
బీఎంసీ ఎన్నికల్లో సీట్లు ఖరారు చేసుకున్న బీజేపీ- షిండే
137 స్థానాల్లో బీజేపీ, 90 స్థానాల్లో షిండే వర్గం పోటీ
బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పాలక మిత్రపక్షాలు అయిన బీజేపీ, ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. ఈ రెండు పార్టీలు వరుసగా 137, 90 స్థానాలను పంచుకున్నాయి.
బృహన్ ముంబై మున్సిపాలిటీలో 227 వార్డులు ఉన్నాయి. వీటిలో మెజారిటీ సీట్లను బీజేపీ పోటీ చేయబోతోంది. నామినేషన్ దాఖలు చేయడానికి డిసెంబర్ 30 కావడంతో ఒక రోజు ముందు రెండు పార్టీల మధ్య ముమ్మర చర్చలు జరిగాయి. తరువాత ముంబై బీజేపీ అధ్యక్షుడు అమిత్ సతం సోమవారం సీట్ల పంపకాల ఒప్పందాన్ని వెల్లడించారు.
రెండు పార్టీలు తమ తమ కోటాల్లోని కొన్ని సీట్లను తమ కూటమి భాగస్వాములకు కేటాయిస్తాయని అమిత్ ప్రకటించారు. రెండు పార్టీల అభ్యర్థులు మంగళవారం నామినేషన్లు దాఖలు చేయబోతున్నారు.
మహాయుతిలోని మరో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ, ఈ ఎన్నికల్లో విడిగా పోటీ చేస్తోంది. బీఎంసీ ఎన్నికల్లో ఎన్సీపీ ఇప్పటికే 64 మంది అభ్యర్థులను ప్రకటించింది.
మహారాష్ట్రలోని 29 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జనవరి 15న జరుగుతాయి. వాటిలో ఒకటి కీలకమైన ముంబై కూడా ఉంది. జనవరి 16న ఓట్ల లెక్కింపు ఉంటుంది.

