
పహల్గాం హత్యాకాండ ఒమర్‌పై ప్రభావం చూపుతుందా?
పర్యాటకులు రావడం తగ్గితే అబ్దుల్లా ప్రభుత్వ ఆదాయంపై దెబ్బపడుతుంది. ఫలితంగా ఆయన కేంద్రంపై ఆధారపడాల్సి వస్తుంది.
జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాకు భద్రతా వ్యవస్థలపై ఎలాంటి అధికారాలు లేవు. కాబట్టి ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడికి ఆయనను బాధ్యుడిని చేయలేం. పహల్గాం సమీపంలోని బైసారన్ లోయలోకి ప్రవేశించిన ఉగ్రమూకలు 26 మంది పర్యాటకులను పొట్టనపెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ దాడికి పాకిస్థాన్ కేంద్రంగా ఉన్న లష్కర్ ఇ తోయిబా అనుబంధ సంస్థ 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్' (TRF) బాధ్యత వహించింది. వాస్తవానికి ఈ దుర్ఘటన ఒమర్‌కు పెద్ద సమస్య తెచ్చిపెట్టింది. 2019లో ఆర్టికల్ 370 రద్దు చేశారు. జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదా తీసేయడంతో అక్కడ భద్రతా వ్యవస్థను కేంద్రమే కంట్రోల్ చేస్తోంది. ఇన్నేళ్లుగా కేంద్ర ప్రభుత్వం "ఉగ్రవాదాన్ని నాశనం చేశాం" అని చెప్పుకుంటూ వస్తోంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఏర్పడిన TRF ఉగ్రవాద సంస్థ ఇంకా దాడులకు తెగబడుతోంది. పహల్గాం ఘటనతో కేంద్రం చెబుతున్న మాటలు అవాస్తవమని తేలిపోయింది. కశ్మీర్‌లో ఉగ్రవాదం ఇంకా బతికేఉందని అర్థం చేసుకోవాలి.
భద్రతా వైఫల్యాన్ని అంగీకరించిన కేంద్రం..
హోంమంత్రి అమిత్ షా(Amit Shah) ఇటీవలి కాలంలో "కశ్మీర్‌లో ఉగ్రవాదం ముగిసింది" అన్నారు. కానీ బైసారన్ ఘటన తర్వాత ఆయన మాటలు నిజంకాదని తేలిపోయింది. పోలీసు అనుమతి లేకుండా పర్యాటకులు వచ్చారని సమావేశానికి హాజరయిన ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) అధికారులు చెప్పేందుకు ప్రయత్నించారు. కానీ ప్రతిపక్ష నాయకులు వారి వాదనను ఖండించారు. పర్యాటకుల రక్షణ భద్రతా సంస్థలదేనని గుర్తు చేశారు. ఈ అంశం భారీ భద్రతా వైఫల్యాన్ని ఎత్తి చూపిందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
ఒమర్‌కు రాజకీయంగా సమస్యే..
భద్రతా వ్యవస్థపై అధికారం కేంద్రానిదే అయినా..ఒమర్‌కు మాత్రం రాజకీయ సవాళ్లు తప్పడం లేదు. ఆయన ముఖ్యమంత్రిగా గెలిచినప్పటి నుంచి ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ (NC) పార్టీ ఎన్నికల సమయంలో జమ్మూ కశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా, ఆర్టికల్ 370 పునరుద్ధరణ కోసం పోరాటం చేస్తామని చెప్పారు. సీఎం అయిన తర్వాత ఆర్టికల్ 370ను రద్దు చేసిన పార్టీ (BJP).. అందుకు సహకరిస్తుందని భావించడం లేదని చెప్పారు. దాంతో ఆర్టికల్ 370 పునరుద్ధరణపై ఆశలు ఆవిరైపోయాయి. ఇటీవల ఒమర్ తండ్రి, NC నేత ఫరూఖ్ అబ్దుల్లాను తన పాత మిత్రుడు చేసిన వ్యాఖ్యలు చికాకుపెట్టాయి. ఆర్ఎండబ్ల్యూ మాజీ చీఫ్ ఏఎస్ దులత్ తన పుస్తకంలో.. "ఆర్టికల్ 370 రద్దుకు ముందు మమ్మల్ని సంప్రదించినట్లయితే మేము మద్దతు ఇచ్చేవాళ్లం" అని ఫరూఖ్ అబ్దుల్లా అన్నట్లు పేర్కొన్నారు. దీన్ని అబ్దుల్లా కుటుంబం ఖండించింది.
రాష్ట్ర హోదాపై ఒమర్ ..
జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో రాష్ట్ర హోదా పునరుద్ధరణపై సీఎం ఒమర్ అబ్దుల్లా తీర్మానం చేశారు. అయినా రాష్ట్ర హోదా ఇవ్వడంతో కేంద్రం ఆలస్యం చేస్తోంది. ఇప్పుడు పహల్గాం దాడి తర్వాత రాష్ట్ర హోదా ఇచ్చే అంశాన్ని మరింత గట్టిగా నిరాకరించే అవకాశముందని చెబుతున్నారు. ఒక సీనియర్ NC ఎమ్మెల్యే మాట్లాడుతూ.. "ఇప్పుడు భద్రత పేరుతో జమ్మూ కశ్మీర్‌లో కేంద్రం మరింత కఠిన చర్యలు తీసుకుంటుంది" అన్నారు. ఒమర్ ఈ విధానానికి సహకరించాల్సి వస్తుంది. ప్రతి పార్టీకి చెందిన కశ్మీరీ నాయకులు కూడా ఇప్పుడు పెరిగిన సైనికీకరణ వల్ల పౌరులపై ప్రమాదం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పర్యాటకంపై తీవ్ర ప్రభావం..
పహల్గాం దాడి కశ్మీర్ ఆర్థిక వ్యవస్థకు భారీ దెబ్బే. కశ్మీర్ ఆర్థిక వ్యవస్థకు పర్యాటకం చాలా ముఖ్యమైనది. దాడి జరిగిన రోజు ఒమర్ అబ్దుల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో మాట్లాడారు. "మేము అయిపోయాం" అని బాధతో అన్నారు. దానర్థం పర్యాటక రంగం దెబ్బతిని కశ్మీర్‌కు భారీ ఆర్థిక నష్టం జరుగుతుందని. పర్యాటకులు రాకపోతే తమ జీవనోపాధి దెబ్బతింటుందని షికారా బోటు నావికులు, షాప్ దారులు, హోటళ్ల యజమానులు ఆందోళన చెందుతున్నారు.
ఢిల్లీపై ఆధారపడాల్సిందే..
పర్యాటకుల సంఖ్య తగ్గితే.. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం కూడా తగ్గిపోతుంది. దీని వల్ల ఒమర్ మరింతగా కేంద్రంపై ఆధారపడాల్సి వస్తుంది. ఇది రాజకీయంగా కూడా ఆయనకు ప్రమాదకరంగా మారొచ్చు.
పెరుగుతున్న పొలిటికల్ ప్రెజర్..
ప్రస్తుతం అన్ని పార్టీల నేతలు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కేంద్రానికి మద్దతు ఇస్తున్నారు. కానీ త్వరలోనే ప్రజలు మళ్లీ స్థానిక సమస్యలపై- ఆర్థిక స్థితి, ఉపాధి, పాలనపై ప్రశ్నలు వేస్తారు. ఒక PDP నేత మాట్లాడుతూ.. "ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీల్లో ఒమర్ అబ్దుల్లా వెనక్కి తగ్గుతున్నారు" అన్నారు. రాష్ట్ర హోదా, కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్య, కేంద్రంపై పోరాటం వంటి అంశాల్లో ఆయన దూకుడుతనం తగ్గిందని విమర్శించారు. "ఈ విషాదాన్ని సాకుగా చూపి ఒమర్ మళ్లీ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నించకూడదు" అని హెచ్చరించారు.