
ట్రంప్ మాటల వెనక ఉన్న అర్థం ఏమిటీ?
పొద్దున్న గంభీర ప్రకటనలు, సాయంత్రం శాంతి చర్చలని ఎందుకు ప్రకటిస్తున్నాడు..
పశ్చిమాసియాలో నెల రోజులుగా యుద్ధం జరుగుతోంది. ఇరాన్ హార్ముజ్ జలసంధిని తన ఆధీనంలోకి తీసుకోవడంతో ప్రపంచ చమురు రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ సమస్యలు పరిష్కారం కానప్పటికీ ట్రంప్ మాత్రం రోజుకో మాట మాట్లాడుతూ పరిస్థితిని మరింత క్లిష్టంగా మారుస్తున్నాడు.
'ఇరాన్‌ను తుడిచిపెట్టేస్తామని' ఒకసారి, చర్చలు జరుపుతున్నాడని మరొసారి చెబుతూ గందరగోళం సృష్టిస్తున్నాడు. ఆయన వ్యవహర శైలి, అమెరికా వ్యూహాలపై ‘ది ఫెడరల్’ నిర్వహించిన చర్చలలో వ్యూహాత్మక వ్యవహారాల నిఫుణుడు డాక్టర్ వాయెల్ అవ్వాద్, మాజీ దౌత్యవేత్త అనిల్ త్రిగుణాయత్ లు మాట్లాడారు. వారు ఈ అంశంపై తమ విశ్లేషణను అందించారు.
ఫ్లిప్- ఫ్లాప్ నమూనా...
ట్రంప్ మాటలన్నీ కూడా ఉదయం ఎగదోయడం, సాయంత్రం దిగేయడంలా ఉన్నాయి. ఆయన ఇరాన్ నాయకత్వం, చమురు కేంద్రాలు, ఇంధన మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటామని తనదైన శైలిలో మాట్లాడటం, సాయంత్రం చర్చలకు సిద్ధంగా ఉన్నామని సంకేతాలు ఇస్తున్నారు.
ఈ అంశంపై అవ్వాద్ మాట్లాడుతూ.. ట్రంప్ ది బలహీన మనస్తత్వంగా అభివర్ణించారు. ఇటువంటి ప్రకటనలు అమెరికా ప్రపంచ ప్రతిష్టను బలహీనపరిచి, దానిని అస్థిరంగా, విశ్వసనీయత లేనిదిగా మారుస్తున్నాయని చెప్పారు.
త్రిగుణాయత్ మాట్లాడుతూ..దీనిని గందరగోళం, నిర్భంధంగా అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా యుద్ధం మొదట్లో ఊహించిన విధంగా జరగనందున, ట్రంప్ "తన ప్రకటనలను, లక్ష్యాలను మారుస్తూనే ఉన్నారని" ఆయన అన్నారు.
యుద్ధ అంచనా తప్పిందా?
సంఘర్షణ ప్రారంభంలో జరిగిన తప్పుడు అంచనాలను ఇద్దరు నిపుణులు ఎత్తి చూపారు. యుద్ధం ప్రారంభిస్తే త్వరలోనే విజయం సాధిస్తామనే తప్పుడు సమాచారం ఆయనకు అందించి ఉండవచ్చని అందుకే ఇలా బరిలోకి దిగారని అవ్వాద్ అన్నారు. ఇరాన్ కూడా ఇంతలా ప్రతిఘటిస్తుందని వారు అనుకోలేదని, వెంటనే వ్యూహం మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడిందని చెప్పారు.
ఇరాన్ ఎదురుదాడి సామర్థ్యాలు వాషింగ్టన్‌ను ఆశ్చర్యపరిచాయి. ఆ ప్రాంతంలోని అమెరికా ఆస్తులపై దాడులు, ప్రపంచ చమురు మార్గాలలో అంతరాయాలు, తమ వైఖరిని పునఃపరిశీలించుకోవడానికి ప్రభుత్వంపై ఒత్తిడిని సృష్టించాయి. త్రిగుణాయత్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు.
అమెరికా "ఎలాంటి వ్యూహం లేదా యుద్ధ ముగింపు ప్రణాళిక లేకుండా" ఘర్షణలోకి ప్రవేశించిందని పేర్కొన్నారు. ప్రారంభ దాడులు ఇరాన్ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నప్పటికీ, అవి ఇరాన్ ప్రతిఘటనను ఆపడంలో విఫలం అయ్యాయి.
ఇజ్రాయెల్ పాత్ర..
ఈ విశ్లేషణలలోనూ ఇజ్రాయెల్ ప్రభావంపై ప్రధానంగా చర్చ జరిగింది. ఇరాన్‌తో ప్రత్యక్ష ఘర్షణలోకి అమెరికాను లాగడానికి ఇజ్రాయెల్ నాయకత్వం చాలా కాలంగా ప్రయత్నిస్తోందని డాక్టర్ అవ్వాద్ అన్నారు. వాషింగ్టన్ వెనక్కి తగ్గే సంకేతాలు చూపినప్పుడల్లా, ఇజ్రాయెల్ ఘర్షణను సజీవంగా ఉంచే విధంగా వ్యవహరిస్తుందని ఆయన చెప్పారు. ఇది ఒక స్థిరమైన పద్ధతిగా కొనసాగుతోందని ఆయన అన్నారు.
ఈ సంఘర్షణలో "ఇద్దరు కాదు, ముగ్గురు పాత్రధారులు" ఉన్నారని త్రిగుణాయత్ చెప్పారు. అయితే ఇందులో స్పష్టమైన లక్ష్యంతో ఇజ్రాయెల్ మాత్రమే ఉందని, ఉద్రిక్తతలను పెంచేందుకు అమెరికాను ఉసిగొల్పుతోందని వాదించారు.
మార్కెట్ ఎత్తులు..
ట్రంప్ ప్రకటనతో వ్యాపారాలలో ఒడిదుడుకులు వస్తున్నాయని, అవి ట్రంప్ తో పాటు కొంతమంది వ్యాపారులకు కలిసి వస్తున్నాయని అవ్వాద్ ఆరోపించారు. మార్కెట్లను ప్రభావితం చేయడానికి ప్రకటనలు సమయానికి అనుగుణంగా ఉండవచ్చని సూచించారు.
ట్రంప్ ప్రకటనలకు మార్కెట్లు స్పందించాయని త్రిగుణాయత్ అంగీకరించారు. ఉద్రిక్తత తగ్గుముఖం పట్టినట్లుగా భావించిన కాలాలు మార్కెట్లను స్థిరీకరించాయని, పరోక్షంగా కొన్ని వ్యాపార ప్రయోజనాలకు లబ్ధి చేకూర్చి ఉండవచ్చని పేర్కొన్నారు.
కొనసాగుతున్న దౌత్య ప్రయత్నాలకు ఈ సంఘర్షణ ఎలా అంతరాయం కలిగించిందో త్రిగుణాయత్ హైలైట్ చేశారు. సైనిక చర్య ప్రారంభం కావడానికి ముందు అమెరికా - ఇరాన్ మధ్య జరిగిన అనేక రౌండ్ల చర్చలు దాదాపు ఒక అవగాహనకు చేరుకున్నాయని ఆయన పేర్కొన్నారు.
ఇది నమ్మకాన్ని తీవ్రంగా దెబ్బతీసిందని ఆయన అన్నారు. అమెరికా మాటలకూ, చేతలకూ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రస్తావిస్తూ, "కేవలం ప్రకటనలపైనే ఆధారపడటం సాధ్యం కాదు," అని ఆయన పేర్కొన్నారు.
అమెరికా వైఖరి ఇప్పుడు చర్చల కన్నా డిమాండ్లు జారీ చేయడంపైనే ఎక్కువగా దృష్టి పెట్టినట్లు కనిపిస్తోందని, ఇది శాంతి అవకాశాలను మరింత క్లిష్టతరం చేస్తోందని డాక్టర్ అవ్వాద్ అన్నారు.
యుద్ధ విరమణ..
ట్రంప్ ఇప్పుడు నిష్క్రమణ వ్యూహం కోసం అన్వేషిస్తున్నారని ఇద్దరు నిపుణులు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. పదేపదే గడువులు, పొడిగింపులు ప్రకటించడం ఆయన సంకోచానికి సంకేతాలని పేర్కొన్నారు. అమెరికాలో వస్తున్న విమర్శలు, ప్రపంచ ఆర్థిక పతనం, మిత్రదేశాల నుంచి ప్రతిఘటన వంటి పలు రంగాల నుంచి ట్రంప్ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. ముఖ్యంగా అంతర్జాతీయ మద్దతు లేకపోవడం, పెరుగుతున్న దేశీయ అసంతృప్తి దృష్ట్యా ట్రంప్ చివరికి "విరమించుకోవచ్చని" త్రిగుణాయత్ సూచించారు.
భవిష్యత్ పరిణామాల
భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, నిపుణులు రెండు సాధ్యమైన మార్గాలను వివరించారు. అమెరికా వైదొలగడం ద్వారా ఈ సంఘర్షణ సద్దుమణగవచ్చని లేదా ఇది ఒక విస్తృత ప్రాంతీయ యుద్ధంగా మారవచ్చని త్రిగుణాయత్ అన్నారు.
ఉద్రిక్తతలు పెరిగితే, పశ్చిమ ఆసియాలో గతంలో జరిగిన సంఘర్షణల మాదిరిగా అంతర్యుద్ధం లాంటి పరిస్థితులు, గెరిల్లా యుద్ధం వంటివి చోటుచేసుకుని, దీర్ఘకాలిక అస్థిరతకు దారితీయవచ్చని ఆయన హెచ్చరించారు. ఇరాన్ లొంగిపోయే అవకాశం లేదని, దీర్ఘకాలిక ప్రతిఘటనను కొనసాగించే సామర్థ్యం దానికి ఉందని డాక్టర్ అవ్వాద్ స్పష్టం చేశారు. బాహ్య శక్తులు ఉద్రిక్తతలను పెంచడమా లేక తగ్గించడమా అనే దానిపైనే ఏదైనా పరిష్కారం ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు.
ఈ యుద్ధ ప్రభావం ఇప్పటికే యుద్ధభూమిని దాటి కనిపిస్తోంది. హార్ముజ్ జలసంధిలో ఏర్పడిన అంతరాయాలు ప్రపంచ ఇంధన మార్కెట్లను ప్రభావితం చేయగా, ఉద్రిక్తతలు ప్రాంతీయ శక్తులను కూడా ఇందులో భాగం చేశాయి.
చమురు, ఆయుధ పరిశ్రమల వంటి కొన్ని రంగాలు లబ్ధి పొందవచ్చని, కానీ విస్తృత పరిణామాలు నష్టదాయకంగా ఉంటాయని డాక్టర్ అవ్వాద్ వాదించారు. అస్థిరత, ఆర్థిక ఇబ్బందులు, అనిశ్చితి పెరుగుతూనే ఉండటంతో, అసలు భారాన్ని ఈ ప్రాంత ప్రజలే మోస్తున్నారని ఆయన ముగించారు.
Next Story

