హర్యానా అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్, ఆప్ కలిసి పోటీచేస్తాయా?
x

హర్యానా అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్, ఆప్ కలిసి పోటీచేస్తాయా?

కాంగ్రెస్‌లో టిక్కెట్ దక్కని వారు ఆమ్ ఆద్మీ పార్టీలోకి చేరే అవకాశాలున్నాయి. దీంతో హస్తం పార్టీ ఆప్‌తో పొత్తుకు ప్రయత్నిస్తోంది.


హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు తేదీ ఖరారయ్యింది. ఇక ఆశావహులు పార్టీ టిక్కెట్ కోసం పార్టీ కార్యాలయాల చుట్టూ, అగ్రనేతల చుట్టూ తిరుగుతున్నారు. ఇక కాంగ్రెస్ తరుపున ఎన్నికలలో పోటీ చేసేందుకు 2,500 దరఖాస్తులు వచ్చాయి. టికెట్‌ ఆశిస్తున్న వారు తమ మద్దతుదారులతో కలిసి ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయానికి చేరుకుంటున్నారు. అగ్రనేతలతో సమావేశమై తమకు టిక్కెట్ దక్కేలా చూడాలని వేడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థుల పేర్లను ప్రకటించడం కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది. తొందరపడి ప్రకటిస్తే రెబెల్‌గా మారిపోతారన్న భయం హస్తం పార్టీని వెంటాడుతుంది. అందుకే కాంగ్రెస్ అధిష్ఠానం అభ్యర్థులను ఖరారు చేసే విషయంలో ఒకటి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది. టిక్కెట్ దక్కని వారు ఆమ్ ఆద్మీ పార్టీలోకి చేరి పోయి కాంగ్రెస్ ఓట్లను చీల్చే ప్రమాదం ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌ స్టార్‌, వ్యూహకర్త రాహుల్‌ గాంధీ రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఆప్‌తో పొత్తు పెట్టుకుని పోటీకి దిగితే ఎలా ఉంటుందన్న దానిపై కూడా చర్చిస్తున్నారు. ఇప్పటికే భారత కూటమిలో భాగస్వామి అయిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)తో చర్చలు జరపాలని కాంగ్రెస్ రాష్ట్ర నేతలకు సూచించినట్లు సమాచారం.

హర్యానాలో ఆప్ పరిస్థితి..

హర్యానాలో ఆప్ ప్రభావం పెద్దగా లేకపోయినా.. జైలులో ఉన్న ఆప్ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత స్థానిక ఆప్ నేతలతో కలిసి రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. తమ అభ్యర్థులను ఎన్నికలలో నిలబెట్టే అవకాశం కూడా ఉంది. హర్యానాలోని మొత్తం 90 అసెంబ్లీ స్థానాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని గతంలో ఆప్ నేతలు ప్రకటించారు. అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులు లేకపోయినా ఈ ప్రకటన చేశారు. కేజ్రీవాల్ హర్యానాలో జన్మించారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో బీజేపీ తనను కావాలని ఇరికించిందని కేజ్రీవాల్ మొదటి నుంచి చెబుతున్నారు. దీన్నే ప్రచారాస్ర్తం వాడి హర్యానా ఓటర్ల సానుభూతి పొందే అవకాశం ఉంది.

విడివిడిగా.. కలిసి..

ఆప్‌తో కాంగ్రెస్ పొత్తుకు ఇతర అంశాలు కూడా ఉన్నాయి. పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ హర్యానాలో కాంగ్రెస్‌కు మద్దుతు బలంగా ఉంది. హర్యానాలో BJP బలంగా ఉన్న ప్రాంతాల్లో కాంగ్రెస్, AAP కలిసి, బలంగా లేనిచోట కాంగ్రెస్, AAP విడివిడిగా పోటీచేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

కాంగ్రెస్‌లో అంతర్గత పోరు..

హర్యానాలో రాష్ట్ర నేతల మధ్య ఉన్న అంతర్గత పోరుతో కాంగ్రెస్ తీవ్రంగా నష్టపోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆప్‌తో పొత్తు పెట్టుకుంటే అంసతృప్త నేతలు అటువైపు వెళ్లకుండా చేయొచ్చన్నది కాంగ్రెస్ పార్టీ ఆలోచన.

పొత్తుకు ఓకే చెప్పిన ఆప్ ఎంపీ..

అయితే కాంగ్రెస్‌ పొత్తును ఆప్‌ రాజ్యసభ సభ్యుడు సంజయ్‌ సింగ్‌ స్వాగతించారు. అంతేకాకుండా ఢిల్లీ, పంజాబ్ మధ్య హర్యానా ఉంటుంది. రెండు రాష్ర్టాలో ఆప్ అధికారంలో ఉంది. ఇక్కడ పొత్తు ఖాయమయితే ఢిల్లీ, గుజరాత్‌తో పాటు మరికొన్ని రాష్ట్రాలలో కలిసి పోటీ చేసే వీలుంటుంది. కాంగ్రెస్‌తో పోరాడి, బీజేపీకి అవకాశం ఇవ్వడం కంటే పొత్తు పెట్టుకోవడమే మేలన్న ఆలోచనలో ఆప్ ఉంది. అందుకే హర్యానాలో అధికారం కోసం వచ్చే నెలలో జరిగే పోరులో ఆప్, కాంగ్రెస్ రెండూ కలిసి పోటీచేసేందుకు ఎక్కువ అవకాశాలున్నాయి.

ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆప్ కలిసి హర్యానా ఢిల్లీలో కలిసి పోటీ చేశాయి. పంజాబ్‌లో విడివిడిగా పోటీ పడ్డారు. హర్యానాలో కాంగ్రెస్ తొమ్మిది స్థానాల్లో, AAP ఒక స్థానంలో పోటీ చేసింది. ఢిల్లీలో కాంగ్రెస్ మూడు, ఆప్ నాలుగు స్థానాల్లో పోటీ చేసింది.

కాంగ్రెస్‌లో చేరిన గౌతమ్..

ఆప్‌కి చెందిన ఢిల్లీ మాజీ మంత్రి రాజేంద్ర పాల్ గౌతమ్ కాంగ్రెస్‌లో చేరారు. పేదలు, దళితులు, ఎస్టీలు, మైనారిటీల అభ్యున్నతికి ఆ పార్టీ నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే గట్టి మద్దతు ఇవ్వడం వల్లే తాను గ్రాండ్ ఓల్డ్ పార్టీలో చేరుతున్నట్లు తూర్పు ఢిల్లీలోని సీమాపురి ఎమ్మెల్యే శుక్రవారం (సెప్టెంబర్ 6) తెలిపారు. ఆధిపత్య హిందుత్వ దృక్పథంపై గౌతమ్ పదే పదే విరుచుకుపడడం వల్ల వివాదాస్పద వ్యక్తిగా ముద్ర పడింది. రెండేళ్ల క్రితం ఢిల్లీలో ఆప్ మంత్రి పదవికి రాజీనామా చేసిన గౌతమ్.. కాంగ్రెస్‌లో చేరడం వల్ల ఆయనకు రెండు పార్టీల నేతలతో ఉన్న సంబంధాలు ఉన్నాయి. అవి ఎన్నికలలో ఉపయోగపడతాయన్నది పార్టీ నేతల అభిప్రాయం.

Read More
Next Story