
‘నా ఊపిరి ఆగేంతవరకు అలా జరగనివ్వను’
ఓటరు లిస్టుల నుంచి పేర్లు తొలగించేందుకు 500 బీజేపీలు టీంలు పనిచేస్తున్నాయన్న వెస్ట్ బెంగాల్ సీఎం మమత..
వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు పశ్చిమబెంగాల్(West Bengal)లో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ(S.I.R) చేపడతారన్న ఊహాగానాల నేపథ్యంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(CM Mamata Banerjee) కీలక వ్యాఖ్యలు చేశారు. తాను బతికి ఉండగా..ఏ ఒక్కరి ఓటు హక్కు కోల్పోనివ్వనని హామీ ఇచ్చారు. "మీ పేర్లు ఓటరు జాబితాలో ఉన్నాయో లేదో మీరే ఒకసారి చెక్ చేసుకోవాలి. మీ దగ్గర ఆధార్ కార్డులు జాగ్రత్తగా ఉంచుకోండి." అని కోరారు. బీజేపీ(BJP)కి చెందిన సుమారు 500 బృందాలు జాబితా నుంచి ఓటర్ల పేర్లను తొలగించేందుకు సర్వే చేస్తున్నాయని ఆరోపించారు. తృణమూల్ కాంగ్రెస్ (TMC) విద్యార్థి విభాగం - తృణమూల్ కాంగ్రెస్ ఛత్ర పరిషత్ (టీఎంసీపీ) వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని కోల్‌కతాలో నిర్వహించిన ర్యాలీలో ఆమె ప్రసంగించారు.
‘మా ఆఫీసర్లను బెదిరిస్తున్నారు.’
కేంద్ర ఎన్నికల సంఘంపై కూడా విమర్శలు గుప్పించారు. తమ రాష్ట్ర ప్రభుత్వ అధికారులను బెదిరింపులకు గురిచేస్తోందని ఆరోపించారు. "ఈసీ మా అధికారులను బెదిరిస్తోంది. వారి పెత్తనం ఎన్నికల సమయంలో మూడు నెలలు మాత్రమే.. ఏడాది పొడవునా కాదు" అని అన్నారు.
‘భాషా ఉగ్రవాదాన్ని సహించం..’
దేశంలోని ఇతర ప్రాంతాలలో ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బెంగాలీ వలస కార్మికులపై జరుగుతున్న దాడులను తృణమూల్ చీఫ్ వ్యతిరేకిస్తున్నారు. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో బెంగాలీలు పోషించిన పాత్రను ప్రజలు మరచిపోయేలా చేయడానికి కాషాయ పార్టీ చూస్తోందని ధ్వజమెత్తారు.
"బెంగాలీ భాష లేకపోతే జాతీయ గీతం ఏ భాషలో ఉండేది? స్వాతంత్ర్య ఉద్యమంలో బెంగాలీలు పోషించిన చారిత్రక పాత్రను ప్రజలు మరచిపోవాలని కోరుకుంటున్నారు. భాషా ఉగ్రవాదాన్ని మేం సహించం" అన్నారు.
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) నేతృత్వంలోని వామపక్షాలను కూడా మమతా తీవ్రంగా విమర్శించారు. తనను ఎదుర్కోవడానికి బీజేపీతో చేతులు కలిపారని ఆరోపించారు. "బ్రిటిష్ వారికి భయపడి నేతాజీ సుభాష్ చంద్రబోస్ దేశం విడిచి పారిపోయారని కేరళలోని సీపీఐ(ఎం) ప్రభుత్వం ఆరోపిస్తోంది. దీన్ని మేం ఖండిస్తున్నాం" అని అన్నారు.