క్యాబినెట్‌లో భారీ ప్ర‌క్షాళ‌న జ‌ర‌గ‌నుందా?
x

క్యాబినెట్‌లో భారీ ప్ర‌క్షాళ‌న జ‌ర‌గ‌నుందా?

5గురు మంత్రులు ప‌నిచేయ‌డం లేదట‌!


రేవంత్ క్యాబినెట్‌లో భారీ ప్రక్షాళనకు అధిష్టానం ముహూర్తం పెట్టేసింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ ఒక్కో మంత్రికి సంబంధించి శాఖా ప‌రంగా, జిల్లా ఇన్‌చార్జి మంత్రులుగా, రాజకీయ నాయకులుగా వ్యవహరించిన తీరును పరిగణనలోకి తీసుకుని సమగ్ర నివేదికను త‌యారు చేసి ఢిల్లీ పంపారు. జ‌న‌వ‌రి నెల‌లో జ‌ర‌గ‌నున్న ప్ర‌క్షాళ‌న‌లో పనితీరు బాగా లేని కొంత మంది మంత్రులను తప్పించి.. అదే వర్గానికి చెందిన మరికొందరికి అవకాశం కల్పించనున్నారని గాంధీభ‌వ‌న్‌లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అలాగే కీలకమైన శాఖలు నిర్వహిస్తున్న కొందరు మంత్రుల నుంచి వాటిని తప్పించి వేరే శాఖలు కేటాయించే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే ఖాళీగా ఉన్న రెండు సీట్లు సహా నలుగురైదుగురికి కొత్తగా అవకాశం దొరకనుంది. అలాగే ప్రభుత్వ చీఫ్‌ విప్‌, ఇతర పదవులనూ భర్తీ చేయనున్నారు.

"సి.ఎం. రేవంత్ రెడ్డి చెప్పే విష‌యాల్ని కాంగ్రెస్ అధిష్ఠానం సీరియ‌స్‌గా తీసుకోవ‌డం లేదు. రెండేళ్ళైనా ఇంకా పాల‌న‌పై ప‌ట్టు రాలేదు. తెలంగాణాలో పార్టీ బ‌ల‌ప‌డ‌లేదు. ఈ నేప‌థ్యంలో ఫ్రీ హ్యాండ్ ఇస్తే అస‌లుకే మోసం వ‌స్తుంద‌ని ఢిల్లీ పెద్ద‌లు భ‌య‌ప‌డుతున్నారని" సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ చ‌ల‌సాని న‌రేంద్ర ది ఫెడ‌ర‌ల్ తెలంగాణాతో చెప్పారు. సీఎం, డిప్యూటీ సీఎంలు స్వయంగా సిఫార్సు చేసిన వారికే మంత్రి పదవులు నిరాకరించడం అంటే వీళ్ళ మాట ఢిల్లీలో చెల్లుబాటుకోవ‌డం లేద‌ని పార్టీలోనూ ప్రచారం జరుగుతోంది. సి.ఎం. రేవంత్ రెడ్డి అజారుద్దీన్‌కు ఎమ్మెల్యే టికెట్ రాకుండా అడ్డుకుంటే కాంగ్రెస్ అధిష్టానం నేరుగా మంత్రి చేయ‌డం వెనుక మ‌త‌ల‌బు అదేన‌ని చ‌ల‌సాని న‌రేంద్ర విశ్లేషించారు.


Read More
Next Story