గౌహతికి ప్రముఖ గాయకుడు జుబీన్ గార్గ్ మృతదేహం..
x

గౌహతికి ప్రముఖ గాయకుడు జుబీన్ గార్గ్ మృతదేహం..

అంబులెన్స్ వెంట భారీగా అభిమానులు.. స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో భౌతిక కాయం..దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన అస్సాం సీఎం హిమంతా, ప్రధాని మోదీ, కాంగ్రెస్‌ నేత రాహుల్..


Click the Play button to hear this message in audio format

అస్సాంకు చెందిన ప్రముఖ గాయకుడు జుబీన్ గార్గ్ (Zubeen Garg) (52) శుక్రవారం సింగపూర్‌లో ప్రమాదవశాత్తు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన భౌతికకాయం శనివారం ఢిల్లీ నుంచి గౌహతి(Guwahati)కి చేరుకుంది. భౌతికకాయాన్ని విమానాశ్రయం నుంచి కహిలిపారాలోని ఆయన నివాసానికి అంబులెన్స్‌లో తీసుకెళ్తుండగా జుబీన్ అభిమానులు రోడ్లమీదకు భారీగా తరలివచ్చారు. రహదారులన్నీ కిక్కిరిసిపోయాయి.

స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో భౌతిక కాయం..

చివరి చూపు కోసం జుబీన్ భౌతిక కాయాన్ని గౌహతిలోని సారుసజైలోని అర్జున్ భోగేశ్వర్ బారువా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో సోమవారం ఉదయం 9 నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఉంచనున్నారు. విమానాశ్రయంలో జుబీన్ శవపేటికను చూసి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. భార్య కుప్పకూలిపోయారు.


అంత్యక్రియలపై సందిగ్ధం..

జుబీన్ అంత్యక్రియల వివరాలు ఇంకా వెల్లడించలేదు. ఎక్కడ నిర్వహించాలన్న దానిపై అస్సాం మంత్రివర్గం ఆదివారం సాయంత్రం నిర్ణయం తీసుకుంటుంది. కుటుంబ సభ్యుల అభిప్రాయాన్ని కూడా మంత్రి వర్గం పరిగణనలోకి తీసుకోనుంది. గౌహతి, చుట్టుపక్కల ప్రాంతాలలో దహన సంస్కారాలకు అనువైన స్థలం కోసం ప్రభుత్వం అన్వేషిస్తోందని మంత్రి రనోజ్ పెగు తెలిపారు.

కాగా జుబీన్ బాల్యం ఎగువ అస్సాంలోని జోర్హాట్‌ గడిచింది. ఆయన సృజనాత్మకతకు అడుగులు పడింది కూడా అక్కడే కావడంతో అంత్యక్రియలు అక్కడ నిర్వహించాలన్నది కొంతమంది కుటుంబ సభ్యులు, బంధువుల అభిప్రాయం. గౌహతి నుంచి 300 కిలోమీటర్ల దూరంలో జోర్హాట్‌ ఉంటుంది. అంతదూరం తీసుకెళ్లడంపై సాధ్యాసాధ్యాలను కూడా ఆలోచిస్తున్నారు.

ఎలా చనిపోయారు?

నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్ కోసం సింగపూర్‌‌(Singapore)కు వెళ్లిన జుబీన్ ప్రమాదవశాత్తు చనిపోయారు. విహారనౌకలో సముద్రయానానికి వెళ్లిన ఆయన..లైఫ్‌ జాకెట్‌ ధరించకుండా ఈతకు వెళ్లి ప్రమాదానికి గురయ్యారని వార్తలు వస్తున్నాయి. వెంటనే ఆయనను సింగపూర్‌ జనరల్‌ హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే ఆయన చనిపోయాడని వైద్యులు ధృవీకరించారు.


40 భాషల్లో 38వేల పాటలు పాడిన జుబీన్..

జుబీన్ 40 భాషల్లో సుమారు 38వేలకు పైగా పాటలు పాడారు. మూడు దశాబ్దాలకు పైగా తన అభిమానులను తన గానంతో ఊర్రూతలూగించారు. ‘యా అలీ..’ అనే హిందీ పాటతో ఆయనకు దేశవ్యాప్తంగా పేరొచ్చింది. గదర్, దిల్‌ సే, డోలీ సజాకే రఖనా, ఫిజా, కాంటే, జిందగీ తదితర సినిమాలకూ తన గళాన్ని అందించారు. అనేక సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. దర్శకుడిగా కొన్ని సినిమాలు కూడా తీశారు. కొన్నింటిలో నటించారు. జుబిన్‌ మృతిపై అస్సాం(Assam) సీఎం హిమంతా ప్రధాని మోదీ, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తదితరులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Read More
Next Story