‘విజయ్’ ను సమస్యలు చుట్టుముట్టనున్నాయా?
x

‘విజయ్’ ను సమస్యలు చుట్టుముట్టనున్నాయా?

కరూర్ తొక్కిసలాట ఘటనపై దళపతిని ఢిల్లీలో ప్రశ్నించాలని నిర్ణయం తీసుకున్న సీబీఐ


టీవీకే(TVK) నిర్వహించిన ఎన్నికల ర్యాలీ సందర్భంగా కరూర్(Karur) లో తొక్కిసలాట జరిగి 41 మంది మరణించారు. ఈ దుర్ఘటనపై సీబీఐ(CBI) తాజాగా టీవీకే అధిపతి, సినీ నటుడు విజయ్(Vijay) ను ఢిల్లీ లో ప్రశ్నించాలని నిర్ణయం తీసుకుంది.

దళపతిని ప్రశ్నించాలనే నిర్ణయం రావడం తమిళనాడులో మారుతున్న రాజకీయ సమీకరణాలు తెలియజేస్తోంది. ఈ సమయంలోనే ఎందుకు విచారణ చేస్తున్నారనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరగడానికి దారితీసింది.


తొక్కిసలాటపై విచారణ చట్టపరంగా మంచిదే కానీ దాని అమలులో మాత్రం కచ్చితంగా రాజకీయ కోణం ఉందని ‘ది ఫెడరల్’ ఎడిటర్ ఇన్ చీఫ్ ఎస్. శ్రీనివాసన్ అభిప్రాయపడ్డారు.
‘టాకింగ్ సెన్స్ విత్ శ్రీని’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. తమిళనాడులో లేదా ఢిల్లీలో విచారణ జరిపే విషయంలో ఎలాంటి చట్టపరమైన ఆదేశాలు లేవనే సంగతిని తెలియజేశారు.
ఇది దర్యాప్తు అధికారి ఇష్టానుసారం ఉంటుందని చెప్పారు. ‘‘కానీ విజయ్ ను పిలిచిన సమయం, విచారించే స్థలం రెండింటిని కలిపి చూసినప్పుడు దీని వెనక రాజకీయం ఉందని అర్థం చేసుకోవడం పెద్ద కష్టం కాదు’’ అన్నారు.
ఎన్నికల ముందు..
తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగడానికి కేవలం రెండు నెలల సమయం మాత్రమే ఉంది. ప్రస్తుతం తమిళనాడు తన ఆధునిక చరిత్రలోనే అసాధారణంగా మారిన అస్థిరమైన ఎన్నికల దశను చూస్తోందన్నారు.
‘‘సంప్రదాయకంగా ఇక్కడ రెండు పార్టీల మధ్యే పోటీ ఉంది. వాటిలో ఒకటి డీఎంకే, మరొకటి అన్నాడీఎంకే. కానీ ఈ సారి పరిస్థితి అలా లేదు’’ అన్నారు. రెండు కూటముల్లో ఇంకా పొత్తు ఖరారు కాలేదని చెప్పారు.
విజయ్ ఈ రాజకీయాల్లోకి రావడం పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చిందని పేర్కొన్నారు. ద్విముఖ పోటీ కాస్త త్రిముఖ పోరుగా మారిందని శ్రీనివాసన్ విశ్లేషించారు. విజయ్ స్థాపించిన పార్టీని కచ్చితంగా ప్రభావం చూపుతుందని, దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
విజయ్ కీలకపాత్ర..
కరూర్ తొక్కిసలాటపై సీబీఐ విచారణలో జరిగిన జాప్యంపై శ్రీనివాసన్ ప్రశ్నించారు. ‘‘ఈ దుర్ఘటన జరిగి దాదాపు 100 రోజులు పూర్తయింది. ఇప్పుడే ఎందుకు ఢిల్లీకి పిలిపించాలి’’ అని ఆయన సందేహం వ్యక్తం చేశారు. భద్రతా చిక్కులు ఎక్కువగా ఉన్నప్పటికీ తమిళనాడులో నిర్వహించిన రాజీవ్ గాంధీ హత్య దర్యాప్తుకు ఇది విరుద్దంగా ఉందన్నారు.
విజయ్ చిత్రం జననాయగన్(Jana Nayagan) కు సీబీఎఫ్సీ(CBFC) సర్టిఫికెట్ నిరాకరించడంతో వివాదం మరింత జఠిలమైందన్నారు. నిర్మాతలు బోర్డు సూచించిన సవరణలు చేయడానికి అంగీకరించినప్పటికీ దానికి ఇంకా సెన్సార్ సర్టిఫికెట్ రావడం లేదని చెప్పారు.
ఇప్పుడు దర్యాప్తు సంస్థలే కాకుండా, సీబీఎఫ్సీ వంటివి కూడా విజయ్ పై ఒత్తిడి తీసుకురావడానికి ఉపయోగిస్తున్నారనే ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ వాదనలను శ్రీనివాసన్ బలపరిచారు.
కరూర్ విచారణ, సెన్సార్ సర్టిఫికెట్, పొత్తులకు కలిసి రాకపోవడం వంటివి చూస్తే తమిళనాడు రాజకీయాల్లో విజయ్ మీద కేంద్రీకృతం కావడాన్ని సూచిస్తున్నాయని శ్రీనివాసన్ పేర్కొన్నారు.
‘‘ఇప్పుడతను(విజయ్) అంతరాయమా? తీవ్రమైన పోటీదారుడా? అనేది ఇప్పటికి అర్థం కాని విషయం’’ అని ఆయన చెప్పారు. కానీ రాష్ట్రంలో రాజకీయాలన్నీ కూడా విజయ్ చుట్టూనే తిరుగుతున్నాయని చెప్పారు.
Read More
Next Story