ముద్రగడ.. ఎవరికి దడ?
ముద్రగడ పద్మనాభం సమకాలికులంతా సీఎంలయ్యారు. రాష్ట్రానికి ఏలిక కావాల్సినంత స్థాయి, చరిత్ర, ఇతరత్రా సామాజిక సాధన సంపత్తి ఉన్న ముద్రగడ మాత్రం వెనకబడి పోయారు..ఎందుకు
2023 నవంబర్ 29.. ప్రత్తిపాడు, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్.
“రాబోయే ఎన్నికల్లో పోటీ విషయంపై ఇంకా ఏమీ అను కోలేదు. ఎంపీ, ఎమ్మెల్యేలుగా పోటీలో నిలబడాలంటే కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి” ముద్రగడ పద్మనాభం అన్నమాటలివి..
2024 జనవరి 1, కిర్లంపూడి, ముద్రగడ పద్మనాభం ఇల్లు
“రాజకీయాల్లో మార్పు రావాలి. దుష్టశక్తులపై మంచి విజయం సాధించాలి. అందుకు 2024 నాందీ పలకాలి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు..” ముద్రగడ
సరిగ్గా నెల రోజుల్లో స్వరం మారింది. జనసందోహాలకు కొంతకాలంగా దూరంగా ఉంటున్న ముద్రగడ పద్మనాభం ఇంట జనసందోహంతో కోలాహలమైంది. అప్పటికే జనసేన అధినేత, కాపు సామాజిక వర్గానికే చెందిన పవన్ కల్యాణ్ పై విమర్శల దాడి చేశారు. శత్రువు శత్రువు మిత్రులయ్యే ఈ రోజుల్లో ముద్రగడ అనే అల ఏవైపుకైనా పోవొచ్చు.
అపార వారసత్వం ముద్రగడ సొంతం..
నిజానికి ముద్రగడ కుటుంబానికున్న చరిత్ర, వారసత్వం పద్మనాభాన్ని ఎక్కడికో తీసుకెళ్లగలిగేంత ఉంది. ఓ లాలూ ప్రసాద్ యాదవ్, ఓ ములాయం సింగ్ యాదవ్, ఓ చరణ్ సింగ్, ఇంకో కోట్ల విజయభాస్కరరెడ్డి, మరో నీలం సంజీవరెడ్డి లాంటి వాళ్లు ముఖ్యమంత్రులయ్యారు. వాళ్లకు ఏమాత్రం తీసిపోని, అపారకుల సంపద, నిజాయితీ, ముక్కుసూటి తనం, బడుగు బలహీన వర్గాలంటే ప్రేమాభిమానాలు ముద్రగడ పద్మనాభం సొంతం. అయితే రాజకీయాల్లో రాణించడానికి కాస్తంత లౌక్యం, బతకనేర్చిన తనమూ అవసరమనేది 1980ల తర్వాత తేలిపోయింది. రాజకీయాల్లో హత్యలుండవు ఆత్మహత్యలు తప్ప అనే నానుడి ఉండనే ఉంది కదా. ముద్రగడ లాంటి వాళ్లు అప్పుడప్పుడైనా ఆమాటను పట్టించుకోవాల్సింది. రాజకీయానికి అవసరమైన ఓర్పు, సహనాన్ని వంటబట్టించుకోవాల్సింది.
ముద్రగడ ఆతిథ్యమంటే మాటలా...
‘ముద్రగడ పద్మనాభం లాంటి మంచి మనిషిని చూడం, అందరూ కొట్టిచంపుతారు, ఈయన మాత్రమే పెట్టి చంపుతారు’ అని ఆయన్ని40 ఏళ్లుగా దగ్గరగా చూస్తున్న కాకినాడ వాసి, రాజకీయ విశ్లేషకుడు టి.శేఖర్ చెబుతారు. అయితే నేటి రాజకీయాలకు మంచి తనానికి మధ్య దూరం పెరిగింది. దీంతో ముద్రగడ లాంటి వాళ్ల ప్రతిభ మసకబారుతుంది. పున్నమి చంద్రులవుతుంటారే తప్ప నిరంతర ప్రకాశవంతులు కాలేకపోతుంటారు. ఆంధ్రప్రదేశ్ లోని కోనసీమను అందరూ ఎంతగా కీర్తిస్తారో అంతటి విషాదం కూడా ఆ సీమలో ఉందనేది నగ్నసత్యం.
తూర్పునేలిన కుటుంబాల్లో ముద్రగడ ఫ్యామిలీ ఒకటి..
అటువంటి తూర్పుగోదావరి జిల్లాను ఏలిన నాలుగైదు ప్రముఖ కుటుంబాల్లో ముద్రగడ ఫ్యామిలీ ఒకటి. కిర్లంపూడి బిడ్డ ముద్రగడ. సంపన్నుడే. వాళ్ల నాన్న వీరరాఘవరావు 1962, 1967లోనే ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండు సార్లు గెలిచారు. నిరుపేద దళితులకు ఆయన వీరాభిమాని. ఆయన జీవిత కాలమంతా నిరుపేదల కోసమే పని చేశారంటే కాపులకు కోపం వస్తుందేమో గాని అది నిజం. ఆయన ఏనాడూ కాపు కుల భుజకీర్తులను తగిలించుకోలేదు. మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డికి తల్లో నాలుక ముద్రగడ వీరరాఘవరావు. 1977లో ఆకస్మికంగా చనిపోవడంతో ముద్రగడ పద్మనాభం రాజకీయాల్లోకి రాకతప్పలేదు. 1978లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ముద్రగడ పద్మనాభం జనతాపార్టీ అభ్యర్థిగా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. గిరిజనులు, నిరుపేద బీసీలు పద్మనాభంలో ఆయన తండ్రిని చూసుకున్నారు. అలా మొదలైన ముద్రగడ రాజకీయ ప్రస్థానం అప్రతిహాతంగా రెండు దశాబ్దాల పాటు సాగిందనే చెప్పాలి. మూడుసార్లు శాసనసభ్యుడిగా, ఒకసారి ఎంపీగా, రెండుసార్లు రాష్ట్ర మంత్రిగా ముద్రగడ పద్మనాభం పనిచేశారు. వరుస విజయాలు ఎంతటి వాళ్లకైనా ఓ దీమాను, కించిత్ గర్వాన్నీ తెస్తాయి. దాంతో పాటే ఫాల్స్ ప్రిస్టేజ్ కూడా వస్తుందంటారు. 1995లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ముద్రగడ ఓడిపోయారు. రాజకీయ నిర్వేదానికి లోనై, జన్మలో ప్రత్తిపాడు నుంచి పోటీచేయనని ప్రకటించారు.
ఎన్నో స్వయంకృతాలు...
“స్వయంను అహం నుంచి విడదీయండి. మనం మౌనంగా కూర్చొని ఉన్నప్పుడు మనలో ఆలోచనలు రూపుదిద్దుకోవటం గమనిస్తాం. జ్ఞాపకాలు, ఆకాంక్షలకు, ఊహలకు మనసులో చిత్ర రూపాన్నిఇచ్చి వాటి ప్రభావమనే సుడిగుండంలో మన మనసు పడిపోవడం గమనిస్తాం. ఇలా జరిగినప్పుడు మన చుట్టూ ఉన్న వాస్తవాలకు దూరం అయి, ఆలోచనలు లేక ఊహా చిత్రపు ఉచ్చులో స్వయాన్ని చిక్కించుకుంటాం. ఈ విధంగా మనలో ఉన్న అహం పనిచేస్తుంది” అని గీతాచార్యుడు చెబుతాడు. ముద్రగడ విషయంలోనూ అదే జరిగింది. రాజకీయాల్లో ఉద్వేగాలు పని చేయవు. ముద్రగడ లాంటి అనుభవశీలి కూడా ఒక్కోసారి బోల్తాపడతారని ప్రత్తిపాడును వదిలేసి కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న పిఠాపురం నుంచి పోటీ చేసినప్పుడు తెలిసింది. కాపులందరూ ఆయన మనుషులే అయినా అక్కడా ఓడారు. 2014 లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి మళ్ళీ ఓడారు. అప్పుడైనా వాస్తవాన్ని గమనంలోకి తీసుకుంటే బాగుండేది. కొంతమంది కాపు సోదరులు రెచ్చగొట్టడంతో ‘కాపు ఉద్యమాన్ని’ భుజానికెత్తుకున్నారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే ఫలితాలు ఎలా ఉంటాయో ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్లకు మరొకరు చెప్పాల్సిన పని లేదు. వంగవీటి రంగా లాంటి వాళ్లు కాపు ఉద్యమాన్ని చేపట్టినప్పుడు ముద్రగడ లాంటి వాళ్లు అన్యమనస్కంగా పని చేశారు.
లోహియా చెప్పిన మాట కలేనా...
ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, అపర మేధావి రామ్ మనోహర్ లోహియా చెప్పినట్టు రెడ్లు, కమ్మల తర్వాత అధికారాన్ని చేపట్టాల్సిన సామాజిక వర్గం కాపులు. అది ఎప్పుడూ జీవిత కాలం లేటవుతూనే వస్తోంది.
“ఉద్యమాలలో షార్ట్ కట్స్ ఉండవు, తుదికంటా పోరాడే వాడిదే అధికారం. ఆ పని కాపులు చేయలేకపోయారు. తాత్కాలిక ప్రయోజనాలు, అవసరాలు డామినేట్ చేసినంత కాలం రాజ్యాధికారం కల్లే” అంటారు కుల రాజకీయాలను విశ్లేషించే వి.చంద్రశేఖర్. ఆవేశకావేశాలతో రాజకీయ ప్రయోజనాలు ఒనకూడవు. 1988లో ఉత్తరకంచి ఘటన మొదలు, 2016 జనవరి 31 నాడు తూర్పు గోదావరి జిల్లా తుని ఘటన వరకు ముద్రగడ నిర్వహించిన ఉద్యమాలు తాత్కాలిక ప్రయోజనాలు చేకూర్చినవే తప్ప అంతిమ రాజ్యాధికారం చేసినవి కావు. ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్లు మరింత విశాల ధృక్పదంతో పని చేసి ఉంటే ఈపాటికే రాజ్యాధికారం వచ్చి ఉండేదనే వాళ్లూ ఉన్నారు. చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం మొదలు ఇప్పుడున్న పవన్ కల్యాణ్ జనసేన వరకు.. ఈ పార్టీలకన్నింటికీ బేస్ కాపు సామాజిక వర్గమే. అందువల్లే ఏపీ రాజకీయాలు కాపు ఓట్ల చుట్టూ తిరుగుతుంటాయి. జరిగిన లోపం ఎక్కడుందో గుర్తించడానికి బదులు వ్యక్తిగత గుర్తింపు కోసమో, ఒకటో అరో సీట్ల కోసమో తాపత్రయపడే బదులు ఓ ములాయం సింగ్ మాదిరో, శరద్ పవార్ మాదిరో ఓ సొంత పార్టీ పెట్టి రాజ్యాధికారం కొట్లాడితే అన్ని వర్గాలకు మేలు జరుగుతుందన్నది రాజకీయ విశ్లేషకుడు దుర్గం రవీందర్ లాంటి ఆవేదన.