బీజేపీ కంచుకోటలో కాంగ్రెస్ పట్టు..
x

బీజేపీ కంచుకోటలో కాంగ్రెస్ పట్టు..

నాగ్‌పూర్ ఎమ్మెల్సీ స్థానాన్ని నిలబెట్టుకున్న అభిజిత్ వంజారి!


Click the Play button to hear this message in audio format

మహారాష్ట్రలో బీజేపీకి రాజకీయంగా బలమైన ప్రాంతమైన నాగ్‌పూర్‌లో కాంగ్రెస్ మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. మహారాష్ట్ర శాసన మండలిలో నాగ్‌పూర్ డివిజన్ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ అభ్యర్థి అభిజిత్ వంజారి నిలబెట్టుకున్నారు. బీజేపీ అభ్యర్థి సుధాకర్ కోహలేను 3,271 ఓట్ల తేడాతో ఓడించారు. దీంతో వరుసగా రెండోసారి ఈ స్థానంలో విజయం సాధించి, మరో ఆరేళ్ల పదవీకాలాన్ని దక్కించుకున్నారు.

మంగళవారం ఉదయం ప్రారంభమైన ఓట్ల లెక్కింపు 40 గంటలకు పైగా కొనసాగి గురువారం తెల్లవారుజామున ముగిసింది. తొలి ప్రాధాన్య ఓట్ల లెక్కింపులో సుధాకర్ కోహలే ముందంజలో ఉన్నారు. ఆయనకు 60,924 ఓట్లు రాగా, అభిజిత్ వంజారికి 56,630 ఓట్లు వచ్చాయి. అయితే, నిర్ణీత మెజారిటీకి అవసరమైన ఓట్లు ఏ అభ్యర్థికీ రాకపోవడంతో రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఈ ప్రక్రియలో వంజారి ఆధిక్యంలోకి వచ్చి విజయం సాధించారు. మొత్తం వంజారికి 67,231 ఓట్లు, కోహలేకు 63,960 ఓట్లు లభించాయి.
నాగ్‌పూర్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీలకు స్వస్థలం. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌ (ఆర్ఎస్ఎస్) ప్రధాన కార్యాలయం కూడా ఇక్కడే ఉంది. దీంతో ఈ ప్రాంతంలో కాంగ్రెస్ విజయం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. దాదాపు ఆరు దశాబ్దాల పాటు ఈ గ్రాడ్యుయేట్స్ స్థానంపై బీజేపీ ఆధిపత్యం కొనసాగగా, 2020లో వంజారి ఆ పార్టీ అభ్యర్థిని ఓడించి కాంగ్రెస్‌కు విజయం అందించారు.
తాజా ఫలితంతో మహారాష్ట్ర శాసన మండలి ఎన్నికల్లో కాంగ్రెస్ తన ఖాతాలో తొలి విజయాన్ని వేసుకుంది. అక్టోబర్ 23న ఎన్నికలు జరిగిన ఐదు స్థానాల్లో ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ మూడు స్థానాలను గెలుచుకోగా, అధికార మహాయుతి కూటమి రెండు స్థానాలను దక్కించుకుంది. నాగ్‌పూర్ ఫలితం నేపథ్యంలో మహారాష్ట్రలో కాంగ్రెస్, బీజేపీ మధ్య రాజకీయ విమర్శలు మరింత పెరిగే అవకాశముంది.

వంజారీ రాజకీయ మూలాలు..

వంజారీ రాజకీయ కుటుంబానికి చెందినవారు. ఆయన తండ్రి గోవిందరావు వంజారీ, మహారాష్ట్ర అసెంబ్లీలో దక్షిణ నాగపూర్ కు రెండుసార్లు ఎన్నికయ్యారు. అభిజిత్ నాగపూర్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. అందులో ఆయన న్యాయశాస్త్ర పట్టాలను పొందారు. ఆ తరువాత ఆయన విశ్వవిద్యాలయం సెనేట్, మేనేజ్ మెంట్ కౌన్సిల్ లో పనిచేశారు.
ఆయన రాజకీయాలు విద్యార్థి సంబంధాలలో మొదలైంది. 1998 నుంచి 2002 మధ్య ఆయన కాంగ్రెస్ యువజన విభాగమైన ఎన్ఎస్యూఐకి కార్యదర్శిగా పనిచేశారు. తరువాత యూత్ కాంగ్రెస్ కార్యదర్శి అయ్యారు.
తరువాత నాగ్ పూర్ జిల్లా కాంగ్రెస్ కమిటీలో పదవులు నిర్వహించారు. ఆయన పార్టీ పనుల నిమిత్తం యూపీ, బీహార్ లకు వెళ్లారు. విదర్భ వ్యాప్తంగా కళాశాలలను నడుపుతున్న అమర్ సేవా మండల్ కు కార్యదర్శిగా ఉన్నారు. ‘‘ ఈ విజయం ఆయా సంస్థల కార్యకర్తలు, నాయకులకు దక్కుతుంది. ఈ ఫలితం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఇది మేము కొన్నాళ్లుగా చేస్తున్న కృషికి నిదర్శనం. ఇది ఇకపై బీజేపీ కంచుకోట కాదు. ఇది కాంగ్రెస్ కంచుకోటగా మారింది’’ అని ఆయన అన్నారు.
మహారాష్ట్ర, కర్ణాటక,బీహార్, యూపీ లో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలలో వంజారి మాత్రమే విజయం సాధించారు. కర్ణాటక లోని నాలుగు శాసన మండలి స్థానాలలో ఆ పార్టీ ఘోర పరాజయం పాలైంది.
Read More
Next Story