
నితీష్‌కు శాశ్వత ఓటు బ్యాంకు మహిళలే.. ఎందుకు?
వివిధ పథకాల వల్ల ప్రయోజనం పొందిన మహిళలంతా.. నితీష్‌ను మరోసారి ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు.
రెండు దశాబ్దాలకు పైగా ముఖ్యమంత్రి నితీష్ కుమార్(Nitish kumar) బీహార్(Bihar) రాజకీయాలపై పట్టు సాధించారు. ఈ శాశ్వత ఆధిపత్యం వెనుక ప్రధాన కారణం మహిళలే. కులాలకు అతీతంగా మహిళా ఓటర్లే ఆయన ప్రతిసారి అధికార పగ్గాలు కట్టబెట్టారు. 2025 అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఈ సారి కూడా గెలుపు మహిళల చేతుల్లోనే ఉందని స్పష్టమవుతోంది. 20 సంవత్సరాలుగా నితీష్ ముఖ్యమంత్రిగా ఉన్నా.. ఆయన పథకాల ద్వారా ప్రయోజనం పొందిన మహిళలు ఆయనే రాష్ట్రానికి నాయకత్వం వహించాలని కోరుకుంటున్నారు.
ర్యాలీలో పురుషుల కంటే మహిళలే ఎక్కువ..
2025 నవంబర్ 4న నితీష్ కుమార్ సుపాల్ జిల్లాలోని త్రివేణిగంజ్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు. ఆ ర్యాలీకి పురుషుల కంటే మహిళలే ఎక్కువగా హాజరయ్యారు. నితీష్ ర్యాలీలకు పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఆకర్షితులయ్యారు. త్రివేణిగంజ్‌లో కూడా ఆయన ప్రసంగాన్ని చూడటానికి, వినడానికి మహిళలు దూర ప్రాంతాల నుంచి వచ్చారు.
2025 ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా ఎవరిని చూడాలనుకుంటున్నారని ‘ది ఫెడరల్’ అడిగినప్పుడు.. నిస్సందేహంగా తమ మద్దతు నితీష్‌కేనని చెప్పారు.
ముఖ్యమంత్రి మహిళా ఉపాధి పథకం కింద రూ. 10వేలు అందుకోని విభా కుమారి మాట్లాడుతూ.. "నాకు ఇంకా డబ్బు అందలేదు. అయినా నితీష్ కుమారే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నా. అందరికీ అందేలా చూస్తారని నేను నమ్ముతున్నాను" అని చెప్పారు.
మరో మహిళ సీతా దేవి మాట్లాడుతూ.. “నితీష్ కుమార్ ఇప్పటికే మాకు రూ. 10 వేలు ఇచ్చారు. రేషన్ ఉచితం. విద్యుత్ బిల్లులు మాఫీ అయ్యాయి. ఆయన మా కోసం అన్నీ చూసుకున్నారు. మేము ఇప్పుడు మెరుగైన జీవితాలను గడుపుతున్నాము” అని అన్నారు.
"మాకు సొంతంగా భూమి లేదు, ఇప్పుడు నితీష్ కుమార్ మాకు ఇల్లు కట్టుకోవడానికి ఒక చిన్న ప్లాట్ ఇస్తారని ఆశిస్తున్నాం. భూమి ధరలు పెరిగాయి. మేము కొంచెం కూడా కొనలేకపోతున్నాం" అని సీతా కుమారి అన్నారు.
‘తేజస్వి మీద నమ్మకం లేదు..’
ముఖ్యమంత్రి అయితే తేజస్వి యాదవ్ రూ.30వేలు ఇస్తానని ఇచ్చిన హామీ గురించి కొంతమంది మహిళలను అడిగినప్పుడు.. "ప్రస్తుతం అతను ఇస్తానని చెబుతున్నాడు. కానీ ఎన్నికల తర్వాత ఇస్తాడో, లేదో ఎవరికి తెలుసు? నితీష్ కుమార్ తన వాగ్దానాలను నెరవేరుస్తాడని మేము నమ్ముతున్నాము" అని ఒక మహిళ అన్నారు.
మరో మహిళ ఇలా వ్యాఖ్యానించింది.. "మేం నితీష్ కుమార్‌కు రుణపడి ఉన్నాం. ఆయన వల్లే మనం రోడ్లపై సురక్షితంగా నడవగలుగుతున్నాం. మేము ఆయనను నమ్ముతున్నాం." నితీష్ తిరిగి అధికారంలోకి వస్తే.. ఇళ్ళు నిర్మించుకోవడానికి భూమి ఇస్తారని అనేక మంది మహిళలు ఆశాభావం వ్యక్తం చేశారు.
నితీష్ వైపు ఎందుకు మొగ్గు చూపాలి?
నితీష్ కుమార్‌కు ఇంత బలమైన మద్దతు ఎందుకు ఉందని అడిగినప్పుడు మహిళలు స్పష్టంగా చెప్పారు. "ఆయన రోడ్లు నిర్మించారు. ఆహారం అందించారు. విద్యుత్ బిల్లులు మాఫీ చేశారు. మా పిల్లలు చదువుకోవడాన్ని సులభతరం చేశారు. ఆయన మహిళల వేతనాలను కూడా పెంచారు. అందుకే ఆయనకు మా ఓట్లు " అని చెప్పారు. "మేము నితీష్ కుమార్‌ను మరో ఐదేళ్లు ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నాం," అని చాలామంది మహిళలు బలంగా చెప్పారు.
నగదు బదిలీ ప్రభావం చూపిందా?
ఎలక్షన్ కోడ్ అమల్లోకి రాకముందే ముఖ్యమంత్రి మహిళా ఉపాధి పథకం కింద మహిళలకు రూ. 10వేల బదిలీ చేయాలని సీఎం నితీష్ కుమార్ తీసుకున్న నిర్ణయం క్షేత్రస్థాయిలో ప్రభావం చూపుతోంది. దాదాపు 1.3 కోట్ల మంది మహిళలకు నగదు అందింది. ఈ పథకాన్ని సెప్టెంబర్ 26న ప్రధాని మోదీ ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రతిపక్షాలు ఈ చర్యను ఎన్నికల లంచం అని విమర్శించారు. అయితే మహిళలు దీనిని భిన్నంగా చూస్తున్నారు. నితీష్ కుమార్ మాత్రమే తమ ఆర్థిక భారాలను తగ్గించడానికి నిరంతరం కృషి చేసే ఏకైక నాయకుడు అని విశ్వసిస్తున్నారు.

