ఆపరేషన్ సిందూర్ వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పను
x
పృథ్వీరాజ్ చవాన్

ఆపరేషన్ సిందూర్ వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పను

పృథ్వీరాజ్ చవాన్, కాంగ్రెస్ కు దేశాన్ని అవమానించడం అలవాటే అన్న బీజేపీ


కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఈ మధ్య మీడియాతో మాట్లాడుతూ.. ‘ఆపరేషన్ సిందూర్’ పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పేదిలేదని అన్నారు.

చవాన్ మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ మొదటి రోజే భారత్ ఓడిపోయిందని అన్నారు. దీనిపై ఈ రోజు మాట్లాడుతూ.. తాను ఏ తప్పు చేయలేదని, క్షమాపణ చెప్పడానికి ఏమీ లేదని అన్నారు.

‘‘నేను ఇప్పుడు ఇంకేమీ చెప్పదలుచుకోలేదు. కానీ నేను క్షమాపణ చెప్పను. అవసరం లేదు. నేను ఎలాంటి తప్పుడు వ్యాఖ్య చేయలేదు’’ అని చవాన్ అన్నారు. ఆపరేషన్ సిందూర్ మొదటి రోజునే భారత్ ఓడిపోయిందని, గత నాలుగు రోజుల పాటు జరిగిన ఘర్షణలో భారత విమానాలు కూలిపోయాయని చవాన్ పూనేలో విలేకరుల సమావేశంలో వివాదాస్పద ప్రకటన చేసిన ఒకరోజు తరువాత ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయని ఏఎన్ఐ వార్తా కథనం ప్రసారం చేసింది.
ఐఏఎఫ్ స్తంభించిపోయింది
పాకిస్తాన్ వైమానిక దళం, భారత వైమానిక దళానికి చెందిన ఫైటర్ జెట్లను కూల్చివేసే అవకాశం ఉందని అందుకే భారత్ ఓడిపోయిందని చవాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
‘‘ఆపరేషన్ సిందూర్ మొదటి రోజు మనం పూర్తిగా ఓడిపోయాము. 7వ తేదీన జరిగిన అరగంట వైమానిక దాడిలో ప్రజలు అంగీకరించినా, అంగీకరించకపోయినా మేము పూర్తిగా ఓడిపోయాము’’ అని చవాన్ అన్నారు.
‘‘భారతీయ విమానాలు కూలిపోయాయి. వైమానిక దళం పూర్తిగా నేలమట్టం అయింది. ఒక్క విమానం కూడా ఎగరలేదు. గ్వాలియర్, బటిండా, సిర్సా నుంచి ఏ విమానం బయల్దేరినా కూలిపోయే అవకాశం ఉంది. అందుకే వైమానిక దళం నిర్వీర్యమైంది’’ అని చవాన్ అన్నారు.
పెద్ద సైన్యం ఎందుకు?
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కూడా అయిన చవాన్.. భారత్ పెద్ద సైన్యాన్ని ఎందుకు నిర్వహించాలని ప్రశ్నిచారు. భవిష్యత్ లో యుద్దాలు గాలిలో జరుగుతాయని అన్నారు.
‘‘ఇటీవల ఆపరేషన్ సిందూర్ సమయంలో సైన్యం ఒక్క కిలోమీటర్ కూడా కదలలేదు. రెండు లేదా మూడు రోజులలో ఏమి జరిగిందో అది కేవలం వైమానిక యుద్ధం, క్షిపణి యుద్ధం మాత్రమే’’ అని ఆయన అన్నారు.
భవిష్యత్ లో కూడా యుద్దాలు కూడా ఇలాగే జరుగుతాయి. అటువంటి పరిస్థితిలో మనకు 12 లక్షల మంది సైనికులు ఎందుకు? వారిని వేరే పని చేయించగలమా?’’ అని చవాన్ అన్నారు.
బీజేపీ విమర్శలు..
కాంగ్రెస్ నాయకుడి వ్యాఖ్యలు, క్షమాపణ చెప్పడానికి నిరాకరించడంపై అధికార బీజేపీ విమర్శల వర్షం కురిపించింది. జౌళి మంత్రి గిరిరాజ్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘మన సైన్యం పరాక్రమాన్ని దుర్వినియోగం చేసే హక్కు ఎవరికీ లేదు’’ అన్నారు.
‘‘ఈ ప్రకటనను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. కాంగ్రెస్ ఎప్పుడూ పాకిస్తాన్ కు అనుకూలంగానే ఉంది. దేశాన్ని అవమానిస్తూనే ఉంది. వారి నాయకుడు రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లినప్పుడల్లా భారత్ ను అవమానిస్తూనే ఉన్నారు. ఇది దేశం మొత్తం చూస్తోంది. ప్రజలు కాంగ్రెస్ కు గుణపాఠం చెబుతారు’’ అని బీజేపీ రాజ్యసభ ఎంపీ బ్రిజ్ లాల్ అన్నారు.
నేపథ్యం..
అంతకుముందు ఎయిర్ చీఫ్ మార్షల్ ఎపీ సింగ్ మాట్లాడుతూ.. ఒక రాఫెల్ ఫైటర్ జెట్ తో పాటు అనేక విమానాలను పాకిస్తాన్ కూల్చివేసిందనే వాదనలను పాకిస్తాన్ పౌరులను మోసం చేయడానికి చేసిన ప్రచారంగా తోసిపుచ్చారు. అక్టోబర్ లో సింగ్ మాట్లాడుతూ.. యూఎస్ తయారు చేసిన ఎఫ్-16, చైనీస్ జే-17 లతో సహ పాక్ కు చెందిన కనీసం నాలుగు ఫైటర్ జెట్ల ను కోల్పోయిందని పేర్కొన్నారు.
ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత యుద్ధ విమానాలను కూల్చివేసినట్లు డిఫెన్స్ అటాచ్ చేసిన వ్యాఖ్యల తరువాత వాదనలు వెలువడ్డాయి. ఇది విస్తృత చర్చకు దారితీసింది.
అయితే సదరు అధికారి చేసిన ప్రజంటేషన్ ను భారత్ తిరస్కరించింది. ఇది ప్రజంటేషన్ ఉద్దేశం, ధోరణులను తప్పుగా సూచిస్తున్నాయని పేర్కొంది. 26 మంది ప్రాణాలను బలిగొన్న పహల్గామ్ ఉగ్రవాద దాడి తరువాత మే 7 న ఆపరేషన్ సిందూర్ ప్రారంభించారు.


Read More
Next Story