‘పవర్’ కోసం పవార్ వర్సెస్ పవార్
x

‘పవర్’ కోసం పవార్ వర్సెస్ పవార్

ఎన్నికల్లో తామే అసలైన వారసులమని చెప్పుకోవడానికి రెండుగా చీలిన పవార్ వర్గాలు బారామతి కేంద్రంగా పోటికీ ‘సై’ అంటున్నాయి.. అయితే బారామతిలో భావోద్వేగం పండుతుందా?


కొన్ని నియోజకవర్గాల పేరు చెప్పగానే కొంతమంది రాజకీయ ఉద్దండుల పేర్లు గుర్తుకు వస్తాయి. పులివెందులకి వైఎస్ ఫ్యామిలి, కుప్పంకి నారా చంద్రబాబు నాయుడు, సిద్దిపేట అనగానే గులాబీ జెండా, అలాగే దేశంలోని రాయ్ బరేలీకి గాంధీ కుటుంబం, అలాగే మహరాష్ట్రలోని బారామతి అనగానే పవార్ ఫ్యామిలి.. ఇవన్నీ వారి స్థానబలిమికి ఒక ఉదాహరణ.

ఇప్పుడు బారామతిలో ఉన్న ఎన్సీపీ కంచుకోటకు రెండుగా చీలిన పవార్ వర్గాల్లో ఎవరికి దక్కుతుందో అన్న వార్త ప్రచారంలో బాగా నలుగుతోంది. బారామతి ఓచారిత్రక నగరం. శరద్ పవార్ ఆరు సార్లు ఇక్కడి నుంచే ఎమ్మెల్యేగా గెలిచాడు. ఇదే లోక్ సభ స్థానం నుంచి ఐదు సార్లు ఎంపీగా గెలుపొందాడు.

ఈయన కూతురు సుప్రియా సూలే కూడా వరుసగా మూడు సార్లు ఎంపీగా గెలుపొందుతూ వస్తోంది. 2009 నుంచి క్రియాశీల రాజకీయాల్లో ఉన్న సుప్రియా... నాలుగో సారి గెలుపొంది తన పట్టు పదిలంగా ఉందని నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. అయితే ఎన్సీపీని దక్కించుకున్న అజిత్ పవార్ వర్గం కూడా ఈ సారి బారామతి ఎంపీ స్థానంపైనే గురిపెట్టింది.

అజిత్ పవార్ అప్పీల్

పవార్లకు కంచుకోటగా మారి, పోటీ చేస్తే గెలుపు మాత్రమే వరించిన ఈ సురక్షిత స్థానం పై ఇటూ శరద్ పవార్ వర్గం, అటూ అజిత్ పవార్ వర్గం గురిపెట్టాయి. గెలిస్తే తమ చీలిక వర్గామే జనామోదం పొందిందని భావించడమే ఇందుకు కారణం. ఇదే నియోజకవర్గం నుంచి అజిత్ పవార్ వరుసగా గెలుపొందుతూ వస్తున్నారు. మొదట 1991 లో బారామతి లోక్ సభ స్థానం నుంచి గెలుపొందారు. ఆ తరువాత ఎమ్మెల్యేగా ఏడు సార్లు ఇక్కడి నుంచి పోటీకి దిగి తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. ఇక ఈ లోక్ సభ స్థానం నుంచే ఈ ఎన్నికల్లో తన భార్యను పోటీకి దింపాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఉన్న అజిత్ పవార్ శుక్రవారం నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. " బారామతి ఓటర్లకు విజ్ఞప్తి, మొదటి సారి మనం కఠిన పరీక్షను చూడబోతున్నాం. దానికోసం సమయం ఆసన్నమైంది. " అన్నారు. ఇందులో ఎవరి పేరు చెప్పనప్పటికీ తన భార్య సునేత్రా పవార్ ను ఎంపీ ఎన్నికల బరిలో దింపుతున్నట్లు సూచించినట్లు స్పష్టమైంది.

ప్రచారం ప్రారంభించిన సునేత్రా

ఇప్పటికే సునేత్రా తన ప్రచారాన్ని ప్రారంభించారు. సునేత్రా పుట్టినింటి వారు మొదటి నుంచి రాజకీయాలు చేయడంలో ఆరితేరింది. సునేత్రా అన్న, పదంసింగ్ పాటిల్ సామాజిక కార్యకర్తగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసి ప్రజా జీవితంలో విశేష అనుభవం గడించారు. ఆయన కూడా బారామతి ఓటర్లకు తన సందేశాన్ని వినిపించారు. " కొంతమంది మీ దగ్గరకు వచ్చి భావోద్వేగ సమస్యతో ఓట్లు అడుగుతారు. వారి సమస్యను మీపై రుద్దుతారు. అయితే ఓటు వేసేముందు ఒకసారి ఆలోచించండి. అభివృద్ధి, భవిష్యత్ తరాల సంక్షేమం కావాలనుకుంటే ఎవరికి ఓటు వేయాలో మీకు తెలుసు" అని ఓటర్లను వేడుకున్నారు.

సుప్రియా సూలే స్పందన

ఈ విషయం పై ఎంపీ సుప్రియా సూలే స్పందిస్తూ " ఇది ప్రజాస్వామ్యం. ఇక్కడ అందరూ ఎన్నికల్లో పోటీ చేయవచ్చు" అవన్నీ ఎప్పుడు జరుగుతూనే ఉంటాయని పేర్కొన్నారు.

గత సంవత్సరం జూలైలో అజిత్ పవార్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలతో ఏక్ నాథ్ శిందే వర్గంలోని ప్రభుత్వంతో కలిసిపోయారు. దీనిపై ఎన్నికల సంఘం కూడా అజిత్ పవారే నిజమైన నాయకుడు అని, దాని పార్టీ సింబల్ అయిన గడియారం గుర్తును కూడా వారికే కేటాయించింది. దీనిపై సుప్రీంకోర్టులో కూడా కేసు దాఖలు అయింది. లోక్ సభ ఎన్నికల లోపు దీనిని పరిష్కరించాలని ఇరు వర్గాలు ఉన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించాయి.

Read More
Next Story