టీఎంసీ ఎంపీ రాజీనామాకు కారణమేంటి?
తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) రాజ్యసభ ఎంపీ జవహర్ సిర్కార్ తన పార్లమెంటరీ పదవికి రాజీనామా చేశారు. రాజకీయాల నుంచి కూడా పూర్తిగా వైదొలిగారు.
తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) రాజ్యసభ ఎంపీ జవహర్ సిర్కార్ తన పార్లమెంటరీ పదవికి రాజీనామా చేశారు. రాజకీయాల నుంచి కూడా పూర్తిగా వైదొలిగారు. గత నెలలో కోల్‌కతా ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం చేసి హత్య ఘటనకు నిరసనగా ఆయన రాజీనామా చేశారు.
ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత మమతా బెనర్జీని ఉద్దేశించి ఐఏఎస్ మాజీ అధికారి సిర్కార్ లేఖలో ఇలా రాశారు..‘అవినీతి అధికారులు (లేదా వైద్యులు) ఉన్నత పదవులు పొందడం నాకు నచ్చదు. తమ పార్టీకి చెందిన ఒక వర్గం నాయకులు అవినీతికి పాల్పడుతున్నా.. వారిపై చర్యలు తీసుకోవడం లేదు’’ ఇవే నా రాజీనామా నిర్ణయానికి కారణాలు అని పేర్కొన్నారు.
“ఆర్‌జీ కర్ హాస్పిటల్‌లో జరిగిన ఘటనపై నేను చాలా బాధపడ్డాను. ఆందోళనకు దిగిన జూనియర్ డాక్టర్లతో మీరు (మమతా బెనర్జీ) ప్రత్యక్షంగా మాట్లాడతారని ఆశించాను. కాని అది జరగలేదు. అవినీతికి పాల్పడ్డ డాక్టర్లపై చర్యలు తీసుకుని ఉంటే, పరిస్థితులు సాధారణ స్థాయికి వచ్చి ఉండేవి. ’’ అని లేఖలో పేర్కొన్నారు సిర్కార్. "నా ఇన్నేళ్లలో ప్రభుత్వంపై ఆగ్రహం ఈ స్థాయిలో ఎన్నడూ చూడలేదు. ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయింది’’ అని అభిప్రాయపడ్డారు.
గత నెల ఆగస్టు 9న కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ జూనియర్ డాక్టర్‌పై జరిగిన దారుణమైన అత్యాచారం, హత్యకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఎంపీ రాజీనామా చేశారు.
అయితే మూడేళ్లుగా బెంగాల్ సమస్యలను పార్లమెంటులో లేవనెత్తడానికి తనకు అవకాశం ఇచ్చినందుకు సర్కార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.ఇక ఎంపీగా కొనసాగాలనే కోరిక తనకు లేదన్నారు.