హమ్మయ్య! ఉత్కంఠ తొలగిపోయింది!

31 July 2024 12:13 PM IST

రెండు రోజులనుంచి ఏపీలో చాలామందిని వేధిస్తున్న సమస్య తొలగిపోయింది. ఉత్కంఠ వీడిపోయింది. అమెరికా ఉపాధ్యక్ష పదవికి పోటీ పడుతున్న వేన్స్ భార్య చిలుకూరి ఉషది ఏ కులం అన్నదానిపై తీవ్రస్థాయిలో చర్చ జరిగింది

రెండు రోజులనుంచి ఏపీలో చాలామందిని వేధిస్తున్న సమస్య తొలగిపోయింది. ఉత్కంఠ వీడిపోయింది. అమెరికా ఉపాధ్యక్ష పదవికి పోటీ పడుతున్న వేన్స్ భార్య చిలుకూరి ఉషది ఏ కులం అన్నదానిపై తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. ఆమె అయితే కమ్మ, లేకపోతే బ్రాహ్మణ అయిఉండొచ్చని ఊహాగానాలు సాగాయి. గూగుల్‌లో తీవ్రంగా సెర్చ్ చేశారు. దీనిపై వాదోపవాదాలు, పోస్టులు, కామెంట్లతో సోషల్ మీడియా హోరెత్తిపోయింది. చిలుకూరి అనే ఇంటిపేరు ఆ రెండు కులాలలోనే ఎక్కువగా ఉండటమే దీనికి కారణం.

అయితే ఎట్టకేలకు ముడి వీడిపోయింది. ఆమె పక్కా బ్రాహ్మణులని తేలిపోయింది. ఉష తండ్రి చిలుకూరి రాధాకృష్ణశాస్త్రిది కృష్ణాజిల్లా ఉయ్యూరు మండలం సాయిపురం గ్రామం. ఉష తల్లి లక్ష్మిది పామర్రు. ఉష తాత రామశాస్త్రి మద్రాస్ ఐఐటీలో ప్రొఫెసర్ గా చేసేవారు. ఆయనకు రాధాకృష్ణ శాస్త్రితో సహా ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. విశేషమేమిటంటే రామశాస్త్రి, ఆయన కుమారుడు రాధాకృష్ణశాస్త్రి కూడా మద్రాస్ ఐఐటీలోనే చదివారు. ముగ్గురు కుమారులూ అమెరికాలోనే స్థిరపడ్డారు.

ఉష తల్లిదండ్రులు ‘70లలోనే అమెరికాకు వలస వెళ్ళారు. తండ్రి రాధాకృష్ణశాస్త్రి అక్కడ ఒక ప్రముఖ ఏరోస్పేస్ కంపెనీలో మేనేజర్‌గా చేసి రిటైర్ అయ్యారు. అక్కడ ఆయను క్రిష్‌గా పిలుస్తారు. తల్లి లక్ష్మి శాన్ డియాగో యూనివర్సిటీలో మాలెక్యులర్ బయాలజీ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. ఉష కాకుండా వారికి శ్రేయ అనే ఇంకో అమ్మాయి ఉన్నారు. ఆమె శాన్ డియాగోలోనే ఒక సెమీ కండక్టర్ కంపెనీలో ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. ఉష మేనత్త శారద చెన్నైలో డాక్టర్‌గా పని చేస్తున్నారు.

మొత్తానికి చిలుకూరి ఉష వంశవృక్షం అంతా బయటపడటంతో ఏపీలో చాలామంది తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు.

మరోవైపు ఉష భర్త వేన్స్ ఆత్మకథ ఆధారంగా ఒక హాలీవుడ్ సినిమా కూడా తీసినట్లు బయటకొచ్చింది. ఆ సినిమా పేరు ‘హిల్‌బిల్లీ ఎలిజీ’. దానిలో ఉష పాత్రలో స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమా ఫేమ్ ఫ్రిదా పింటో అనే భారతీయురాలు నటించారు.

మొత్తానికి అమెరికాలో భారతీయుల హవా కొనసాగుతోంది. ఇప్పటికే అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ళ, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, అమెరికా అధ్యక్ష పదవికి అభ్యర్థులుగా గతంలో పోటీపడిన నిక్కీ హేలీ, వివేక్ రామస్వామి మొదలైన భారతీయ సంతతి అమెరికన్లు అక్కడ తమదైన ముద్రవేయగా, తాజాగా ఉష వారి సరసన చేరారు.

అయితే, దీనికి ఇంకో కోణంకూడా ఉంది. డెమోక్రాటిక్ పార్టీ తరపున కమల బై డిఫాల్ట్ ఉపాధ్యక్ష అభ్యర్థి అవుతారు, రిపబ్లికన్ తరపున ఉష భర్త వేన్స్ పోటీ చేస్తే, ఇది తమిళనాడు - ఆంధ్రప్రదేశ్‌లమధ్య పోటీగా మారుతుందని సోషల్ మీడియాలో జోక్స్ పేలుతున్నాయి.