
అస్సాం ఎన్నికలలో బీజేపీతోనే బీజేపీ పోరాడుతోందా?
టికెట్లు రాకపోవడంతో స్వంతంత్రులుగా బరిలోకి దిగిన మాజీలు
అస్సాంలో ఎన్నికల వేళ బీజేపీకి సొంత మనుషుల నుంచి ఇబ్బంది ఎదురవుతోంది. పార్టీ నుంచి టికెట్ రాకపోవడంతో వారు కమలదళం వీడి స్వతంత్రంగా పోటీ చేస్తున్నారు. ఇది పార్టీలో ఉన్న అంతర్గత ఆధిపత్యాలు, కుమ్ములాటలను హైలైట్ చేస్తుంది.
అభ్యర్థుల మార్పులు, మాజీ కాంగ్రెస్ నాయకులకు పార్టీలో ప్రాధాన్యం ఇవ్వడంతో వారంతా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాలు ప్రతిపక్ష కాంగ్రెస్ కు ఏమైన లాభం చేకూరుస్తాయా అనే అంశంపై విశ్లేషించడానికి 'ది ఫెడరల్' పత్రిక రాజకీయ విశ్లేషకుడు దేబోజిత్ గోస్వామి, వ్యాఖ్యాత అఫ్రిదా హుస్సేన్, జర్నలిస్ట్ సమీర్ కర్ పుర్కాయస్థతో మాట్లాడింది.
బీజేపీలో కల్లోలం..
అస్సాంలోని మిత్రస్థానాలకు పోను మిగిలిన 88 స్థానాల్లో బీజేపీ సొంతంగా పోటీ చేస్తోంది. అయితే ఇందులో పలువురు మాజీ కాంగ్రెస్ నాయకులను బరిలోకి దింపుతూ, అతుల్ బోరాతో సహా పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలను బీజేపీ తొలగించడమే ఈ చర్చకు తక్షణ కారణం.
ఈ చర్య పార్టీలోని దీర్ఘకాల కార్యకర్తలలో తీవ్ర అసంతృప్తిని రేకెత్తించింది. ఈ గందరగోళానికి తోడు, సీనియర్ బీజేపీ నాయకుడు జయంత కుమార్ దాస్ 35 ఏళ్ల తర్వాత పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
ఆయన ప్రచార నినాదం కూడా “ప్రద్యుత్ హటావో, దిస్పూర్ బచావో,” అని బరిలోకి దూకారు. తనకు పార్టీ నుంచి బెదిరింపులు, మానసిక వేధింపులు ఎదురయ్యాయని ఆరోపించడమే కాకుండా, "కాంగ్రెస్-బీజేపీ కుమ్మక్కు" అయ్యాయాని ఆరోపిస్తున్నారు.
తిరుగుబాటు ధోరణి..
గత దశాబ్ద కాలంలో అస్సాంలో బీజేపీలో వచ్చిన మార్పుల దృష్ట్యా, ప్రస్తుత అశాంతి "ఊహించినదే" అని దేబోజిత్ గోస్వామి విశ్లేషించారు. "2015లో హిమంత బిస్వా శర్మ బీజేపీలో చేరినప్పటి నుంచి, చాలా మంది కాంగ్రెస్ నాయకులు ఆ పార్టీలోకి మారారు.
సహజంగానే, పాత బీజేపీ కార్యకర్తలలో ఈ అసంతృప్తి ఉంది," అని ఆయన అన్నారు. 1990ల నుంచి బీజేపీతో అనుబంధం ఉన్న జయంత దాస్ వంటి నాయకులు, తమ చిరకాల విధేయత కనపరిచినప్పటికీ వారికి ప్రస్తుత ఎన్నికలలో టికెట్లు నిరాకరించారు. దీనితో వారిలో ఆగ్రహం కట్టలు తెగింది.
టిక్కెట్ల రాజకీయాలు
టిక్కెట్ల పంపిణీ ఎలా ఒక వివాదాస్పద అంశంగా మారిందో ఈ ప్యానెల్ హైలైట్ చేసింది. మాజీ రాష్ట్ర అధ్యక్షుడు సిద్ధార్థ్ భట్టాచార్యతో సహా పలువురు సీనియర్ నాయకులకు బీజేపీ టిక్కెట్లు నిరాకరించింది. పార్టీని నిర్మించడంలో సాయపడిన వారి స్థానంలో కొత్తగా చేరిన వారిని తీసుకుంటున్నారని, ఇది ఒక "విడ్డూరం" అని గోస్వామి అభిప్రాయపడ్డారు. ఈ ఎన్నికలను చాలా మంది నాయకులు తమ "చివరి అవకాశం"గా భావించవచ్చని, ఇది తిరుగుబాటుకు స్వతంత్ర అభ్యర్థిత్వాలకు దారితీస్తుందని కూడా ఆయన విశ్లేషించారు.
బీజేపీ గుర్తింపుకు ప్రమాదం..
ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ నాయకత్వంలో అస్సాంలోని బీజేపీ రూపాంతరం చెందుతోందని అఫ్రిదా హుస్సేన్ అన్నారు. “ఆయన పాత బీజేపీ కార్యకర్తలతో సౌకర్యంగా ఉన్నట్లు కనిపించడం లేదు. కాంగ్రెస్ నుంచి వలసలు ఇప్పటికీ జరుగుతున్నాయి” అని ఆమె అన్నారు. మాజీ కాంగ్రెస్ నాయకుల రాక పార్టీ గుర్తింపును మారుస్తోందని , ఆ పార్టీ “కాంగ్రెస్ బీజేపీ”గా మారుతోందని ఆమె అభివర్ణించారు.
నాయకత్వ మార్పు..
సర్బానంద సోనోవాల్, సిద్ధార్థ్ భట్టాచార్య వంటి నాయకులను పక్కన పెట్టడాన్ని కూడా అఫ్రిదా ప్రస్తావించారు. “హిమంతను బీజేపీలోకి తీసుకువచ్చిన వ్యక్తికి టికెట్ లభించలేదు. ఇది అధికార సమీకరణాల్లో స్పష్టమైన మార్పును చూపిస్తుంది,” అని ఆమె అన్నారు. ఒకప్పుడు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న నాయకులపై బీజేపీ ఆధారపడటం, మార్పు తెస్తామన్న పార్టీ అసలు వాగ్దానంపై ప్రశ్నలు లేవనెత్తుతోందని ఆమె అన్నారు.
మారుతున్న బీజేపీ..
అస్సాంలోని పరిణామాలను సమీర్ పుర్కాయస్థ విస్తృత జాతీయ సందర్భంలో విశ్లేషించే ప్రయత్నం చేశారు. “ఇది కేవలం అస్సాంకు మాత్రమే పరిమితం కాదు. దేశంలోని అనేక రాష్ట్రాలలో బీజేపీ ఇతర పార్టీల నాయకులపై ఎక్కువగా ఆధారపడుతోంది,” అని ఆయన అన్నారు. కొత్తగా చేరిన వారికి ప్రాధాన్యత ఇస్తుండటంతో, పాత నాయకులు ఒంటరితనానికి లోనవుతున్నాని, పార్టీ స్వరూపం మారుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.
పశ్చిమ బెంగాల్, మణిపూర్ వంటి రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ధోరణులే కనిపించాయని పుర్కాయస్థ పేర్కొన్నారు. "కొన్ని రాష్ట్రాల్లోని బీజేపీ యూనిట్లు మొత్తం ఇప్పుడు ఇతర పార్టీల మాజీ నాయకులతోనే నిండిపోయాయి," అని ఆయన అన్నారు. నరేంద్ర మోదీ, అమిత్ షా నేతృత్వంలోని కేంద్ర నాయకత్వం తీసుకున్న వ్యూహాత్మక ఎత్తుగడనే ఈ మార్పు ప్రతిబింబిస్తోందని ఆయన అన్నారు.
ఎన్నికల ప్రభావం
అస్సాంలోని బీజేపీ అంతర్గత అశాంతి ఎన్నికల పోటీని మరింత ఆసక్తికరంగా మార్చిందని ప్యానెల్ అంగీకరించింది. "కొన్ని వారాల క్రితం వరకు, బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయంగా కనిపించింది. కానీ ఇప్పుడు, సొంత పొరపాట్ల వల్ల, పోరాటం నువ్వా, నేనా అన్నట్లు ఆసక్తికరంగా మారింది," అని పుర్కాయస్థ అన్నారు. నియోజకవర్గాల వ్యాప్తంగా పార్టీ కార్యకర్తల రాజీనామాలు, నిరసనలతో సహా తిరుగుబాటుకు సంబంధించిన అనేక ఉదంతాలను కూడా ఆయన ఉదహరించారు.
కాంగ్రెస్‌కు అవకాశం
బీజేపీ అంతర్గత సంక్షోభం కాంగ్రెస్‌కు స్పష్టమైన అవకాశాన్ని ఇస్తుందని గోస్వామి అన్నారు. "దీన్ని సద్వినియోగం చేసుకోవడానికి బీజేపీ కాంగ్రెస్‌కు అవకాశం ఇచ్చింది. కానీ కాంగ్రెస్ దాన్ని ఎంత సమర్థవంతంగా ఉపయోగించుకుంటుందనే దానిపై ఆధారపడి ఉంటుంది," అని ఆయన అన్నారు. అయితే, గౌరవ్ గోగోయ్ తర్వాత కాంగ్రెస్‌కు ప్రస్తుతం బలమైన నాయకత్వం కొరవడిందని, ఇది పరిస్థితిని పూర్తిగా సద్వినియోగం చేసుకునే దాని సామర్థ్యాన్ని పరిమితం చేయగలదని సంకేత్ అభిప్రాయపడ్డారు.
క్షేత్రస్థాయి పరిస్థితి ఏంటీ
స్థానిక పరిస్థితులు, బీజేపీ శ్రేణులలోని అసంతృప్తి కారణంగా కొన్ని ప్రాంతాలలో కాంగ్రెస్‌కు స్పష్టమైన 'వేవ్' కనిపిస్తోందని అఫ్రిదా హుస్సేన్ పేర్కొన్నారు. ప్రముఖ కేసులలో న్యాయం ఆలస్యం కావడం, కూటమి భాగస్వాములలో అంతర్గత అసంతృప్తి వంటి సమస్యలను కూడా ఆమె ప్రస్తావించారు. అదే సమయంలో, బీజేపీ సంక్షేమ పథకాలు, ముఖ్యంగా గ్రామీణ మహిళలను లక్ష్యంగా చేసుకున్నవి, ఇప్పటికీ కీలక పాత్ర పోషించగలవని ఆమె హెచ్చరించారు.
ముగింపు..
అస్సాం రాజకీయ రంగం ఒక అరుదైన కల్లోలానికి సాక్ష్యమిస్తోందని ప్యానెల్ నిర్ధారించింది. బీజేపీ అంతర్గత తిరుగుబాటు, సంస్థాగత ఒత్తిడిని ఎదుర్కొంటుండగా, కాంగ్రెస్‌కు ఒక అవకాశం లభించింది. కానీ దానిని ఎన్నికల లాభాలుగా మార్చుకోవడానికి అది నిర్ణయాత్మకంగా వ్యవహరించాలి. అఫ్రిదా దీనిని సంగ్రహిస్తూ, “ఈసారి, కాంగ్రెస్ కాంగ్రెస్‌తో పోరాడటం కాకపోవచ్చు. బీజేపీ బీజేపీతో పోరాడవచ్చు” అని అన్నారు.
Next Story

