొందింది. రద్దీగల ప్రదేశాల నుంచి సాయంత్రం, ఉదయం వేళలో ప్రయాణించడం కష్టంగా ఉంటుంది. గంటల తరబడి ట్రాఫిక్ లో వేచిచూడాల్సి ఉండకుండా, సులభంగా ప్రయాణించడానికి ఓ వంతెన నిర్మించారు. ప్రధాని నరేంద్ర మోడీ దానిని ప్రారంభించి అటల్ సేతుగా నామకరణం చేశారు. జనవరి 12న ఇది ప్రారంభం అయింది.

అటల్ సేతు ముంబై- నవీముంబై మధ్య ప్రయాణ సమయాన్ని రెండు గంటల నుంచి కేవలం 20 నిమిషాలను తగ్గించింది. రోజుకు 70 వేల వాహనాలు దీనిపై ప్రయాణిస్తామని ఓ అంచనా. అత్యధిక వేగంగా వెళ్లే వాహనాలను గుర్తించడానికి అవసరమైన సాంకేతికతను ఇక్కడ వాడుతున్నారు. వంతెన నిర్మాణం కోసం 18 వేల కోట్లను ఖర్చు చేశారు. వంతెన మొత్తం పొడవు 22 కిమీలు ఉంది. ఇందులో అరేబియా సముద్రంలోనే 16.5 కిమీలు, రోడ్డుపై 5.5 కిమీలు ఉంటుంది. ముంబైలోని సెవ్రి నుంచి మొదలై, నవీ ముంబైలోని చిర్లే వరకు దీనిని నిర్మించారు.

ఆరువరుసల్లో ఈ వంతెన నిర్మించారు. ఇది దేశంలోని అతిపొడవైన సముద్ర వంతెన. ప్రపంచంలో 12 వ పొడవైన వంతెనగా పేరుపొందింది. అలాగే కీలకమైన రహదారులను సైతం కలుపుతుంది. ముంబై- గోవా హైవే, వసాయి, విరార్, నవీ ముంబై- రాయ్ గఢ్ జిల్లాలోని ముంబైలను కలుపుతుంది. ముంబై- పూణే ఎక్స్ ప్రెస్ హైవే, ముంబై- గోవా హైవేలకు దగ్గరగా ఉంటుంది. అలాగే నవీ ముంబైలోని అంతర్జాతీయ విమానాశ్రాయాలను కలుపుతుంది. దీనివల్ల పర్యాటకం పెరగడంతో పాటు, ఆర్థికరంగం అభివృద్ధి చెందడానికి అవసరమైన అవకాశాలను సృష్టిస్తుందని అంచనాలు ఉన్నాయి.




వంతెన నిర్మాణానికి సుమారుగా 1,77,903 టన్నుల ఉక్కు, 5,04,253 మెట్రిక్ టన్నుల సిమెంట్ వాడారు. గరిష్ట స్పీడ్ వంద కిలోమీటర్లుగా ఉంది. వంతెనపై ద్విచక్రవాహనాలు, ఆటోలు, ట్రాక్టర్లను అనుమతించరు. గత ఏడాదిలోనే ఈ వంతెన ప్రారంభం కావాల్సి ఉండగా, విద్యుద్దీకరణ, టోల్ గేట్ నిర్మాణంలో ఆలస్యం కావడంతో జనవరికి వాయిదా పడింది. సెవ్రీ, శివాజీ నగర్, చిర్లేలతో పాటు ఇతర కీలక ప్రాంతాల్లో ఇంటర్ చేంజ్ లను ఏర్పాటు చేశారు.

మహరాష్ట్ర ప్రభుత్వం 2017లో ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ కి వంతెన నిర్మాణ బాధ్యతలను అప్పగించించింది. ఈ నిర్మాణం కోసం రూ. 18వేల కోట్లను జపాన్ ఇంటర్నేషనల్ కో ఆపరేషన్ ఏజెన్సీ(JICA) రుణం కింద అందజేసింది. ఈమార్గం వాషి వంతెన పై భారాన్ని తగ్గిస్తుంది. 1960లోనే ముంబై- ఉరాన్ మధ్య వంతెన నిర్మించాలని ప్రణాళికలు వేసిన అది కార్యరూపం దాల్చలేదు. వంతెన ఉపయోగించడం వల్ల సంవత్సరానికి కోటీ లీటర్ల ఇంధనం ఆదా అవుతుందని, కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు 25000 మిలియన్ టన్నులకు తగ్గించవచ్చని ఓ అంచనా ఉంది.

కొత్త టెక్నాలజీ

టోల్ బూతుల నుంచి 100 కిలోమీటర్ల వేగం వెళ్లగల ఓపెన్ రోడ్ టోలింగ్ వ్యవస్థ ఉన్న వంతెనగా రికార్డుల కెక్కింది. అలాగే రుతుపవనాల కాలంలో ప్రచండ వేగంతో వీచే గాలులను తట్టుకునే విధంగా లైటింగ్ స్తంభాలను రూపొందించారు. అలాగే మెరుపుల నుంచి రక్షించడానికి తగిన రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేశారు.

వంతెన నిర్మాణం కోసం ఐఐటీ బొంబాయి ను సైతం భాగం చేశారు. ముంబై ఓ మోస్తరు భూకంప జోన్ పరిధిలోకి వస్తుంది. ‘రిక్టర్ స్కేల్ పై 6.5 తీవ్రతతో వచ్చే నాలుగు రకాల భూకంపాలను తట్టుకునేలా డిజైన్ రూపొందించాం’ అని ఐఐటీ సివిల్ ఇంజనీర్ హెడ్ ప్రొఫెసర్ దీపాంకర్ చౌదరి చెప్పారు. ‘వంతెనపై ఉపయోగించే లైట్ల వల్ల జల పర్యావరణానికి ఎటువంటి నష్టం జరగదు’అని ఎంఎంఆర్డీఏ కమిషనర్ డాక్టర్ సంజయ్ ముఖర్జీ అన్నారు.

ధనవంతుల వంతెనగా

అటల్ వంతెన మీద నెలకు ప్రయాణించాలంటే కార్లకు నెలవారీ పాస్ విలువ రూ. 12,500 చెల్లించాలి. ఒకరోజు ఒకసారి వెళ్లాలంటేం ఫోర్ వీలర్ కు రూ. 250 చెల్లించాలి. రెండు వైపులా ప్రయాణించాలంటే రూ. 370 చెల్లించాలి. రోజువారీగా పాస్ కోసం రూ. 625 కట్టాల్సిందే. బాంద్రా-వర్లీ సముద్రపు వంతెనపై ఒకవైపు ప్రయాణించాలంటే రూ. 85 చెల్లించాలి. రెండు వైపులా ప్రయాణానికి రూ. 127 చెల్లించాలి. దానితో పోలిస్తే ఇది చాలా ఎక్కువ.

వంతెన నిర్మాణంతో నవీ ముంబై లో ఆస్థులు సృష్టి జరుగుతుందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ రంగం గణనీయంగా ఫుంజుకుంటుందని, ప్లాట్ల ధరలు పెరుగుతాయని ఆ రంగంలోని నిపుణులు చెబుతున్నారు.

Read More
Next Story