ఆవేళ గద్దె దింపారు, ఈవేళ భారత రత్న ఇచ్చారు! ఇంతకీ ఎవరీ కర్పూరీ ఠాకూర్?
సర్కారీ కొలువుల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చినందుకు ఆయన సీఎం పదవి ఊడింది. ఇప్పుడవే వర్గాలు మంగలి సామాజిక వర్గానికి చెందిన కర్పూరీ ఠాకూర్ కి భారత రత్న ఇచ్చాయి..
1977 అక్టోబర్ 11, బిహార్ రాజధాని పాట్నా.. ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్.
లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ (జేపీ) పుట్టిన రోజు.. అప్పుడు అటు ఢిల్లీలో ఇటు పాట్నాలో అధికారంలో ఉన్న జనతా పార్టీ నాయకులందరూ భేటీ అయ్యారు. అందరూ కలిసి వెళ్లి జేపీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడానికి బయలు దేరారు. ఆ ప్రముఖుల్లో ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్ కూడా ఉన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి చిరిగిన చొక్కా, మాసిపోయిన ఫైజమా, గీతలు పడిన కళ్లజోడుతో కర్పూరీ ఠాకూర్ రావడం చూసిన ఆనాటి జనతా పార్టీ నేత చంద్రశేఖర్ కాస్తంత వ్యంగంగానే కర్పూరీ ఠాకూర్ కొత్త కుర్తా కొనుక్కోవడానికి కొంత డబ్బు విరాళంగా ఇమ్మని కోరతాడు. ఇక, అంతే వేలాది రూపాయలు విరాళాలు వచ్చాయి. అయితే ఆయన వాటిని ముట్టుకోకుండా నేరుగా ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇచ్చి తన నిరాడంబరతను చాటతారు. తన గొప్పతనాన్ని చాటుకుంటారు. తనకు సాటి ఎవరూ లేరని కర్పూరీ ఠాకూర్ తన ప్రవర్తనతో చాటి చెప్తారు.
అలాంటి దివంగత నేత కర్పూరి ఠాకూర్ కు అరుదైన గౌరవం దక్కింది. ఆయన శతజయంతి వేళ కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నతో గౌరవించింది. 1924 జనవరి 24న బిహార్‌లోని సమస్తీపూర్ జిల్లాలో జన్మించిన కర్పూరి ఠాకూర్.. అనునిత్యం పేద ప్రజల సంక్షేమం కోసం, సామాజిక మార్పు కోసం పనిచేశారు. బిహార్‌కు రెండు సార్లు -డిసెంబరు 1970 నుంచి జూన్ 1971 వరకు, డిసెంబరు 1977 నుంచి ఏప్రిల్ 1979 వరకు- సీఎంగా పని చేశారు. తన పాలనా దక్షతతో జన నాయక్‌గా చెరగని ముద్ర వేసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో వెనుకబడిన కులాలకు రిజర్వేషన్లు కల్పించినందుకు ఆనాటి జనతా పార్టీలోని అగ్రవర్ణాల ఆగ్రహానికి గురై పదవి పొగొట్టుకున్నారు. ఇప్పుడు అవే శక్తులు కర్పూరీ ఠాకూర్ కి భారత రత్న అవార్డు ఇచ్చి సంస్మరించుకోనున్నాయి. 2024 ఎన్నికల వేళ కర్పూరీ ఠాకూర్ త్యాగం గుర్తుకురావడం విశేషమేననన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ.
స్వాతంత్య్ర పోరాటంలో చురుగ్గా...
బ్రిటిష్ ఇండియాలోని బిహార్-ఒడిశా ప్రావిన్స్‌లోని పితౌజియా (ప్రస్తుతం కర్పూరిగ్రామ్)లో అతి సామాన్య కుటుంబంలో కర్పూరి ఠాకూర్ జన్మించారు. తల్లిదండ్రులు గోకుల్ ఠాకూర్, రామ్‌దులారి దేవి. నాయి (మంగలి) వర్గానికి చెందినవారు. జాతిపిత మహాత్మా గాంధీ, కమ్యూనిస్టు నేత సత్యనారాయణ సిన్హాతో ప్రభావితమయ్యారు. ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్- ఏఐఎస్ఎఫ్- చేరాడు. విద్యార్థి కార్యకర్తగా క్విట్ ఇండియా ఉద్యమంలో చేరడానికి తన గ్రాడ్యుయేషన్ వదిలేశారు. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నందుకు అతను 26 నెలల జైలు జీవితం గడిపాడు. భారత దేశం స్వాతంత్ర్యం పొందిన తరువాత, ఠాకూర్ తన గ్రామంలోని పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేశారు. విద్యార్థి దశలోనే పోరాట పంథాను ఎంచుకున్నారు. క్విట్ ఇండియా ఉద్యమంలోనూ చురుగ్గా పాల్గొన్నారు. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి 26 నెలల పాటు జైలు జీవితం గడిపారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తన గ్రామంలో ఉపాధ్యాయుడిగా సేవలందించి ప్రజలను చైతన్యపరిచారు. ఆ తర్వాత జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తేజ్‌పుర్ నియోజకవర్గం నుంచి సోషలిస్టు పార్టీ అభ్యర్థిగా భారీ మెజార్టీతో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 1960లో పీ అండ్ టీ ఉద్యోగుల పోరాటానికి నాయకత్వం వహించి అరెస్టయ్యారు. ఆ తర్వాత 1970లో టెల్కో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం 28 రోజుల పాటు నిరవధిక నిరాహార దీక్ష చేశారు.
ఆంగ్లాన్ని తప్పనిసరి సబ్జెక్ట్ కాదన్న కర్పూరీ ఠాకూర్...
బిహార్‌కు మంత్రిగా ఉన్న సమయంలో మెట్రిక్యులేషన్‌లో ఆంగ్లాన్ని తప్పనిసరి సబ్జెక్టు జాబితా నుంచి తొలగించారు. మద్యపాన నిషేధాన్ని అమలు చేయడంతో పాటు వెనుకబడిన ప్రాంతాల్లో అనేక విద్యాసంస్థలు ఏర్పాటు చేసి విద్యా వికాసానికి కృషి చేశారు.
గాంధీజీతో విభేదించి లోహియాతో జతకట్టి...
తొలుత గాంధీజీ ఆలోచనల్ని ప్రచారం చేసినప్పటికీ.. ఆ తర్వాత సైద్ధాంతికంగా ఆయనతో విభేదించారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాంతం పనిచేశారు. రామ్‌మనోహర్ లోహియా స్థాపించిన సంయుక్త సోషలిస్టు పార్టీకి అధ్యక్షుడిగానూ చాలా కాలం పాటు ఠాకూర్ పనిచేశారు. దేశంలో భూస్వాముల వద్ద, ప్రభుత్వ ఆధీనంలోని భూముల్ని పేదలకు పంచడం ద్వారా సామాజిక, ఆర్థిక సమానత్వం సాధిస్తుందని.. తద్వారా దేశం పురోగమిస్తుందని విశ్వసించారు. జనం కోసం నిబద్ధతతో పనిచేసిన ఆయన్ను ‘జననాయక్ కర్పూరి ఠాకూర్’ అని అక్కడి ప్రజలు పిలుస్తారు.
ఎందరో ప్రముఖులకు రాజకీయ గురువు..
జయప్రకాశ్ నారాయణ్‌కు సన్నిహితుడిగా ఉన్న ఠాకూర్ ఆ తర్వాత జనతా పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు. అగ్రకులాలు మాత్రమే రాజకీయ ఆధిపత్యం వహించే బిహార్‌లో ఓబీసీ రాజకీయాలకు పునాది వేసిన వారిలో అగ్రగణ్యులు. జేపీ ఇచ్చిన పిలుపుతో ఎంతోమంది యువత ఉద్యమంలోకి రాగా.. అలా వచ్చిన లాలూ ప్రసాద్ యాదవ్, నీతీశ్ కుమార్, రాం విలాస్ పాశవాన్ వంటి నేతలకు ఠాకూర్ రాజకీయ గురువు. బిహార్‌లో ఓబీసీలతో పాటు ఎంబీసీలూ ఎదగాలని ఆయన భావించారు. దళితులు, ఎంబీసీలు, ముస్లింల హితం కోసం పనిచేశారు. తాను విశ్వసించిన సిద్ధాంతాలకు కట్టుబడి సుదీర్ఘకాలం పాటు బిహార్, దేశ రాజకీయాలను ప్రభావితం చేయడం ద్వారా గొప్ప రాజనీతిజ్ఞుడిగా గుర్తింపుపొందిన ఆయన 1988 ఫిబ్రవరి 17న తుదిశ్వాస విడిచారు.
1977 బీహార్ శాసనసభ ఎన్నికలలో అధికార కాంగ్రెస్ పార్టీ జనతా పార్టీ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. జనతా పార్టీలో ఆనాడు చరణ్ సింగ్, భారతీయ లోక్ దళ్, సోషలిస్టులు, జనసంఘ్ హిందూ నేషనలిస్టులు ఉండేవాళ్లు. దేశవ్యాప్త ఎమర్జెన్సీని విధించిన తర్వాత ఇందిరాగాంధీని ఓడించడమే లక్ష్యంగా ఈ పార్టీ ఏర్పాటైంది. జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీహార్ జనతా పార్టీ అధ్యక్షుడు సత్యేంద్ర నారాయణ్ సిన్హాపై పైచేయి సాధించి ఠాకూర్ రెండవసారి బీహార్ ముఖ్యమంత్రి అయ్యారు.
ప్రభుత్వ ఉద్యోగాల్లో వెనుకబడిన కులాలకు రిజర్వేషన్లు కల్పించాలని సిఫార్సు చేసిన ముంగేరి లాల్ కమిషన్ నివేదికను అమలు చేయాలని ఠాకూర్ తీసుకున్న నిర్ణయంపై పార్టీలో అంతర్గత పోరు మొదలైంది. ఠాకూర్‌ను ముఖ్యమంత్రిగా దింపడం ద్వారా జనతా పార్టీకి చెందిన అగ్రవర్ణ సభ్యులు రిజర్వేషన్ విధానాన్ని నీరుగార్చేందుకు ప్రయత్నించారు. దీంతో ఠాకూర్ రాజీనామా చేయాల్సి వచ్చింది.