హైదరాబాద్‌లో వీధికుక్కల దాడిలో మరో చిన్నారి మృతి,స్పందించిన రేవంత్!

31 July 2024 6:56 AM GMT

హైదరాబాద్‌లో వీధికుక్కల దాడిలో మరో చిన్నారి మృతి, మున్సిపల్ సిబ్బందిపై స్థానికుల ఆగ్రహావేశాలు, స్పందించిన సీఎమ్

మేడ్చల్ జిల్లా జవహర్‌ నగర్‌లో ఇంటి బయట ఆడుకుంటున్న విహాన్ అనే బాలుడిపై కుక్కలు దాడి చేశాయి. స్థానికులు గమనించి కుక్కలను తరిమి.. బాలుడి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. వెంటనే విహాన్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం గాంధీ ఆస్పత్రిలోని ఎమర్జెనీ విభాగానికి తీసుకెళ్లారు. కానీ కుక్కల దాడిలో ఒళ్లంతా గాయాలు కావడంతో పరిస్థితి విషమించి బాలుడు చనిపోయాడు. జవహర్‌నగర్‌లో వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉందని, ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు సమస్యను పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపించారు. బాలుడి మరణం తట్టుకోలేక తల్లి విలవిలలాడుతుంది.

మరోవైపు బాలుడు మృతి చెందిన ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి చెందడం తనను కలిచివేసిందన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. వీధి కుక్కల బెడద ఉన్న ప్రాంతాల్లో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించడానికి కాల్ సెంటర్ లేదా టోల్ ఫ్రీ నెంబర్‌ను తక్షణమే ఏర్పాటు చేయాలని చెప్పారు. పశు వైద్యులు, బ్లూ క్రాస్ వంటి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. బస్తీలు, కాలనీలు, సంబంధిత వార్డు కమిటీల సహకారం తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ, మున్సిపల్ అధికారులను సీఎం సూచించారు.