
బుల్లి అధికారికి పెద్దాఫీసర్ల సెల్యూట్, ఎందుకంటే..
నిండా పదేళ్లు కూడా నిండని ఈ పిల్ల అధికారికి కానిస్టేబుళ్లు వరుసగా వచ్చి సెల్యూట్ చేయడం అక్కడుండే వాళ్లకి కాస్తంత వింతగానే ఉంది
హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసు స్టేషన్.. జనం కిటకిటలాడక పోయినా.. పర్లేదు, బాగానే ఉన్నారు. స్టేషన్ అధికారి సీట్లో కనబడీ కనపడని బుల్లి పోలీసు ఆఫీసర్ దీమా కూర్చుని ఉన్నారు.
ఒక్కో కానిస్టేబుల్ వస్తూనే.. సెల్యూట్ సర్, రిపోర్టింగ్ ఫర్ డ్యూటీ సర్ అంటూ బూట్లు టకటక లాడిస్తున్నారు. నిండా పదేళ్లు కూడా నిండని ఈ పిల్ల అధికారికి కానిస్టేబుళ్లు వరుసగా వచ్చి సెల్యూట్ చేయడం అక్కడుండే వాళ్లకి కాస్తంత వింతగానే ఉంది. ఏంటా అని అంతా తీరి తీసి, విషయం తెలిసి కన్నీటి పర్యంతమవుతూ ఆ పిల్ల పోలీసు అధికారి పట్ల జాలిచూపారు.
బంజారాహిల్స్ పోలీసుల ఔదార్యం...
బంజారాహిల్స్ పోలీసులు.. క్యాన్సర్‌తో బాధపడుతున్న మోహన్‌సాయి అనే చిన్నారిని పోలీస్ డ్రెస్‌లో ఆఫీసర్ కుర్చీలో కూర్చోబెట్టారు. మోహన్‌సాయి అనే చిన్నారికి... చిన్నప్పటి నుంచే పోలీసు కావాలనే కోరిక ఉండేది. ఈ కోరికను బంజారాహిల్స్ పోలీసులు నెరవేర్చారు.
మోహన్ సాయికి రెక్టం క్యాన్సర్..
గుంటూరుకి చెందిన అనుపోజు బ్రహ్మం, లక్ష్మి దంపతుల రెండో కుమారుడు మోహన్‌సాయి. గత ఏడాది మోహన్‌సాయి అనారోగ్యం పాలవ్వడంతో వైద్య పరీక్షల కోసం హస్పిటల్‌కు తీసుకెళ్లారు. వైద్యులు టెస్ట్‌లు చేసి చిన్నారికి రెక్టం క్యాన్సర్ అని నిర్ధారించారు. దీంతో సంవత్సర కాలంగా బంజారా హిల్స్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో వైద్య చికిత్స తీసుకుంటున్నాడు.
చిన్నారి కోరికను తీర్చిన తీరు ఇలా...
చిన్నారికి పోలీసు అధికారి కావాలన్న కోరికను తల్లిదండ్రుల నుంచి ఆసుపత్రి సిబ్బంది తెలుసుకొని 'మేక్ ఏ విష్' (Make A Wish) ఫౌడేషన్ సభ్యులకు సమాచారం అందించారు. మెక్ ఏ విష్ ఫౌండేషన్ సభ్యులు మోహన్‌సాయిని బంజారాహిల్స్ పోలిస్ స్టేషన్‌కు తీసుకువెళ్లి అతని కోరిక గురించి పోలీసులకు తెలియజేశారు. దీంతో పోలీసు సిబ్బంది మోహన్‌సాయిని సాదరంగా ఆహ్వానించి పోలీస్ ఆఫీసర్ డ్రెస్‌లో అధికారి సీట్‌లో కూర్చోబెట్టి అతని కోరికను తీర్చారు.
సెల్యూట్ సాయి సర్..
బంజారా హిల్స్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ జాకీర్ హుస్సేన్ చిన్నారికి పోలీసు గౌరవ వందనం చేసి, చిన్నారి నుంచి కూడా గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం అడ్మిన్ సబ్ ఇన్స్పెక్టర్ శివ శంకర్ చిన్నారికి పోలీస్ స్టేషన్లో జరిగే పని విధానం గురించి వివరించారు. అనంతరం చిన్నారికి సబ్ ఇన్స్పెక్టర్ రవీందర్ ఇతర సిబ్బంది బహుమతులను అందజేశారు.