కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట, 9 మంది భక్తుల మృతి
x

కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట, 9 మంది భక్తుల మృతి

పీఎం జాతీయ సహాయ నిధి నుంచి ఎక్స్‌గ్రేషియా ప్రకటన


శ్రీకాకుళం జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాశీబుగ్గ పట్టణంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం జరిగిన తొక్కిసలాటలో 9 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. కార్తీక మాస ఏకాదశి సందర్భంగా భారీగా భక్తులు పోటెత్తడంతో ఈ దుర్ఘటన జరిగింది.

కాశీబుగ్గ వేంకటేశ్వర స్వామి ఆలయం 'చిన్న తిరుపతి'గా పేరుగాంచిన పవిత్ర క్షేత్రం. ఇక్కడ శ్రీవారి మూల విరాట్‌తో పాటు శ్రీదేవి, భూదేవి అమ్మవారు, ఆంజనేయ స్వామి, గరుడ విగ్రహాలు కొలువుదీరాయి. శనివారం ఏకాదశి కావడంతో ఉదయం నుంచే భక్తులు భారీ సంఖ్యలో దర్శనం కోసం తరలి వచ్చారు. దర్శన మార్గంలో జనసమూహం పెరగడంతో అకస్మాత్తుగా తొక్కిసలాట చోటు చేసుకుంది.

ప్రత్యక్ష సాక్షుల మాట్ల ప్రకారం, భక్తుల తాకిడికి రెయిలింగ్ (కాంతి గోడ) ఊడిపోవడంతో పలువురు కిందపడ్డారు. దీంతో మిగిలినవారు ఒకరిపై ఒకరు పడిపోయి, తీవ్ర స్పృహలోపం, గాయాలు పాలయ్యారు. ఘటన స్థలానికి రక్షణ బృందాలు, పోలీసులు, ఆసుపత్రి సిబ్బంది చేరుకొని హుటాహుటిగా సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దగ్గరలోని ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రైవేట్‌ హాస్పిటల్స్‌కు తరలించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు.

ఈ ఘటనపై స్పందించిన ప్రధాని మోదీ, "కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట అత్యంత బాధాకరం. తమ సన్నిహితులను, కుటుంబసభ్యులను కోల్పోయిన వారికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను" అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (PMNRF) నుంచి రూ. 2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. గాయపడిన వారికి రూ. 50,000 ఆర్థిక సహాయం అందిస్తామని ప్రధాని కార్యాలయం వెల్లడించింది.



Read More
Next Story