ఢిల్లీలోని ఐఏఎస్ కోచింగ్ సెంటర్ వరద నీటి మృతులకు కారకులెవరు?
ఢిల్లీలోని ఐఏఎస్ కోచింగ్ సెంటర్ సెల్లార్‌లోకి వరద నీరు చేరి ముగ్గురు ఐఏఎస్ విద్యార్థులు చనిపోయిన ఘటనపై మంత్రులు, ప్రధాన కార్యదర్శి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.
ఢిల్లీలోని ఐఏఎస్ కోచింగ్ సెంటర్ సెల్లార్‌లోకి వరద నీరు చేరి ముగ్గురు ఐఏఎస్ విద్యార్థులు చనిపోయిన ఘటనపై మంత్రులు, ప్రధాన కార్యదర్శి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. తన ఆదేశాలను చీఫ్ సెక్రటరీ పట్టించుకోవడం లేదని మంత్రి అతిషి ఆరోపిస్తున్నారు. మరో మంత్రి సౌరభ్ కూడా ప్రధాన కార్యదర్శి తీరును తప్పుబడుతున్నారు.
ఢిల్లీ పాత రాజిందర్ నగర్‌లోని కోచింగ్ సెంటర్‌లోకి వరద నీరు చేరి ముగ్గురు విద్యార్థులు చనిపోయిన ఘటనపై విచారణ చేపట్టేందుకు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక కమిటీని ఏర్పాటు చేసింది.
కాగా ఘటనపై ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నరేష్ కుమార్ స్పందిస్తున్న తీరుపై ఢిల్లీ రెవెన్యూ మంత్రి అతిషి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై న్యాయ విచారణకు నోట్ తయారు చేయాలని ఆదేశించాలనా నరేష్ కుమార్ స్పందించలేదని ఆరోపించారు.
కాగా ఈ ఘటనపై రహదారి ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD)కి చెందినది కాబట్టి వారి నివేదిక కోరినట్లు కుమార్ నివేదికలో తెలిపారు.
మురుగు కాలువలను శుభ్రం చేయించడంలో విఫలమైనందుకు అసిస్టెంట్ ఇంజనీర్‌ను తక్షణమే సస్పెండ్ చేసినట్లు, జూనియర్ ఇంజనీర్ ను తొలగించినట్లు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD) తన నివేదికలో పేర్కొంది.
శనివారం సాయంత్రం ఢిల్లీలో భారీవర్షం కారణంగా రావు IAS స్టడీ సర్కిల్ కోచింగ్ ఇనిస్టిట్యూట్ సెల్లార్‌లోకి వరద నీరు చేరడంతో ముగ్గురు IAS ఆశావహులు - ఉత్తరప్రదేశ్‌కు చెందిన శ్రేయా యాదవ్, తెలంగాణకు చెందిన తాన్యా సోని, కేరళకు చెందిన నెవిన్ డాల్విన్ మృత్యువాతపడ్డారు.
“ముగ్గురి మరణంపై మెజిస్ట్రియల్ విచారణకు ఆదేశాలు జారీ చేయాలని నేను శనివారం (జూలై 27) రాత్రి 11.20 గంటలకు ఆదేశాలు ఇచ్చాను. దాదాపు 40 గంటలు గడిచినా.. చీఫ్ సెక్రటరీ నుంచి నాకు ఏ సమాచారం అందలేదు. ఢిల్లీ ప్రభుత్వ అధికారులు ఈ దుర్ఘటనపై విచారించడంలో సీరియస్‌గా లేరు.’’ అని మంత్రి అతిషి ఆరోపించారు.
“ప్రధాన నిందితుడు IAS కోచింగ్‌ను నడుపుతున్నాడు కాబట్టి ఆయనను కాపాడానికి ఐఎఎస్ అయిన చీఫ్ సెక్రటరీ సహకరిస్తున్నాడని ఆరోపించారు.
చీఫ్ సెక్రటరీ తీరు సరిగా లేదు.. పట్టణాభివృద్ధి శాఖ మంత్రి సౌరభ్
మురుగు కాలువల డీసిల్టింగ్ ప్రక్రియకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఫిబ్రవరి నుంచి చాలాసార్లు లేఖలు రాసినా చీఫ్ సెక్రటరీ నరేష్ కుమార్ స్పందించలేదని ఢిల్లీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు. డ్రెయిన్ డీసిల్టింగ్ పనులు సజావుగా జరగడం లేదని, అధికారుల “నిర్లక్ష్యం” కారణంగా ముగ్గురు సివిల్ సర్వీస్ ఆశావహుల చనిపోయారని భరద్వాజ్ విలేఖరుల సమావేశంలో అన్నారు.
‘‘వర్షాకాలంలో మురుగు, వరద నీరు నిలిచిపోకుండా ఉండేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఫిబ్రవరి 13న సమావేశం ఏర్పాటు చేశా. ఈ సమావేశానికి ఒక్క ఐఏఎస్ అధికారి కూడా హాజరు కాలేదు. ఆయా విభాగాల నుంచి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు మాత్రమే హాజరయ్యారు. శాఖల అధిపతులు రాకపోవడంతో అసహనం వ్యక్తం చేశా. ఈ విషయాన్ని మినిట్స్ బుక్‌లో కూడా రాయిచ్చా. సమావేశానికి హాజరుకాని శాఖాధిపతులపై చర్యలు తీసుకోవాలని ఫిబ్రవరి 23న నోట్ కూడా రాశాను. కాని వారిపై ఏ చర్యలు తీసుకోలేదు’’ అని భరద్వాజ్ పేర్కొన్నారు.
“మే 20న మరోసారి డీసిల్టింగ్ ప్రక్రియ ప్రాధాన్యతపై చీఫ్ సెక్రటరీకి మళ్లీ లేఖ రాశాను. నీటిపారుదల, వరద నియంత్రణ, MCD, NDMC యాక్షన్ ప్లాన్ పంపాలని కోరాను. పక్షం రోజుల తర్వాత నేను మళ్లీ చీఫ్ సెక్రటరీకి లేఖ రాశాను. కానీ సమాధానం లేదు” అని ఆరోపించారు.
‘‘జూన్ 6న నాకు ప్రధాన కార్యదర్శికి లేఖ వచ్చింది. రాజధానిలో వరద పరిస్థితిని హైకోర్టు పర్యవేక్షిస్తోంది’’ అని చీఫ్ సెక్రటరీ లేఖలో పేర్కొన్నారు. కాలువల్లో పూడిక తొలగించడంపై కూడా చీఫ్ సెక్రటరీ హైకోర్టును కూడా తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. డ్రైన్ల క్లీనింగ్‌కు సంబంధించి హైకోర్టులో తప్పుడు నివేదిక సమర్పించినందుకు సంబంధిత అధికారులపై కోర్టు ధిక్కరణ కేసు పెట్టాలని భరద్వాజ్ డిమాండ్ చేశారు. దీనిపై జూన్ 14న కేంద్ర హోంమంత్రి కార్యాలయానికి లేఖ కూడా రాసినట్లు మంత్రి తెలిపారు. అధికారుల వెంట పడడంతో జూన్ 20న శుభ్రం చేసిన కాలువల జాబితాను తనకు అందిందని భరద్వాజ్ తెలిపారు. ముగ్గురు అభ్యర్థులు చనిపోయినా కేంద్ర ప్రభుత్వం కానీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ చర్యలు తీసుకోవడం లేదన్నారు.
భద్రతా ప్రమాణాలు పాటించని భవనాలపై చర్యలు..
చట్టవిరుద్ధంగా నడుస్తున్న బేస్‌మెంట్‌ల సీలింగ్, మురికినీటి కాలువలపై చేసిన ఆక్రమణలను కూల్చివేయడం ప్రారంభించిందని ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్వనీ కుమార్ తెలిపారు. ఆయన విలేఖరులతో మాట్లాడుతూ.. దేశరాజధాని అంతటా భద్రతా ప్రమాణాలు ఏమి పాటించకుండానే కోచింగ్ సెంటర్లను నిర్వహిస్తున్నారని, వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వరద నీరు వెళ్లేందుకు ఎందుకు చర్యలు తీసుకోలేదో వివరణ కోరుతూ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌కు షోకాజ్ నోటీసు కూడా జారీ చేసినట్లు ఆయన తెలిపారు. పరిస్థితిని అప్‌డేట్ చేయడానికి మేయర్ షెల్లీ ఒబెరాయ్ పిలిచిన అధికారుల అత్యవసర సమావేశానికి హాజరు కావడానికి ముందు కుమార్ ప్రకటన ఇచ్చారు. కోచింగ్ సెంటర్ల కోసం నగరంలో ప్రత్యేక స్థలాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.
రూ.10 లక్షల పరిహారం..
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సోమవారం ఓల్డ్ రాజిందర్ నగర్‌లోని కోచింగ్ సెంటర్ బేస్‌మెంట్‌లో వరదల కారణంగా మరణించిన ముగ్గురి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. అధిక అద్దెలు వసూలు చేశారనే నిరసనకారుల ఫిర్యాదుపై, వీలైనంత త్వరగా అద్దెను హేతుబద్ధీకరించడానికి మరియు నిర్ణయించడానికి ఒక నియంత్రణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తామని LG హామీ ఇచ్చింది.