గాంధీ గారి గుజరాత్‌లో ‘గిఫ్ట్‌’ లిక్కర్‌ ప్రారంభం..
x

గాంధీ గారి గుజరాత్‌లో ‘గిఫ్ట్‌’ లిక్కర్‌ ప్రారంభం..

అక్కడ 60 ఏళ్లుగా మద్యం అమ్మకాలు లేవు. గ్లోబల్‌ ఇన్వెస్టర్ల కోసమేనంటూ ఏకంగా మందు, విందుకు పర్మిషన్‌ ఇచ్చేశారు? ఇంతకు ఏ రాష్ట్రం..అనుమతి ఇచ్చింది ఎవరు?


1960లో మహారాష్ట్ర నుంచి గుజరాత్‌ విడిపోయి కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించింది. జాతిపిత మహాత్మ గాంధీ ఆదర్శాలకు అనుగుణంగా దాదాపు 6 దశాబ్దాలుగా గుజరాత్‌లో మద్యం విక్రయాలపై నిషేధం విధించారు. 60 ఏళ్ల తర్వాత ఈ నిబంధనను గుజరాత్‌లో బీజేపీ ప్రభుత్వం సడలించింది. రాష్ట్ర రాజధాని గాంధీనగర్‌లో మొట్టమొదటి దేశీయ ఆర్థిక సేవల కేంద్రం గుజరాత్‌ ఇంటర్నేషనల్‌ ఫైనాన్స్‌ టెక్‌-సిటీ (గిఫ్ట్‌)లో మందు, విందు (వైన్‌ అండ్‌ డైన్‌)కు గుజరాత్‌ సర్కారు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. సిటీలోని హోటళ్లు, రెస్టారెంట్లు, క్లబ్బుల్లో మద్యం తాగేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

ఎందుకీ నిర్ణయం..

గిఫ్ట్‌ సిటీలో గ్లోబల్‌ ఇన్వెస్టర్లను ఆహ్వానించాలన్న లక్ష్యంతో గుజరాత్‌ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పెట్టుబడులను ఆహ్వానించాలంటే ఇక్కడా గ్లోబల్‌ బిజినెస్‌ ఎకో సిస్టమ్‌ ఉండాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. దీంతో విదేశాల నుంచి వచ్చే వారు, గిఫ్ట్‌సిటీలో పనిచేసే ఉద్యోగులు ఆల్కహాల్‌ తీసుకోవచ్చు.

ప్రభుత్వ నిర్ణయం మేరకు..

గవర్నమెంట్‌ విజన్‌కు అనుగుణంగా ‘వైన్‌ అండ్‌ డైన్‌’కి నిబంధనలు నడలించినట్టు నార్కోటిక్స్‌ అండ్‌ ఎక్సైజ్‌ విభాగం పేర్కొంది. ‘అంతర్జాతీయ పెట్టుబడిదారులు, సాంకేతిక నిపుణులు, జాతీయ, అంతర్జాతీయ కంపెనీలకు ప్రపంచస్థాయి అనుకూల వ్యాపార వ్యవస్థను అందించడానికి గిఫ్ట్‌ సిటీలో నిబంధనలు సబడలించాలని నిర్ణయం తీసుకున్నాం’ అని ప్రకటించింది.

‘గిఫ్ట్‌ సిటీలో పనిచేసే వ్యక్తులందరికీ మద్యం యాక్సెస్‌ పర్మిట్‌, తాగేందుకు అనుమతిస్తాం.. ప్రతి కంపెనీ అథరైజ్డ్‌ విజిటర్స్‌కు తమ శాశ్వత ఉద్యోగుల సమక్షంలో తాత్కాలిక అనుమతులున్న హోటళ్లు, రెస్టారెంట్లు లేదా క్లబ్‌లలో మద్యం తాగేందుకు అనుమతించే నిబంధనను సైతం రూపొందించాం’ అని పేర్కొన్నారు.

భగ్గుమన్న విపక్షాలు..

గుజరాత్‌ బీజేపీ ప్రభుత్వ నిర్ణయంపై ప్రతిపక్ష కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీలు భగ్గుమన్నాయి. ‘‘మహాత్మా గాంధీ జన్మించిన నేల మీద మద్యపాన నిషేధం ఎత్తేయడం ఏమిటో అర్థం కావడం లేదు. ప్రభుత్వం ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటోంది. మద్యపాన నిషేధాన్ని ఎత్తేయడం వల్ల గుజరాత్‌ అభివృద్ధి చెందడం అటుంచితే.. మహాత్మా గాంధీ పుట్టిపెరిగిన ఈ నేల మీద మద్యం విక్రయాలకు అనుమతివ్వడం దురదృష్టకరం’’ అని కాంగ్రెస్‌ పార్టీ నేత శక్తి సింగ్‌ గోహిల్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

గిఫ్ట్‌సిటీ నిర్మాణం ఎప్పుడు జరిగింది..

సింగపూర్‌, దుబాయ్‌, లండన్‌ లాంటి దేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యతో.. సబర్మతీ నది ఒడ్డున 2007లో అప్పటి మోదీ నేతృత్వంలోని బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం 886 ఎకరాల స్థలంలో గిఫ్ట్‌ సిటీ నిర్మాణానికి రూపకల్పన చేసింది. పెట్టుబడిదారులకు వివిధ ప్రయోజనాలను కల్పించి రాష్ట్రానికి ఆర్థిక వనరులను సమకూర్చుకోవడమే ఈ సిటీ ప్రధాన ఉద్దేశ్యం.

గిఫ్ట్‌ సిటీలోకి ఎలా ఆకర్షిస్తున్నారు..

గిఫ్ట్‌ సిటీలోకి కంపెనీలను ఆకర్షించడానికి అనేక రాయితీలు కల్పించారు. ఐఎఫ్‌ఎస్‌సీ ప్రాంతంలో కార్యాలయాలు 10 సంవత్సరాల పాటు పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. కొత్త పన్ను విధానాన్ని ఎంచుకునే కంపెనీలు కనీస ప్రత్యామ్నాయ పన్ను నుంచి మినహాయించారు. గిఫ్ట్‌ సిటీలోని కంపెనీల వారు పొందే సేవలకు వస్తువులు, సేవల పన్ను ఉండదు. ఎక్స్ఛేంజీలలో నిర్వహించే లావాదేవీలపై పెట్టుబడిదారులు టాక్సు చెల్లించాల్సిన అవసరం లేదు.

నిర్మాణ దశలోనే భవనాలు..

గిఫ్ట్‌ సిటీకి శంకుస్థాపన చేసి పదహారేళ్లయినా.. ఇప్పటికీ భవనాల నిర్మాణం పూర్తికాలేదు. మాల్స్‌, పెట్రోల్‌ పంపులు, కార్యాలయ సముదాయాలు, అపార్ట్‌మెంట్‌ల నిర్మాణం కోసం కేటాయించిన స్థలాలు ఖాళీగానే ఉన్నాయి. ఇప్పటివరకు ఒకే ఒక రెసిడెన్షియల్‌ ప్రాజెక్ట్‌ పూర్తయింది. అదే జనాధర్‌ మంగళ. ఇందులో తక్కువ-ఆదాయ వర్గాలకు ఇళ్లు ఉన్నాయి. కొన్ని నివాస భవనాలను నిర్మించారు.

Read More
Next Story