‘శనివర్ నాడా’ లో నమాజ్, శుద్ది చేసిన బీజేపీ
x
కోటలో నమాజ్ చేస్తున్న ముస్లింలు, ఆందోళన చేస్తున్న బీజేపీ

‘శనివర్ నాడా’ లో నమాజ్, శుద్ది చేసిన బీజేపీ

కమలం పార్టీపై ప్రతిపక్షాల ఆగ్రహం


మహారాష్ట్రలో మరోసారి రాజకీయ వివాదం చెలరేగింది. పూణెలోని చారిత్రాత్మక ‘శనివర్ నాడా’ లోపల కొంతమంది ముస్లింలు నమాజ్ చేసిన వీడియోలు బయటకు రావడంతో వివాదం చెలరేగింది. దీనిపై బీజేపీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ సంఘటన జరిగిన ప్రాంతంలో గోమూత్రం, పేడ చల్లి శుద్ది కార్యక్రమం నిర్వహించారు.

1818 వరకూ మరాఠా సామ్రాజ్యంలోని పేష్వాల స్థావరంగా ఉంది. ఇది ప్రస్తుతం ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా ఉంది. ఇది ప్రస్తుతం ఏఎస్ఐ ఆధీనంలో ఉంది. అయినప్పటికీ ఇక్కడ కొంతమంది ముస్లింలు నమాజ్ చేశారు.
దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది. ఈ వీడియో పై బీజేపీ రాజ్యసభ ఎంపీ మేధా కులకర్ణి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కార్యకర్తలతో ఆ ప్రాంతాన్ని శుద్ది చేశారు.
శుద్దీ ఆచరణ..
శుద్దీ చేసిన వీడియోను బీజేపీ ఎంపీ ఎక్స్ లో షేర్ చేశారు. దీనిలో నమాజ్ చేయడం పట్ల ఆమె నిరసనలకు పిలుపునిచ్చారు. శనివార్ నాడా కోటలో ఆమె తన అనుచరులతో నిరసన ప్రదర్శన నిర్వహించినట్లు తన ట్వీట్ లో పేర్కొన్నారు. 1732 లో ఈ కోటను నిర్మించినట్లు తెలుస్తోంది.
‘‘ఇది ప్రతి పుణేకర్ కు ఆందోళన, కోపం తెప్పించే విషయం. పూణె కార్పొరేషన్ అసలు ఏం చేస్తోంది? మన వారసత్వ ప్రదేశాల పట్ల గౌరవం ఎక్కడ కనుమరుగవుతోంది? రండి మనమందరం ఐక్యంగా ఉండి, మన సంస్కృతిని గౌరవిద్దాం’’ అని పోస్ట్ లో పేర్కొంది.
నిరసన స్థలంలో మీడియాతో మాట్లాడుతూ.. కులకర్ణి తనకు పాత వీడియో అందిందని, వెంటనే మహారాష్ట్ర పురావస్తు శాఖను సంప్రదించానని, వారు నిరసన పాల్గొన్న వ్యక్తులను ప్రాంగణాన్ని ఖాళీ చేయమని కోరినట్లు ధృవీకరించారని చెప్పారు.
దేశంలో నమాజ్ చేసిన ప్రాంతాలను తరువాత తమ వారసత్వ కట్టడంగా క్లెయిమ్ చేస్తున్నారని, దీనిపై తాము తీవ్రంగా ప్రతిఘటిస్తున్నామని చెప్పారు. అలాంటి ఆక్రమణలు శనివార్ నాడాలో కూడా జరగకుండా అడ్డుకుంటామని అన్నారు. శనివార్ నాడా ఛత్రపతి శివాజీ మహారాజ్ స్వరాజ్య వారసత్వాన్ని సూచిస్తుందని అన్నారు.
‘‘శనివర్ వాడా ఒక చారిత్రాత్మక ప్రదేశం. ఇది మా విజయానికి చిహ్నం. మరాఠా సామ్రాజ్యం అట్టాక్ నుంచి కటక్ వరకూ విస్తరించిన కేంద్రం. ఎవరైనా ఇక్కడ నమాజ్ చేయడానికి వస్తే మేము సహించం’’ అని ఆమె పేర్కొన్నారు.
ఉద్రిక్తతలు..
శనివర్ నాడా కోట దగ్గర బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేసిన తరువాత దాని సమీపంలోని హజ్రత్ ఖ్వాజా సయ్యద్ దర్గాను తొలగించాలని కూడా పిలుపునివ్వడంతో ఉద్రిక్తతలు తీవ్రంగా మారాయి. నిరసనకారులు, పోలీస్ అధికారుల మధ్య ఘర్షణలు చెలరేగడంతో పోలీసులు వెంటనే స్పందించి, జనసమూహాన్ని చెదరగొట్టడానికి బలప్రయోగం చేశారు.
ఈ సంఘటన పై బీజేపీ మిత్రపక్షం అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) తీవ్ర విమర్శలు గుప్పించింది. మేధా కులకర్ణి మత ఉద్రిక్తతలను రెచ్చగొడుతోందని ఆరోపించింది.
కులకర్ణి పూణెలోని మతపరమైన విభజనను రెచ్చగొట్టారని ఆమెపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎన్సీపీ అధికార ప్రతినిధి రూపాలి పాటిల్ థోంబారే మీడియాతో అన్నారు.
ఉమ్మడి వారసత్వం..
శనివర్ నాడా అనేది పూణెకర్ల ఉమ్మడి వారసత్వం అని , ఏ సమాజం సొంత ఆస్తి కాదని అన్నారు. బీజేపీ వెంటనే ఆమెను అదుపులో పెట్టాలని డిమాండ్ చేశారు. బీజేపీ చేసిన శుద్ది ప్రక్రియను సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అబూ అసిమ్ అజ్మీ వంటి ప్రతిపక్ష వ్యక్తులు కూడా ఖండించారు.
‘‘భారత్ లోని ముస్లింలు కూడా దేశం కోసం ప్రాణాలు త్యాగం చేశారు. బ్రిటిష్ వారి తరఫున వాదించిన వారు ఇప్పుడూ అధికారంలో ఉన్నారు. వారు అందరిని అలాగే చూస్తారు. వారికి తగిన సమాధానం లభిస్తుంది’’ అని అన్నారు. శనివర్ నాడాలో నమాజ్ చేసిన వారిపై ఏఎస్ఐ ఫిర్యాదు చేసినప్పటికీ ఇంకా ఎలాంటి కేసు నమోదు కాలేదు.
Read More
Next Story