కేజ్రీవాల్ పిల్లలూ.. తండ్రిని మించిన వారే!
తండ్రిని మించిన తనయులంటే వీళ్లే. కేజ్రీవాల్ అరెస్ట్ తో ఇప్పుడందరి చూపు వాళ్ల పిల్లలవైపు మళ్లింది. వాళ్ల గురించి నాలుగు మాటల్లో..
అరవింద్ కేజ్రీవాల్.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మార్మోగుతున్న పేరు. ఇప్పటివరకు నేషనల్ ఫిగర్ గా ఉన్న ఈ ఐఐటీ గ్రాడ్యుయేట్ కమ్ ఢిల్లీ ముఖ్యమంత్రి ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫిగర్ గా మారారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిందితునిగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసింది. ఈ అరెస్ట్ పై దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయంగా అగ్ర దేశాలు కూడా స్పందిస్తున్నాయి. అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ ను తప్పుబడుతున్నాయి. అందరినోళ్లలో నానుతున్న ఈ కేజ్రీవాల్ గురించి ఆయన కుటుంబం గురించి ప్రస్తుతం గూగుల్ సెర్చ్ లో మోతమోగుతోంది.
కేజ్రీవాల్ కి పిల్లలెంతమందంటే...
అరవింద్ కేజ్రీవాల్ దేశంలో అత్యంత ఎక్కువ చదువు చదివిన రాజకీయ నాయకుడు. ఖరగ్ పూర్ ఐఐటీలో మెకానికల్ ఇంజినీరింగ్ చదవివారు. ఐఐటీ గ్రాడ్యుయేట్. ఆయన భార్య సునీత కూడా విద్యావంతురాలే. ఇండియన్ రెవెన్సూ సర్వీసు అధికారే. 1994లో వీళ్లకి పెళ్లయింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. ఓ కొడుకు కూతురు. వీళ్లు కూడా తండ్రిని మించిన తనయులే. ఇద్దరూ బాగా చదువుకున్న వారే. ఐఐటీ గ్రాడ్యుయేట్లే. అరవింద్ కేజ్రీవాల్ సంతానంలో చిన్నవాడైన పులకిత్ కేజ్రీవాల్ ఐఐటీ గ్రాడ్యుయేట్. గతంలో ఓసారి అరవింద్ కేజ్రీవాలే ఈ విషయాన్ని చెప్పారు. ఓ టైలర్ కుమారుడు చదువుకుంటున్న ఐఐటీలోనే తన కుమారుడు కూడా చదువుకుంటున్నాడని ఢిల్లీ సీఎం హోదాలో ఉన్న కేజ్రీవాల్ చెప్పినపుడు అసలు విషయం తెలిసింది. పులకిత్ కేజ్రీవాల్ ఢిల్లీలోనే సీబీఎస్ఇ సిలబస్ తో 12 తరగతి చదివారు. 96.4 శాతం మార్కులతో ఏ ప్లస్ ర్యాంకు సాధించారు. ఐఐటీ పరీక్షలు రాసి ర్యాంకు సంపాయించి సీటు కొట్టారు.
తండ్రిని మించిన తనయ హర్షిత..
కేజ్రీవాల్ కుమార్తె హర్షిత తన అన్న మాదిరే ఐఐటీ గ్రాడ్యుయేట్. అవినీతి వ్యతిరేక పోరాటంలో భాగంగా 2014లో అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయి ఇప్పుడున్న తీహార్ జైలులోనే ఉన్నప్పుడు హర్షిత ఐఐటీలో చేరారు. తండ్రి జైల్లో ఉన్నా, కుటుంబ స్థితిగతులు సరిగా లేక ఇంటా బయట తీవ్ర మానసిక వత్తిడి ఎదుర్కొంటున్న దశలోనూ ఆమె జేఇఇ మెయిన్స్ లో 3,322 వ జాతీయ స్థాయి ర్యాంకు సాధించడం గొప్ప విశేషం. ఢిల్లీ ఐఐటీలోనే బయో టెక్నాలజీ చేశారు. ఇప్పుడామె వైద్య, ఆరోగ్య రంగంలో పని చేస్తున్న ఓ స్వచ్ఛంద సంస్థకు పనిచేస్తున్నారు.
కేజ్రీవాల్ ర్యాంక్ 563..
1985లో అరవింద్ కేజ్రీవాల్ 563వ ర్యాంకు సంపాయించి ఆవేళ ఐఐటీ ఖరగ్ పూర్ లో చేరి చదువులో టాపర్ గా నిలిచారు. 8.42 సీజీపీఏతో 1989లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత టాటా స్టీల్ లో కొంతకాలం పని చేశారు. ఆ పని చేస్తూనే కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాసి ఇండియన్ రెవెన్యూ సర్వీసులో చేరారు. కొంత కాలం పని చేసి ఆ పదవిని వదిలేసి అన్నాహజారేతో కలిసి అవినీతి వ్యతిరేక ఉద్యమం నడిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ- ఆప్-ను ఏర్పాటు చేసి కేవలం 8 నెలల కాలంలో ఢిల్లీ పీఠంపై సామాన్యుడి జెండా ఎగురవేశారు.
కేజ్రీవాల్ కి సరిజోడి సునీత...
ఇక కేజ్రీవాల్ భార్య సునీత. తన భర్త ముఖ్యమంత్రి అయినా ఆమె ఇప్పటి వరకు పబ్లిక్ కి కనిపించింది రెండు మూడుసార్లకు మించి లేదు. ఈడీ తన భర్తను అరెస్ట్ చేయడంతో రెండు రోజుల కిందట ఆమె ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. తన భర్త ఏమి చేసినా ప్రజల కోసమే, దేశం కోసమే అని పూర్తి విశ్వాసంతో చెప్పే సునీత ఢిల్లీ లిక్కర్ స్కాం అనేది పెద్ద బోగస్ అంటారు. 1994లో ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్) అధికారిగా ఆదాయపన్ను శాఖలో 22 ఏళ్లు పని చేశారు. తన తరువాత సంవత్సరపు బ్యాచ్ కి చెందిన అరవింద్ కేజ్రీవాల్ ను తొలిసారి భోపాల్ లో ఓ శిక్షణలో కలుసుకున్నారు. 2016లో సునీత స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసి ఇంటి వద్దే ఉంటూ పిల్లల సంరక్షణతో పాటు భర్తకు చేదోడు వాదోడుగా ఉంటున్నారు. రికార్డుల ప్రకారం ఆమె జంతుశాస్త్రంలో మాస్టర్స్ చేశారు. అరవింద్ కేజ్రీవాల్ తో కలిసి అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పాటు తర్వాత పార్టీ తరఫున ఎన్నికల ప్రచారాన్ని కూడా నిర్వహించారు. 2014 లోక్ సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీపై తన భర్త కేజ్రీవాల్ పోటీ చేసినపుడు సునీత దీర్ఘకాలిక సెలవుపెట్టి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.