
హరియాణా అసెంబ్లీ సీఎల్‌పీ ఎవరు?
పార్టీ అంతర్గత విభేదాలే ఆలస్యానికి కారణమా? మాజీ సీఎం భూపిందర్ సింగ్ హుడా డిమాండేమిటి? ఆయన వ్యతిరేక వర్గం ఏమంటోంది?
గతేడాది అక్టోబర్‌లో జరిగిన హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress) మరోసారి ఓటమిపాలైంది. 2014 నుంచి పార్టీ ఓడిపోవడం ఇది మూడోసారి. ఫలితాలు వెలువడి 5 నెలలు గడిచినా.. CLP నాయకుడిని అధిష్టానం ఇంకా ప్రకటించలేదు.
బీజేపీకి ఫ్లస్ అయ్యిందా?
మార్చి 7న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలైనపుడు.. ప్రతిపక్ష నాయకుడు లేకపోవడం సీఎం నయాబ్ సింగ్ సైనీ నేతృత్వంలోని బీజేపీ(BJP) ప్రభుత్వానికి ప్లస్ అయ్యింది. గత అక్టోబర్‌లో బీజేపీ ఓటమి ఖాయమన్న రాజకీయ విశ్లేషకులు అంచనాలు తలకిందులయ్యాయి. అనూహ్యంగా బీజేపీ 48 సీట్లు గెలుచుకోగా..కాంగ్రెస్‌ను 37 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
ఐదు నెలలయినా..
CLP ఎంపిక గురించి ఎన్నికల అనంతరం సీనియర్ నాయకులు అశోక్ గెహ్లాట్, ప్రతాప్ సింగ్ బాజ్వా, అజయ్ మాకెన్, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు నుంచి అభిప్రాయాలు తీసుకుని అధిష్ఠానానికి నివేదిక సమర్పించినా.. అక్కడి నుంచి ఎలాంటి స్పందన లేదు. బడ్జెట్ సమావేశానికి ముందు కొంతమంది పార్టీ నేతలు అధిష్ఠానాన్ని ఒత్తిడి కూడా చేశారు. మార్చి 5న కొత్తగా నియమితులైన పార్టీ ఇన్‌చార్జి బీకే హరీప్రసాద్‌తోనూ సీనియర్ నేతలు భేటీ అయ్యారు. ప్రతిపక్ష నేతను ప్రకటించకపోవడంతో పార్టీ బలహీనపడే అవకాశం ఉందని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. మరుసటి రోజు, హరియాణా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు ఉదయ్ భాన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలోనూ ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. CLP నాయకుడిని బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందే ప్రకటిస్తామని హరీప్రసాద్ హామీ ఇచ్చినా.. ఇంకా ఎవరి పేరు బయటకు రాలేదు.
వర్గ పోరే అసలు సమస్య..
వర్గ పోరు పార్టీ అధిష్ఠానం ముందున్న అసలు సమస్య. మాజీ సీఎం భూపిందర్ సింగ్ హుడా (Bhupinder Singh Hooda) వర్గం, కుమారి సెల్జా(Kumari Selja), రణదీప్ సింగ్ సుర్జేవాలా, కెప్టెన్ అజయ్ సింగ్ యాదవ్ వర్గాల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 30 మందికి పైగా హుడాను మద్దతు ఇస్తున్నారని సమాచారం. అయితే హుడా నాయకత్వంలో పార్టీ మూడు సార్లు ఓడిపోయిందన్న వాదన కూడా వినిపిస్తుంది.
ఓటమికి బాధ్యులపై చర్య తీసుకోవాలి..
గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పార్టీ అసంతృప్త నేత కుమారి సెల్జా డిమాండ్ చేస్తున్నారు. హుడా వర్గం స్వార్థ ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చిందని, పార్టీ ఓటమికి కారణమైందని అభిప్రాయపడ్డారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల ఓటమికి హుడా, ఉదయ్ భాన్ బాధ్యత వహించాలని. వారిని నాయకత్వ బాధ్యతల నుంచి తొలగించాలని అజయ్ సింగ్ యాదవ్ కోరుతున్నారు.
హుడా గురించే ఆందోళన..
హుడాను పూర్తిగా పక్కన పెట్టి పార్టీని పునర్నిర్మించాలా? లేదా ఆయనతో రాజీ పడి ముందుకు సాగాలా? అన్న సందిగ్ధంలో కాంగ్రెస్ అధిష్టానం ఉంది. హుడా తనకిష్టమైన వ్యక్తిని CLP నాయకుడిని చేయాలని కోరితే.. పార్టీలో మరిన్ని విభేదాలు తలెత్తే ప్రమాదం ఉంది. మరోవైపు హుడాను పూర్తిగా పక్కన పెడితే.. ఆయన మరో మార్గం ఎంచుకోవచ్చని భయం కూడా ఉంది.
దీపేందర్ హుడాకు అవకాశం ఉందా?
తనకు CLP నాయకుడి పదవి ఇవ్వకపోతే.. తన కుమారుడు దీపేందర్ హుడాను కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించాలని హుడా కోరుతున్నారు. అయితే హుడా డిమాండ్‌ను సెల్జా, సుర్జేవాలా, యాదవ్ వంటి నేతలు దాదాపు అంగీకరించకపోవచ్చు. దీంతో CLP నేతగా సెల్జా వర్గానికి చెందిన వ్యక్తిని, PCC చీఫ్‌ను హుడా వర్గానికి చెందిన వ్యక్తికి అప్పగించాలనే యోచనలో అధిష్టానం ఉంది. హుడా వర్గం నుంచి గీతా భుక్కల్ పేరు పరిశీలనలో ఉండగా.. సెల్జా వర్గం నుంచి చందర్ మోహన్ పేరు పరిశీలనలో ఉంది.
మరిన్ని సంక్షోభాలు తప్పవా?
అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా.. హరియాణా కాంగ్రెస్‌లో అంతర్గత పోరు మరింత పెరిగే అవకాశం ఉంది. 2025ను "సంఘటన్ సృజన్" (పార్టీ పునర్నిర్మాణం) సంవత్సరంగా ప్రకటించిన కాంగ్రెస్.. విభేదాలకు పరిష్కారం కనుక్కోలేకపోతే భవిష్యత్తులో పార్టీకి మరిన్ని సంక్షోభాలు తప్పవు.