
రాజస్థాన్‌లో రైల్వే ట్రాక్‌పై పేలుడు..
రంగంలోకి జాతీయ దర్యాప్తు సంస్థ, నాలుగు రైళ్లు రద్దు
రాజస్థాన్‌లో రైల్వే ట్రాక్‌ను పేల్చివేసిన ఘటన కలకలం రేపుతోంది. శ్రీ గంగానగర్ జిల్లాలో పట్టాల కింద పేలుడు సంభవించి రెండు కాంక్రీట్ బ్లాక్‌లు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై దర్యాప్తు కోసం జాతీయ దర్యాప్తు సంస్థ (NIA), యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS) రంగంలోకి దిగాయి. మరోవైపు ముందు జాగ్రత్త చర్యగా ఆ మార్గంలో నడిచే నాలుగు రైళ్లను రైల్వే అధికారులు రద్దు చేశారు.
మంగళవారం రాత్రి సుమారు 9.45 గంటల సమయంలో 50 జీబీ గ్రామం సమీపంలో ఈ పేలుడు జరిగింది. ఘటన జరగడానికి సుమారు 45 నిమిషాల ముందే ఓ ప్యాసింజర్ రైలు ఆ మార్గంలో వెళ్లింది. అయితే ఆ రైలు వెళ్లిన తర్వాత పేలుడు సంభవించడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది.
పేలుడు ధాటికి రైల్వే ట్రాక్‌కు కింద ఉన్న రెండు కాంక్రీట్ బ్లాక్‌లు దెబ్బతిన్నాయి. అక్కడ సుమారు రెండు అడుగుల లోతులో గొయ్యి ఏర్పడింది. పేలుడు శబ్దం విన్న సమీప గ్రామస్తులు ఘటనాస్థలికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు, ఇతర అధికారులు అక్కడికి చేరుకున్నారు.
ప్రస్తుతం ఫోరెన్సిక్ నిపుణులు ఘటనాస్థలిలో ఆధారాలు సేకరిస్తున్నారు. పేలుడుకు ఉపయోగించిన పదార్థాలు ఏమిటి? దీని వెనుక ఉద్దేశం ఏమిటి? ఇంకా ఎవరైనా ఈ ఘటనలో భాగస్వాములుగా ఉన్నారా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పేలుడు తీవ్రతను అంచనా వేయడంతో పాటు రైల్వే ట్రాక్‌ను ధ్వంసం చేసినవారిని గుర్తించే ప్రయత్నం జరుగుతోందని జిల్లా ఎస్పీ హరిశంకర్ యాదవ్ తెలిపారు.
మరోవైపు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఐజీ జ్యోతి కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం.. NIA బృందం ఇప్పటికే ఘటనాస్థలికి చేరుకుంది. స్థానిక పోలీసులతో పాటు NIA, ATS బృందాలు కూడా దర్యాప్తులో పాల్గొంటున్నాయి.
ఈ ఘటన నేపథ్యంలో సూరత్‌గఢ్–అనూప్‌గఢ్ రైల్వే మార్గంలో బుధవారం నడవాల్సిన నాలుగు రైళ్లను నార్త్ వెస్ట్రన్ రైల్వే రద్దు చేసింది. పేలుడుకు కారణాలు, దీని వెనుక ఉన్న వ్యక్తులు ఎవరనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. దర్యాప్తులో వెల్లడయ్యే వివరాలను బట్టి ఈ ఘటన వెనుక అసలు కారణాలు స్పష్టమయ్యే అవకాశం ఉంది.
Next Story
